చిన్నప్పటినుండి నాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయ్.కొన్ని పనులు చెయ్యాలని,కొన్ని ప్రదేశాలు చూడాలని,చిన్నా పెద్దా కోరికల లిస్టు ఉందిలే.పురావస్తు తవ్వకాల్లో బయట పడ్డట్టు,ఈ మధ్యనే నా చాంతాడు కోరికల చిట్టా బయటపడింది. Bucket List అనే సినిమా చూసి,సావకాశంగా అర్ధరాత్రి ఆలోచించి ఇక్కడ పొందుపర్చుకుంటున్నాను.
మరీ చిన్నప్పుడు లిల్లిపుట్లు దొరికితే బాగుండు అని మా పెరట్లో వెతకటం,మా తోటలో గులాబీల చేత ఎలాగైనా మాట్లాడించాలి అనుకోవటం,హిట్లర్ గురించి చదివి నేనూ కూడా ఒక నియంత గా మారి ఒక సామ్రాజ్యం స్థాపించాలి ఆకోవటంలాంటివన్నీ మామూలే.
ఫిజిక్స్ చదువుకునేప్పుడు,మేటర్,యనర్జి ఒకదానిలోకి ఒకటి మార్చచ్చు అని తెలుసుకుని,ఆ అంశం మీద ఒక నవల రాసేద్దాం అని బయల్దేరా.ఆ మాటే ఇంట్లో చెప్తే,ఫిజిక్స్ లో మర్కులు తగ్గుతున్నాయ్,బుద్ధిగా చదువుకొమ్మని నెత్తిన ఒక మొట్టికాయ పడింది.స్కూల్ లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద శాస్త్రవేత్తల పేర్లు అంత క్లిష్టంగా ఎందుకుంటాయో అర్ధమయ్యేది కాదు.నేనూ ఎప్పటికైనా ఏదైనా మంచి ఆవిష్కరణ చెయ్యాలి అనే కోరిక ఉన్నా,నా పేరు గుర్తుపెట్టుకోలేక పిల్లలు సతమతమవుతారని మానుకున్నాను.
కూని రాగాలు బాగా తీస్తున్నానని నాకు సంగీతం నేర్పబోతే,ఒక్క ఏడాదికల్లా,సాహిత్యాభిలాష ఎక్కువయ్యి,పాటలు వింటూ,నేనూ పాడటం మానేశా.అదే సమయంలో తాళం మీదకి మనసు మళ్ళి,సంగీతం వొద్దులే,నృత్యం నేర్చుకుంటాను అని ఎగిరాను. కుచపూడి నేర్చుకుందాం అనే మొదలెట్టాను.ఆరు నెలల తరువాత,కళలు కూడు పెట్టవురా,సదువుకో అని బలవంతం చేసి నన్ను హాస్టల్ లో పడేసి డాక్టర్ ని చేసేసారు.అందుకే మెడిసిన్ ఐపోయాక మళ్ళి ఒక డాన్స్ టీచర్ ని కలిసా.వైద్యం మానేసి,బుద్ధిగా రోజూ వచ్చి నేర్చుకుంటా అని మాట ఇవ్వమన్నది ఆవిడ.మళ్ళి ఇటూ వస్తే నీ మీద ఒట్టు అని మాట ఇచ్చేసి పారిపోయా.
ఘంటసాలగారిని,రాఫిగారిని,వారి పాటలు విన్నాక,ఒక్కసారైనా కలవలేకపోయానే అని చాలా బాధ పడ్డాను.నేనూ కాస్త ముందు పుట్టాల్సింది,లేదా వారు కాస్త ఆలస్యంగా గతించాల్సింది.మా టైమింగ్ మ్యాచ్ కాలేదులే.
చందమామ అంటే చాలా ఇష్టం నాకు.ఒక్కసారైనా ఆ చంద్రమండలం మీద కాలు మోపాలని ఒక కోరిక.నేనూ ఊహించిన కలల ప్రపంచంలా ఉండదని తెలుసు.ఐనా అవకాసం వస్తే నీలాల నింగి మెరిసిపడే నిండు చంద్రుడిని తాకాలనే కోరిక ఇంకా ఉంది.
ఒకప్పుడు భూమికి అవతలివైపు ఏముందో తెలుసుకోవాలనే కోరికతో,మా కారు గారేజీ లో తవ్వటం మొదలెట్టా.అది కూడా ఒక చిన్న పుల్లతో.అసలు అలా ఒక్క మూడు నెలలు తవ్వేసుకుంటూ పొతే నా కల సాకారం అవుతుందనే గట్టి నమ్మకం నాకు. కానీ ఈ లోపు వర్షాలు పడి,తవ్విన మూడు సెంటిమీటర్లు పూడుకుపోయింది.మళ్ళి అటూ వెళ్ళలేదు నేనూ.
సప్తర్షి మండలం లో ఒక నక్షత్రం రాలిపోతే చూడాలని ఒక కోరిక.ఇదేం వెర్రి కోరిక అని అడగద్దు.నాకెందుకో నక్షత్రాలు కూడా అశాశ్వతం అని తెలుసుకున్నప్పటి నుండి ఈ ఆలోచన ఎక్కువైయ్యింది.మరి నేనుండగా అది చూస్తానో లేక ఇంకో జన్మ ఎత్తాలో.
మంచు కొండలంటే నాకు చాలా ఇష్టం.అందులోను హిమాలయాలు అంటే చెప్పలేని మమకారం.గుంపుతో కాదు..ఒక్కదాన్నే వెళ్లి ఆ హిమరాజంతో ఊసులాడాలి.అక్కడ నిశ్శబ్దం వినాలి.త్వరలో సాకారం చేస్కోవాలి.అలాగే మానస సరోవరం కూడా చూసి రావాలి.అండమాను లో ప్రక్రుతి సౌందర్యం గురించి విన్నాను.షిప్పు లో వెళ్తే ఆ అందం ద్విగుణీకృతం అవుతుందట.కాబట్టి నా చిట్టాలో చేర్చేసాను.సముద్రగర్భం చూడాలని కూడా ఒక కోరిక.Into the deep.ఆ మంచు కొండైన ఈ సాగరగర్భమైనా యెంత ప్రశాంతంగా ఉంటాయో చుడాలిమరి.
నిండు పున్నమి వెన్నెల్లో,కాలికింద ఇసుకతెన్నెలు,అలా అలా పలకరించే అలలున్న సముద్రతీరం,మబ్బుల ముసుగు,పిల్లగాలి వీచే వేళ ఒక రేయి అంతా నిసితారలతో ముచ్చటించాలి అని కూడా కోరిక.నా మనసుకి నచ్చిన అలాంటి ప్రదేశం దొరకగానే ఆ కోరిక కూడా తీరుతుంది.ఆలోపు ఎత్తైన బాల్కానీలో నవ్వారు మంచం వేస్కుని,లైట్లు వేసాక సిటీ సొగసు,పౌర్ణమి నాటి చందమామ ముద్దుమోమును చుస్తూ,నచ్చిన పాత పాటలు వింటూ,హాట్ చాక్లెట్ తాగుతూ...
నవ్వకండి మరి! ఈ పని భారతదేశంలో మా స్వగ్రుహమునందు చేసితిమి.మరీ ఈ దేశం చలికి గడ్డ కడితే పట్టికెళ్ళి పొయ్యిమీద పెట్టేవాళ్ళు కూడా లేరు.అందుకే వేసవి వచ్చేదాకా ఆగుదాం అనుకుంటున్నాను.ఎప్పుడన్నా మీరు కూడా ప్రయత్నించండి.చాలా హాయిగా ఉంటుంది.
నేనూ ఏదేదో అనుకున్నా కానీ,మరీ పెద్ద చిట్టా ఎం లేదేంటి!ఇవాల్టికి ఇవాళ ఆలోచించినా సంతృప్తిగానే ఉంది.అందుకే నా అసలు కోరిక,జీవితాంతం నిండుగా,తృప్తిగా,సంపూర్ణమైన సంతోషంతో బ్రతకటమే.
19, డిసెంబర్ 2009, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Nee asalanni twaralone teeralani manaspoorthiga aseervadistunnanu papa.. devudu ninnu challaka choodu gaka..
రిప్లయితొలగించండిmeeru pandinche haasyam mee santoshaaniki beeam vesi mimmalni samtruptito batakanivvaalani aasistaanu !
రిప్లయితొలగించండిపొగడలేకుండా ఉండలేకపొతున్నాను..పని లేదా వీడికి ఏం రాసినా పొగిడేస్తున్నాడనుకొకండి..అసలు ఏం భావం ఎంత భావుకత!! ఆ పదాల్లో తేలికత్వం... ఆ వాడుక భాషా ప్రయోగం....ఏమని పొగడను..ఎంతని పొగడను!! చదివి ఆ అనుభూతిని ఆస్వాదించడం తప్ప
రిప్లయితొలగించండి