8, డిసెంబర్ 2009, మంగళవారం

బుజ్జి తంటాలు

అవును మరి,బుజ్జి అనే పేరు పెట్టుకుని ఈ ప్రపంచం లో నెగ్గుకురావటం యెంత కష్టమో మీకేం తెలుసు.ఆ..తెలిసే  ఉంటుంది లెండి.మన ఆంద్ర రాష్ట్రం లో నూటికి డెబ్భై మంది ముద్దు పేరు బుజ్జే గా మరి.ఇది చదువుతున్న మీలో ఎందరు బుజ్జి నామ భాదితులో కదా(బా కి వొత్తు భా).ఇంక మిగిలిన వారికి బుల్లి,చిట్టి,లలలి,బల్లి అని ఏ పేరు పెట్టినా,బుజ్జి ప్రత్యేకత బుజ్జిదే

నిజం.ఎక్కడైనా సెంటర్ లో కుర్చుని బుజ్జీ అని గతిగా పిలిచి చుడండి.వెనువెంటనే మీ పక్కనుండి ఓ..య్ అని కేక వినిపిస్తుంది. అసలు బుజ్జి అని పిలిపించుకోవటానికి ఆకారం తో పనేముంది.మనం మొహం చూసి వీడు హిట్లేర్ బామ్మర్దేమో అని అపోహ పడె వాడి దగ్గరనుండి,ఆజానుబాహువు,బుర్ర మీసాలు,గళ్ళ చొక్కా,పులిపిరి కాయ తో సహా అన్ని హంగులు ఉన్న వస్తాదు దాక ఎవరైనా "బుజ్జీ"" అయుండొచ్చు.అప్పుడే పుట్టిన పసి పాప ని చూసి బుజ్జిది భలే ఉందే అంటారు..పక్కనే ఉన్న చెట్టంత నన్ను చూసి కూడా ఎం బుజ్జి బాగున్నావా అంటారు.అసలు బుజ్జి అమ్మమ్మ,బుజ్జి పిన్ని,బుజ్జి మామయ్యా,బుజ్జి బాబాయి..ఇలా ప్రతి ఇంట్లో ఒకటి రెండు బుజ్జులు ఉంటాయ్ అంటే అతిశయోక్తి కాదేమో.

ఇంతకి ఇవాళ ఈ బుజ్జి గోల ఏంటి అనేనా సందేహం?అప్పుడప్పుడు పాత జ్ఞాపకాలు ఇలా తన్నుకొచ్చి బ్లాగెక్కి అరుస్తాయి... అందుకని.

మొన్నీమధ్య ఒక పెళ్ళికి వెళ్ళనా.అక్కడ మా దూరపు బంధువు ఒకావిడ ఒక అరకిలోమీటర్ దూరం లో కుర్చుని కనిపించింది.లేచి దగ్గరకి వెళ్ళటం బద్ధకం వేసి,మరీ పలకరించకపోతే బాగోదేమో అని,అలా అలవోకగా తల తిప్పి సైగ చేసి,ఒక చిరునవ్వు కానుకగా పడేసా.అది యెంత పెద్ద తప్పో వెనువెంటనే సమాధానం లో వచ్చిన "బుజ్జి.....జీ" అనే కేక తో నాకు అర్ధం అయిపొయింది.ఆ పిలుపుకి నా ఆకారానికి సరిపోవటం లేదని నేను మొత్తుకున్నా వినరు కదా.చుట్టూ ఉన్న జనం కళ్ళు గప్పి ఆ బుజ్జి నేను కాదని తప్పించుకునే ప్రయత్నం చేసాను.గాలి తో సంభాషిస్తూ ఎటో చూసాను.

ఆవిడ పట్టు వదలకుండా మా మధ్య ఉన్న జన వారధికి పని అప్పచెప్పింది.తన పక్కన ఉన్నవారికి మా బుజ్జిని పిలవండి అని గుసగుస,వాళ్ళు తమ పక్కనున్న వారితో అదే గుసగుస.నా పక్కన పది నెలల బుజ్జి వాళ్ళ అమ్మ వడిలో ఆడుకుంటుంటే, ఈవిడగారి పిలుపు విని ఎవరో ఆ పిలుపు ఆ పసిదానికోసం అనుకున్నారు కాబోలు,ఏకంగా నా భుజం తట్టి,ఏవండి ఆ బుజ్జి పాప ని అక్కడ ఉన్నావిడ పిలుస్తుందని చెప్పండి అన్నారు.నేను వినపడనట్టు ఇంకేటో చూస్తున్నా పదేపదే అదే మాట.ఇంక ఎక్కువ సేపు తప్పించుకోవటం కుదరదు అని తెలిసిపోయాక ఆ బుజ్జిని నేనే అని ప్రకటించుకుని ఆవిడ ప్రేమావేశం తట్టుకొవటానికి దగ్గరికి వెళ్ళక తప్పలేదు.

ఈ ఒక్క సందర్భమే కాదు.మా చుట్టాల్లో చాలా మందికి నా పేరు బుజ్జి మాత్రమె.ఇంటర్మీడియేట్ కి హాస్టల్ లో ఉన్నప్పుడు మనకి ఒక చిన్నా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.కాకపొతే మా చుట్టాలు ఎవరికన్నా చెప్పేటప్పుడు మా బుజ్జి మీకూ తెలుసా అని అడగటం.అసలు గంభీరంగా ఉందే ఈ శ్యాల్తి పేరు బుజ్జి అని జనానికి తెలిస్తే..హవ్వా..యెంత అప్రతిష్ట!!

చాలా సార్లు అమ్మ ని వేదిస్తుంటాను.నాకు బుజ్జి అని పేరు యేల పెట్టవలె?పెట్టితివి పో,అదే పేరు తో నన్ను యేల పిలువవలె?పిలిచితివి పో,బంధువర్గ మధ్యమున నన్ను యేల గేలి సేయవలె.యేల బుజ్జి బజ్జి అని పిలువవలె?ఈ పిలుపు విని సమాజము ఊరకుండునా,నవ్వక మిన్నకుండున.ఈ అవమానభారమును భరించి ఊరకుండుటయా?మనుటయా,మార్చుటయా.ఇప్పుడేది
కర్తవ్యము..యెదీ కర్తవ్యము!!!

ఇంకా చదివే ఓపిక ఉంటె మరి కాస్త కధ కూడా ఉంది.చిన్నప్పుడు దూరదర్శన్ లో ఏదో హిందీ సీరియల్ వచ్చేది.అందులో ఒక బుడ్డోడి పేరు చిటుకు.ఈ బుజ్జి కంటే అదేదో బాగుందని ఒక రోజూ పొద్దున్నే ఇహ నుండి నన్ను చిటుకు అని పిలవండి అని శాసనం చేసేసా.పాపం మా వాళ్ళు కూడా ఒక రోజంతా అలాగే పిలిచారు కూడా.నేను కూడా కొత్త పలకరింతకీ పులకరించిపోయా.రెండు ఎపిసోడ్లు అవ్వగానే ఆ చిటుకు కారక్టర్ ఠా!సెంటిమెంటల్ గా ఆ పేరు నచ్చక మా వాళ్ళు ఆ పిలుపు మానుకున్నారు.డామిట్..కధ అడ్డం తిరిగింది.తిరిగి తిరిగి మళ్ళి మొదటికే వచ్చింది.

ఆ తరువాత చిన్నోడా,బుజ్జమ్మ,చిత్తూ ఇత్యాది కూడా నా ప్రమేయం లేకుండా ప్రయోగించారు మా ఇంట్లో.మంచి పేరు వెతుక్కునే విఫల ప్రయత్నం నేను కూడా చేసాను కానీ,చివరకి నాకు అర్ధం అయ్యింది ఏంటంటే ,బుజ్జి అనే పేరు నాకు బంక లాగా బాగా అతికింది.ఇహ ఈ సార్ధక నామధేయముతో నే మనవలె.వేరే ఆప్షన్ లేదూ భాయి:)

P.S. ఏదో ఇంట్లో వాళ్ళని ఉడికించటానికి నాకు బుజ్జి అనే పేరు ఇష్టం లేదని చెప్తుంటా కానీ,ఇంక వేరే ఏ పేరు తో పిలిచినా నన్ను పిలిచినట్టు అనిపించదు.బుజ్జి అంటే బుజ్జే మరి.:)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి