28, జులై 2010, బుధవారం

కవిత? కవితే! కవితా..

నాకు కవిత్వం రాయటం రాదు..అంతెందుకు..చాలా కాలం కవిత చదవటం కూడా రాదు..కానీ ప్రతి విషయం మీద అడిగినా అడగకపోయినా ఒక అభిప్రాయం చెప్పటం మాత్రం బాగా అలవాటు అయ్యింది..ఇప్పుడు కవితల మీద విశ్లేషణ చెయ్యబోవటం లెదు..భయం వలదు...(ఏకంగా కవితే వినిపిస్తా అని తేలిక ఇంకా ఇక్కడే ఉన్నారా పాపం :P)

ఇప్పుడు...అయ్యో అలా పారిపోతున్నారు ఏంటి...హుహ్.!!.మీ ఇష్టం...ఐనా నా తవికల సంకలనాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దాం అని నిర్ణయించుకునే ఈ సాహసం చేస్తున్నా..(ఎయి ..వినిపిస్తుంది..సాహసం మాది కదా..తనది అంటుంది ఏంటి బుజ్జి అనుకుంటూ ఏంటి ఆ గొణుగుడు!!..)

ధైర్యే సాహసే లక్ష్మి (ఇక్కడ చదివినందుకు లాటరి ఎం లెదు..మీకు మీరే ఓ వీర తాడు వేస్కోండి..)
----------------------------------------------------------------------------------------------------------
1.....

ఎంతటి ఆశ సరిపోతుంది ఈ అగాధాన్ని పుడ్చటానికి?
నైరాశ్యానికి చోటు లేకుండా మదిని కమ్మేయ్యటానికి..
దుఖ్కాన్ని దిగామింగినా తీరని దాహానికి..
భాష్ప జలపాతాలు ఆవిరవటానికి?

చిన్ని చినుకు చాలదా పుడమి పులకించటానికి..
బంధమే కావాలా నీకై నేను వుండటానికి?
భాష లేని భావం చాలదా మదికి..
సంతోషం చిరునామా తెలియటానికి?
ఒకరికి ఒకరు ఏమీ కాక
అన్నీ అవటానికి..


------------------------------------

2....పున్నమి  వెన్నెల
అలవాటైన వాడవే కాని
ఏమిటి ఈ నాటి వింత మామా..
నీ నెచ్చెలి వెన్నెలనే కదా..
మరి నా సిగ్గుకి నువ్వు ఎర్రబడటం ఏమిటి చందమామ..

పున్నమి రేయి హాయి
మనకి తెలియని వింతల నెలవని
నా జాబిలి బుగ్గనున్న చుక్క
చెప్పేదాకా..మనకి తెలియకపోవటం వింతేగా మామా..

-------------------------------------

3.... ఏమిటిది?

బీట వారిన నా మది భూమిని
బాధ చినుకా..నువ్వైనా పలకరించి పోవా..
అశ్రుసముద్ర గర్భాన దాగిన
నా అమూల్య జ్ఞాపకాల మణులని
తిరిగి తెచ్చివ్వవా..
పెను ఉప్పేనవై వచ్చి
ఈ నిర్లిప్తతని పారద్రోలవా..
నిన్నైనా సంతోషపెట్టే అదృష్టాన్ని నాకివ్వవా..

-------------------------------

4....నేనేనా..

నాలో వున్నా..నాకే తెలియని నేను..
మది అద్దం లో ఆ అపరిచిత నీడ ..
నాదేనా?
నేను ఏకీభవించని భావాలతో
నేను సమ్మతించని ఆలోచనలతో
నేను వలదన్నా వీడని పట్టుదలతో
నేనే కాదేమో అనిపించే అనుమానాలతో...
నా నుండి నన్ను దూరం చేసే నీవు నేనేనా..
నిజంగా నేనేనా..?

--------------------------------

5....

నా గుండె సవ్వడిని ఆగిపోమ్మన్నాను
అవును..నిన్ను నాతో మాటాడొద్దు అన్నాను
ఎప్పుడూ నీ పలుకుల అలకలేనా..
నేడు నీ మౌనం విన్దామనుకున్నను..

----------------------------------------------
6.....

నేలకోరిక...పక్షినై నింగికెగరాలని
నింగి కోరిక...చినుకై చిగురును తడపాలని
చిగురు కోరిక...భ్రమరమై పువ్వును ముద్దాడాలని
పువ్వు కోరిక...వాలు జడ నీలాలలో వోదిగిపోవాలని
ఆ ముంగురుల కోరిక...వెచ్చని మబ్బు తునక కావాలని
మబ్బు కోరిక...నది పాదాలు స్ప్రుశించాలని
నది కోరిక...సాగర కౌగిలిలో బంధీ అవ్వాలని
సాగరం కోరిక...కెరటమై తీరం చేరాలని
ఆ తీరాన...నిండు చందమామ నీడన
నీ అడుగులలో నేనై..నేనే నీవై వుండాలనే
నా చిన్న కోరిక వింటావా..
నాతోనే వుంటావా.. :)

-------------------------------

25, జులై 2010, ఆదివారం

మునుసుబోళ్ళ పిల్ల రోయి!

పిల్ల అని వినపడగానే గబగబా మీటలు నోక్కేయ్యటం కాదర్రా, విషయం తెలుసుకోవాలి ముందు :D నిన్న బాగా గుర్తొచ్చి అద్దాల గుండె గదిలోకి తొంగి చూస్తే ఓ చిరునవ్వు వెలిసి కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి..చిన్నప్పటి నుండి మేము నలుగురము కలిసి కూర్చుంటే కబుర్ల దొంతరలు..పాత జ్ఞాపకాలు..నవ్వుల చినుకులే..ఆ నలుగురు ఎవరు అనేనా...అమ్మ నాన్నారు అక్క నేను.. ఇంతకముందు మా పులజాడ ప్రహసనం గురించి చెప్పా కదా..అలాగే ఒకసారి నాన్నారు తన చిన్నప్పటి జ్ఞాపకాలు పంచుకున్నారు లె..

పసి వయసులో పిల్లల మనసులు నిష్కల్మషంగా ఉంటాయ్..ఒకసారి ఏదన్నా కావాలి అనిపిస్తే అది అవసరమా,దాని వల్ల ఉపయోగం ఏంటి, దాని పర్యవసానం ఏంటి అనే ఆలోచన లేకుండా...నాకు అది కావాలి...కావాలంతే అని మాత్రమె అనిపిస్తుంది.

ఒంగోలు కి దగ్గరలోని పల్లెటూరు లో..పెద్ద వ్యవసాయమే తప్ప పెద్ద చదువులు లేని ఊరు అది..ఉన్న నలుగురు అన్నదమ్ములలో చిన్నోడు అని బాఘా ఆలోచించి ఆదినారాయణ అనో లేక నోరు తిరగక ఆదయ్య అనో ఓ పేరు పెట్టేసారట. కొన్ని నెలలకి పోయినేడాది పోయిన తాత గుర్తొచ్చి ఆయన పేరు తగిలించేసారట.. సరే ఇప్పుడు పేరు గోల కాదు కానీ...మొత్తానికి నాన్నారి పేరు మార్చారు....

అసలే ఆ ఇంట్లో ఆడపిల్ల లేదాయే...అందుకని ఉన్న చిన్న కొడుకుని అల్లారు ముద్దుగా, అపుడప్పుడు ముద్దుగుమ్మ లాగా చూసుకుంటున్నారు...  పుట్టిన అయిదు సంవత్సరాలకి తిరపతి లో పుట్టెంటుకలు ఇచ్చి..పిల్లాడికి బాగా చదువు రావాలని ఎంకన్నకి మొక్కి, ఊరి మునిసిపల్ బడి లో వేసారట. ఇంటి నుండి బడి ఓ ఫర్లంగ్ దూరం ఉంటదేమో..అసలే ఊళ్ళో ఆడాళ్ళు అందరూ తలలో మల్లెపూలు తురుముకుని ముచ్చట్లు ఆడుకునే కాలం అది..ఈ బుడ్డోడు బోడి గుండెసుకుని బడికి బయల్దేరి..
తిన్నగా తలకాయ వంచుకుని వెళ్ళకుండా (నా స్టైల్ లో చేతి సంచి ఊపుకుంటూ వెళ్లి ఉంటావ్ కదా నాన్నారు అని మన సటైర్!) ఈ ఆడాల్లందరినీ చూస్తూ నాలుగు అడుగులు ముందుకి వెయ్యగానే చిట్టి బుర్రలో చిన్న ఆశ...నాకు కూడా పూలు పెడితే బాగుండేది అమ్మ అనిపించిందట. అంతే..బడి కి మారో గోలి అని పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి.."అమ్మోయి! నాకు కూడా పూలు పెట్టావా అని అడిగారట. పోరా పిచ్చి సన్నాసి, అని ముద్దుగా విసుక్కుంటే రోషం వచ్చి..పూలు పెడతావా లేదా అని గట్టిగా గోల మొదలెట్టారట..

ఒరేయ్ ..అసలే మగపిల్లాడివి, పైగా నీ నెత్తి మీద ఒక్క ఎంటిక కూడా లేదాయే..ఇప్పుడెట్ట రా పూలు పెట్టేది అంటే ..ఉహు..పెట్టాల్సిందే అని గోల! ఇహ చేసేది ఏమి లేక, ఓ పూల దండ తెచ్చి.. ఆ చెవు నుండి ఈ చేవుకి.. గుండు మీదగా కట్టారట. అవి చూస్కుని మురిసిపోయి.. మళ్ళి బడికి బయల్దేరితే.. రచ్చ బండ దాగ్గర కూర్చున్న ఊరి పెద్ద మనుషులు నవ్వు ఆపుకోలేక ఎక్కిరించారట..

ఇంతలో వెనకనుండి " అద్గద్గో...మునుసుబోళ్ళ పిల్లోత్తుంది రోయి!" అబ్బో..!!మునుసుబోళ్ళ పిల్ల భలేగుంది రా..
యాడ దాచారబ్బా ఇన్నాళు కానరాకుండా " అని పోకిరి పిల్లగాళ్ళు వెంటబడ్డారట .. కళ్లెమ్మట కారే కన్నీళ్ళు తుడుచుకుంటూ..
అసలే పెద్దదైన ముక్కు ఎగబీల్చుకుంటూ..ఇంటికి పరుగో పరుగు...అయ్యో ఇంత ఘోరం జరిగిందా నాన్న..పోనీ పూలు తీసేద్దాం లె అని వాళ్ళ అమ్మ ఒదారుస్తుంటే...ఇంకా గట్టిగా శోకండాలు పెట్టటం అట..నా పూలు ముట్టుకుంటే ఊరుకోను అని..
బోడిగుండు మీద పూలు అలానే ఉండాలి..కానీ అది చూసి ఎవరు నవ్వకూడదు...ఇట్టాగైతే ఎట్టా రా అంటే..ఏమో! నాకేం తెల్సు.. అదంతే..ఎవరు నవ్వకూడదు అని పేచి...

ఇదంతా నాన్నారు చెప్పిన ప్రతిసారి కొత్తగా విన్నట్టు వినీ..ఇంతకి నవ్వినోళ్ళు ఎవరు నాన్నారు..ఆ కుర్ర బ్యాచి లో ఎవరెవరు ఉన్నారు..ఇంకా యేమని ఎక్కిరించారు అని ఆరాలు తీసేదాన్ని..చిన్నప్పుడు ఈ "మునుసుబు గారి పిల్ల" కి గర్వభంగం జరిగినా, తర్వాత ఆ ఊరి నుండి బాగా చదువుకుని వృద్ధి లోకి వచ్చి, ఎందరికో ఉపాది కల్పించిన దేవుడు' అనిపించుకున్నారు నాన్నారు..
మళ్ళి ఎప్పుడన్నా తీరికగా ఇంకొన్ని కబుర్లతో వస్తా ..అందాకా తెలుసుగా..టాటా :)