4, డిసెంబర్ 2009, శుక్రవారం

తీపి ఊసులు

మొన్న ట్యాంక్బండు  మీద  అలా వెళ్తూ వుంటే చూసాను.
లేలేత అలలు హాయిగా ఊగుతూ వచ్చే పోయే జనాన్ని కూడా పట్టించుకోకుండా ఏదో తెలియని ఆనందం లో మునిగిపోయి ఉన్నాయి.అదే అడిగాను ఒక పిల్ల అలని,ఏమోయ్ ఏముంది ఇక్కడ నువ్వు ఇంతగా సంతోషపడటానికి?ఊరికే కిలకిలా నవ్వితే నిన్ను పిచ్చిదానివి అనుకుంటారు సుమా అని.నన్ను వింతగా చూసింది ఒకసారి.మళ్ళి కిలకిలా నవ్వేసింది.అర్రే..నాకు చెప్పు విషయం అని నేను అడిగితె..

నువ్వే పిచ్చి మొహం.మేము ఇంత హాయిగా ఎందుకు నవ్వుతున్నమో నీకు తెలియదా?గాలి చిలిపిది. ఎక్కడినుండో వస్తుంది.రొజూ ప్రతి క్షణం మమ్మల్ని పలకరిస్తుంది.కాసేపు మెల్లిగా తీపి ఊసులు చెప్తుంది.కాసేపు గట్టిగా వచ్చి చక్కిలిగిలి పెడ్తుంది.రోజుకొక కొత్త సువాసన మోసుకొస్తుంది మాకోసం.వింత వింత వస్తువులు చూపిస్తుంది.ఈ ఆనకట్ట దాటి మేము రాలేకపోయినా ప్రపంచం లోని వింతలూ విశేషాలు మాకు చేరేస్తుంది.ఎక్కడో సాగరం లో ఉన్న మా చుట్టాల కబుర్లు కూడా తెలుసుకుని వచ్చి మా క్షేమ సమాచారం వాళ్లకి చెప్తుంది.బాగా ఎండ వచ్చి మేము ఆ వేడికి ఆవిరి అయిపోతుంటే మాకోసం యెంతో దూరం వెళ్లి తెల్లటి పెద్ద పెద్ద మబ్బులని తీసుకొచ్చి గొడుగు వేస్తుంది.అంత ప్రేమగా ప్రతిక్షణం  మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుంది. ఇంత ప్రేమగా చూసుకునే నేస్తం ఉంటె,మేమే కాదు,నువ్వు కూడా జీవితాంతం సంతోషంగా ఇలా కిలకిలా నవ్వేస్తావ్ అని,మళ్ళి ఆ గాలి ఉయ్యాల మీద ఆడుకోవటం  మొదలుపెట్టింది.

బాగానే వుంది.అలలకి గాలి వుంది కాబట్టి సంతోషం అట.మరి గాలికి ఎందుకు ఇంత సంతోషం?ఆ మాటే గాలిని అడిగాను. ఏమోయ్..అవంటే పిల్లకాయలు,అల్పసంతోషులు.నిన్ను చూస్కుని మురిసిపోతున్నాయ్.మరి నువ్వు ఎవరిని చూసి ఇలా పల్టీలు కొడుతూ,ఎగురుతూ,గానులేస్తున్నావ్ అని అడిగా.వూ..ష్ మని వచ్చి నా జుట్టు అంతా చెరిపేసింది. ఓయ్..సుబ్భరంగా దువ్వుకున్నా తల చేరిపెసావ్.ఇంతకి నీ సంగతి చెప్పు అన్నాను.

గాలి గొంతు ఇంత అద్భుతంగా వుంటుంది అని అప్పటివరకు నాకు తెలిలేదు.వేణువు వూదినట్టు వుంది గాలి గొంతు. మట్టిబుర్ర..నిజమే కదా..వేనువుకి ఆ గొంతునిచ్చింది నేనే కదా అన్నది చిలిపి గాలి.తన సంతోషానికి కారణం చెప్పింది.తనని చూడగానే పరవశించే చెట్లని చూస్తే గాలికి ఆనందం అట.తను మెల్లిగా దాగుడుమూతలు ఆడినట్టు వస్తే లేలేత చిగురులు తలలు ఆడిస్తూ నాట్యం చేస్తాయ్ అట.తను గట్టిగా వీస్తే తన గొప్పతనం చూసి పెద్ద పెద్ద మానులు కూడా తలలు వంచి గౌరవిస్తాయ్ అట.జనం బారులు తీరి దేవుడి గుడి ముందు పడిగాపులు కాస్తుంటే తను మాత్రం చటుక్కున గర్భగుడిలోకి వెళ్ళిపోయి దణ్ణం పెట్టుకొచ్చి భక్తులకి హాయిగోలుపుతుందట. తనని నోటితో పొగడకపోయినా సృష్టి లోని ప్రతి ప్రాణి తనని ఇష్టపడుతుందట.అందుకే తన మాట విని మబ్బులు  కూడా అలలకి గొడుగు పడతాయి అట.ఒహో..చాల కధే వుందే గాలి దగ్గరా అనుకున్నాను.

మబ్బు కూడా మా మాటలు వింటుంటే ఆ వింత ఆకారాల్ని చూసి గాలి కన్ను కొట్టి ఈలలు వేస్తుంది.బాగుందర్రా మీ వరస.ఇంతకి మబ్బుగారు,తమరికి కూడా ఏమన్నా కారణం ఉందా ఇంత హాయిగా ఆకాశం లో దూదిపింజ లాగా తేలిపోతున్నారు అని అడిగాను.తన అసలు రహస్యం చెప్పేసింది మబ్బు.నన్ను చూసి ఇలా అడిగింది.

నీకు నిండు చందమామ అంటే ఇష్టమా?ఆయన నెచ్చెలి పేరు పెట్టుకున్నవుగా అని.ఓ..చాలా ఇష్టం అని చెప్పా. పున్నమి వెన్నెల లో ఆరు బయట నడుస్తూ ఆ చందమామని అందుకోవాలనీ, ఒక్కసారైనా చేతితో తనివితీరా  తాకాలని అనుకుంటావు కదా.నేను అలాంటి చందమామకి మెత్తటి దిండు ఏర్పాటు చేస్తాను.ఆ చల్లని వెన్నెల నా మీద పడితే సిగ్గుతో ఎర్రబడ్తాను.ఎవ్వరికీ వీలవని పని కదా చందమామ కి అంత దగ్గరగా వుండటం.నా వల్ల అయ్యింది అని,నెలకి ఒక్కసారే ఆ అదృష్టం వచ్చినా,ఆ తీపి జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆ సిగ్గు దాచుకుంటూ రోజు సంతోష పడ్తూ వుంటాను అని చెప్పింది.

సృష్టికి మూలమైన ప్రతిదానిలో ఆనందం వుంది.ఎన్నో అవాంతరాలు రోజు ఎదురవుతూనే ఉంటాయి.కాని వాటిని అన్నిటిని అధిగమించి,సంతోషాలు మాత్రమే బయటకి చెప్పి,అందరికి ఆనందం పంచుతూ,చిన్న చిన్న విషయాలకే సంతోషపడుతూ వుంటే జీవితం అంతా ఆనందమే కదా..మరి మనం ఎప్పుడూ అలా వుండగలుగుతామో?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి