ఇవాళ పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటే,కోడి గుడ్డు ఖరీదు యెంత అనే ప్రశ్న తలెత్తింది.అలా అలా మాటల ప్రవాహం లో కొట్టుకుపోయి,నా చిన్నప్పుడు ఐతే కొన్ని పైసలకే వచ్చేది గుడ్డు,ఆ కాలమే వేరు అని డైలాగు కొట్టాను కానీ,నా కళ్ళ ముందు పాత సినిమా ఫ్లాష్ బ్యాక్ లాగా కొన్ని చక్రాలు తిరిగాయి.
చిన్నప్పుడు మా ఇంట్లో ఒక బ్లూ కలర్ ఎగ్ కేసు ఉండేది.అంటే ఆ ప్లాస్టిక్ డబ్బాకి ఇంకేమన్నా పేరు ఉన్దేమో కానీ,నేను దాన్ని ఎగ్గుపెట్టే అనే పిలిచేదాన్ని.గుడ్డు ఆకారంలో ఆరు ఖాళీలు ఉంటాయ్ దానికి.షాప్ కి వెళ్లి గుడ్లు తెచ్చే ప్రతిసారి నాకు దాని హన్డెల్ పట్టుకుని గట్టిగా ఊపుకుంటూ ఇంటికి రావాలని బలమైన కోరిక ఉండేది.చిన్నపిల్లనని నా చేతికి అస్సలు ఇచ్చేవారు కాదు ఆ పెట్టెని.నేను మరీ ఏడ్చి గీపెడితే,ఆరు నూరైనా సరే,నేను దాన్ని గాల్లో ఝండా లాగా ఊపను అని సవాలక్ష ప్రోమిస్లు తీస్కుని, ఒక్కసారి అపురూపంగా నా చిట్టి చేతుల్లో పెట్టేవారు.ఇప్పటికి నాకు తీరని కోరికగా మిగిలిపోయిన విషయాల్లో ఇది ఫస్ట్ ఆన్ ది లిస్టు.
ఇహ రోజూ సాయంత్రం పాల ప్రహసనం.అమ్మ మాకు హార్లిక్స్ కలిపిన పాలు ఇచ్చేది.నాకు హార్లిక్స్ తినటం మాత్రమె ఇష్టం. అందుకని ఒక కటోరి నిండా హార్లిక్స్ వేస్కుని తినేసి,వుట్టి పాలు ఒక స్టీల్ గ్లాస్ లో పోయించుకుని బయట తిరుగుతూ ఉండేదాన్ని.యెవరూ చూడకుండా నేను ఒక గుక్క తాగి,ఒక గుక్క మా సన్నజాజి మొక్కకి ఇచ్చేదాన్ని.మొత్తం ఒకేసారి ఒలకబోస్తే చెట్టు మొదట్లో పాలు కనిపిస్తాయి కదా,అదీ మన తెలివి.ఇహ చూస్కోండి..పాల వల్ల నాకు బలమేమో కానీ,మా సన్నజాజి మొక్క మాత్రం బాగా ఏపుగా పెరగటం మొదలెట్టింది.బోలెడు పువ్వులు కూడా.దాని పక్కన ఉన్న మొక్కలు ఈసురోమని వేలాడుతూవుంటే,ఇది మాత్రం నవనవలాడుతూ భలే ఉండేది.కానీ ఎక్కువ రోజులు ఈ అగ్రీమెంట్ సాగలేదు.
ఏదో చిలిపి పని చేసా అని నాకు కటోరి హార్లిక్స్ అల్లోవన్సు కట్ చేసి,పాలల్లో ఒక రెండు స్పూన్లు కలిపి ఇవ్వటం మొదలెట్టింది అమ్మ.అదే చెట్టుకి నేను పాలాభిషేకం చేస్తుంటే,మంచి ఫుడ్ సోర్సు దొరికిందని చీమలు పుట్టలు పెట్టటం మొదలెట్టాయి.మన కధ బయట పడిపోయింది.నాకు దెబ్బలు పడ్డ చాలా కొన్ని సందర్భాలలో ఇది ఒకటి.
దెబ్బల సంగతి ఎలాగో చెప్తున్నా కాబట్టి,ఆ మిగతా సందర్భాలు కూడా చెప్పేస్తే పోయే.ఒక సారి కొత్త బోంబే డయ్యింగ్ బెడ్ షీట్ మా మంచం మీద వేసింది అమ్మ.అది తెల్లగా మల్లెపువ్వు లాగా,తళతళా మెరిసిపోతుంది.ఎం పూనిందో ఏమో,మా అక్కా నేను వాడేసిన బ్లేడు ముక్క చెరో సగం అందుకుని,దాన్ని అడ్డంగా నిలువుగా కోసి పారేసాం.ఆ పని ఎందుకు చేసామో ఇప్పటికీ మాతో సహా ఎవరికీ అంతుపట్టని చిక్కు ప్రశ్న.కానీ చేసిన పని ఒప్పుకుని ఇద్దరం చెరి రెండు దెబ్బలు తినేశాం.
ఇంకో సందర్భ ఏంటంటే,మా ఊరికి వెళ్ళినప్పుడు ఒకసారి నన్ను "తెల్లసుబ్బి"అని అందరు ఏడిపించారు.అందరూ అంటే బాధ లేదూ కానీ,మా అక్కకుడా వంత పాడేసరికి బాగా కోపం వచ్చేసింది.పట్టుకుని కొడదాం అంటే నాకు చిక్కకుండా పరిగేడ్తుంది.
ఇంక ఉక్రోషం ఆపుకోలేక నా ఎడమ కాలి హవాయి స్లిప్పేర్ తీసి విసిరేసా.అసలే నా స్లిప్పేర్ సైజు చిన్నది.పైగా నా టైమింగ్ ఏంటో కానీ,అది టార్గెట్ మిస్ అయ్యి,ఎదురుగ్గా మజ్జిగన్నం తింటున్న మా కజిన్ ప్లేట్లో కరెక్ట్ గా ఫిక్స్ అయ్యింది.యేమి జరిగిందో తెలుసుకునే లోపు ఈ సీన్ మొత్తం అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవుతున్న నాన్నారు చూసేసారు.నేను జరిగిన విషయ కంటే జరగబోయే పరిణామం ఊహించుకుని బిక్కచచ్చిపోయి నిల్చున్న.ఇంక చెప్పేదేముంది...కాకపొతే నా ఆవేశానికి కూడా కారణం ఉందని సహృదయ తో అర్ధ చేస్కుని,నాకు రెండు తగిలించి,మా అక్కకి కూడా ఒక రెండు తగిలించారు.లెక్ఖ సరిపోయింది. :)
ఇహ ఒకసారి మా ఇంటికి బీరకాయ పీసు చుట్టాలు వచ్చారు.వాళ్ళు మాకు ఏమవుతారో నాకు తెలియదు.అసలే ఆదివారం.నేను నా ఆటల్లో మునిగిపోయి ఉంటె,ఈ చుట్టాలకి టిఫిన్ వడ్డించాలి అని నన్ను పిలిచారు.అమ్మ వేడిగా పూరీలు వేస్తూ,వాళ్లకి పెట్టిరమ్మని పంపింది.రెండు సార్లు టేబుల్ చుట్టూ తిరిగి,ఇంకొన్ని తినండి అంకుల్ అని నేను అనటం,వాళ్ళు తెగ మోహమాట పడుతూనే,నేను అన్నా తత్క్షణమే,ఇంకో నాలుగు పూరీలు తినటం.ఏమో..చిరాకు అనిపించిందో ఏమో మరి,మూడో సారి టేబుల్ దగ్గరికి వెళ్లి...ఇదిగోండి,ఆ తినేదేదో మొహమాట పడకుండా తినేసేయ్యండి.మాటిమాటికీ వచ్చి మిమ్మల్ని బ్రతిమాల్లెను బాబూ అనేసా!పాపం తెరిసిన నోరు అలాగే ఉంచి నా వైపు చూసి,ఇంకో రెండు పూరీలతో క్లుప్తంగా ముగించేసారు.ఆ తర్వాత ఇంకెప్పుడు వాళ్ళని చుసిన గుర్తు లేదూ మరి.
అమ్మ నా మోహానికి దోసగింజ ఆకారంలో బొట్టు పెట్టి,ఇంత పెద్ద బొట్టు ఎందుకు పెట్టావమ్మా అని అడిగితె,అప్పుడు మోహం పద్మం లాగా ఉంటుందిరా నాన్నా అనేది.అందుకని అమ్మని మాటిమాటికి పద్మం బొట్టు పెట్టావా అని గోల చేసి,సొంతంగా పెట్టుకోవటం ప్రాక్టీసు చేసేదాన్ని.మా ఇంట్లో ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది.నేను పుట్టినప్పుడు కొన్నరేమో మరి,అదంటే నాకు ఎక్కడ లేని ఫాసినేషను.ఎక్కడ ఏ పని చేస్తున్నా ప్రతి గంటకీ నేను ఆ అద్దం ముందు ప్రత్యక్షం అయ్యి,దువ్విన తలే మళ్ళి దువ్వి, రకరకాల అంకాళమ్మ బొట్లు పెట్టి,వాటిని తుడిచేసి ఈ అద్దం రెండువైపులకి పుసేసేదాన్ని.ఇప్పటికీ ఆ బొట్టూ కాటుక అవశేషాలు ఆ అద్దానికి అలంకారాలుగా మిగిలి కనిపిస్తుంటాయి.
అద్దానికి ఈ రకంగా అతుక్కుపోతున్నాను,భయంకరంగా పౌడర్ రాసేసుకుంటున్నాను అని,నాకు తెల్లసుబ్బి అని నామకరణం చేసారు.నాకు అది సరిగ్గా పలకటం రాక,నేనేం తెల్లజుబ్బి కాదు,నువ్వే నల్ల జుబ్బి,దొంగమున్న అని తిట్టిపోసేదాన్ని.అసలు ఎక్కడ ఉంటె అక్కడి మాండలికాల్లో మాట్లాడేస్తున్నాను అని,విశేషంగా కొత్త పదాలు ప్రయోగిస్తున్నాను(బూతులు)అని,రెండో తరగతి లో ఆంగ్లం మాత్రమే మాట్లాడే మంచి స్కూల్లో పడేసారు నన్ను.అయినా పెద్దగా మారినట్టు లేను నేను :)
స్కూల్ నుండి ఇంటికోచ్చేప్పుడు,పాపం మా అక్క నా టిఫిన్ బుట్ట,తన టిఫిన్ బ్యాగు,తన స్కూల్ బ్యాగు,నా స్కూల్ బ్యాగు,ఇంకా తన వాటర్ బాటిల్ మోసుకొచ్చేది.నేను నా ఒక్క వాటర్ బాటిల్ ఊపుకుంటూ,పాటలు పాడుకుంటూ తెచ్చుకునేదాన్ని.నా దృష్టిలో చేతిలో ఒక పుస్తకం ఉంటె వాళ్ళు స్టైల్ గా ఉండె కాలేజీ పిల్లలు.ఏదో దిక్కుమాలిన సినిమా లో చూసాను మరి. అందుకే సామాను మొత్తం అక్క చేత మోయించి,నేను తన టెక్స్ట్ బుక్ ఏదన్నా అలా అలవోకగా పట్టుకునేదాన్ని.పెద్ద క్లాసు టెక్స్ట్ బుక్ ఐతే నేను పెద్ద క్లాసు లో చదువుతున్నాను అనుకుంటారని వెర్రి ఆశ.చిన్నవయసులో మనకి పెద్దరిక ఆపాదిస్తే బాగుండు అని అందరికి అనిపిస్తుంది ఏమో మరి.ఇంతకి అప్పుడు నేను రెండో తరగతి,మా వాడు మూడు.:))
మా ఇద్దరికీ ఒక్క క్లాసు మాత్రమె తేడా కాబట్టి లాజికల్ గా తన పుస్తకాలు నాకు వారసత్వం గా వచ్చేవి.అసలే నా చేతికి వచ్చేప్పటికి అవి సిదిలావస్త లో ఉండేవి.మనకేమో అసలే ఎక్కాలు,లేక్ఖలు రావు.అందుకని మిగతా టెక్స్ట్ బుక్స్ అన్ని బాగా అతికించుకుని,ఒక్క లేక్ఖల పుస్తకంలో మాత్రం నాకు రాని లెక్కలు ఉన్న పేజిలు చింపేసేదాన్ని.ఆ చాప్టర్ లో హోంవర్క ఇచ్చినా,నన్ను చదవమన్నా,దానికి పేజిలు లేవు,అక్క చిమ్పెసింది అని చెప్పి తప్పించుకోవాలని చూసేదాన్ని.పాపం మా వాడు నన్ను యేమి అనేవాడు కాదు..కానీ నాకు ఒక్క లెక్కల కి మాత్రం కొత్త పుస్తకం కొనివ్వటం మొదలెట్టారు మా వాళ్ళు.
ఒకసారి ఆ ఇంట్లో బాగా బంతి పువ్వులు పూసాయి.చాలా బాగున్నాయ్.పువ్వులు వేస్ట్ అయిపోతున్నాయ్ అని వాటిని కోసుకొచ్చి,వాటితో నాకూ,అక్కకి పూలజడ వెయ్యమని ఒకటే గోల.మరీ బంతిపువ్వులతో పూలజడ ఏంట్రా అన్నాసరే వినకుండా, పట్టుపట్టి వేయించుకున్నా.పైగా ఆ జడకి కింద వెండి జడగంటలు.మా కాలనీలో ఉండె కొందరికి చూపిద్దాం అని రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే చూడాలి ఆ సొగసూ..నిజంగా మా పూలజడ చాలా బాగుంది అని మనసులో గట్టి నమ్మకం మరి!వాళ్ళు అప్పుడు మొదలెట్టిన నవ్వు ఇప్పటికీ ఆపలేదు.నన్ను చూసినా,నా పేరు తలుచుకున్న వారందరూ పగలబడి నవ్వాల్సిందే.
ఇలాంటి కధలు నన్ను కదిలిస్తే నిర్విరామంగా శతసహస్రాలు బయటపడతాయి.కానీ ఇంకెప్పుడన్నా తీరికగా మళ్ళి చెప్తాలే.టాటా టిల్ తేన.
8, డిసెంబర్ 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి