9, డిసెంబర్ 2009, బుధవారం

కుడి ఎడమైతే పొరపాటు లేదోయి..

కాదుకాదు...పాట గురించి ఇక్కడ చెప్పటం లేదూ.బుజ్జి ఎడమ చేతి వాటం గురించి ప్రస్తావన వచ్చింది నిన్న.ఆగష్టు పదమూడు (13th) ప్రపంచ ఎడమచేతి వాడుక ప్రజల దినోత్సవం అని వినీ,నన్ను ఈ లెఫ్ట్ హండర్ర్స్ వాళ్ళ జట్టులో కలుపుకుంటారో లేదో అనే అనుమానంతో పాటు,నా పాత జ్ఞాపకాలు పంచుకుందాం అనే ఆవేశంతో అర్ధరాత్రి సీరియస్గా టైపు కొట్టేస్తున్నను.

చిన్నప్పుడు,అంటే నేను పుట్టిన కొత్తల్లో,ఎడమ చేతి బోటని వేలు,ఇంకాస్త పెద్దయ్యాక ఎడమ కాలి బోటని వేలు నోట్లో వేసి జుబుకూ జుబుకూ చీకేస్తుంటే,అదేదో పసిపిల్ల చెష్ఠ అని మురిసి ముద్దు చేసారట మా వాళ్ళు.ఇంకొన్ని నెలలు గడిచి ఉయ్యాల్లో ఆడుకునేప్పుడు,దగ్గరకొచ్చి పలకరించే అందరి జుట్టు ఎడమ చేతితో గట్టిగా పీకేస్తుంటే,పసిది భలే చిలిపిది అనుకున్నారు కానీ,అక్కడ మన ఎడమ చేతి వాటం గుర్తించలేదు.

ఒకసారి ఆమ్మ వేరుసెనగ పచ్చడి రోట్లో రుబ్బి,ఒక గిన్నెకి సర్ది,రోలు కడుగుదాం అని అలా పక్కకి వెళ్ళే సరికి,అప్పుడప్పుడే బండాడటం నేర్చుకున్న నేను ఆ పచ్చడి గిన్నె దగ్గరికి చేరానాట.అమ్మ వెనక్కొచ్చి చూసేసరికి గిన్నె ఖాళీ.నా ఎడమ చేతి చిటికిన వేలుకి అంటుకున్న కాస్త పచ్చడి చూస్తే తప్ప క్రైమ్ సీన్ లో నా పాత్ర ఏంటో తెలియలా.సరే,పచ్చడి సంగతి పక్కన పెడితే నేను ఆరగించింది ఎడమచేత్తో అని అమ్మకి చూచాయిగా అర్ధం అయిందట.చేతిలో పప్పులు పెట్టమని అడగాలంటే ఎడమ చెయ్యి,అక్క మీద కోపం వస్తే,ఎడమ చేతిలో ఉన్న వస్తువులు విసిరేయ్యతమే.పుస్తకం లో వ్రాయమంటే ఎడమ చేత్తో కోడిగేలికినట్టు అక్షరాలూ.పెన్సిల్ చెక్కటం దగ్గరనుండి,బొట్టూ పెట్టుకోవటం,తల దువ్వటం,గరిట తిప్పటం దాకా,అన్ని ఎడమ చెయ్యే.

పాత సినిమాల్లో సూర్యకాంతం లాగా పుర్ర చేత్తో అడ్డం వచ్చిన వారిని చరుస్తూ,ప్రసాదం కోసం కూడా పుర్రచెయ్యేన్టిరా సన్నాసి అని తిట్లు తింటూ,ఆడుకుంటూ పాడుకుంటూ ఉండె నా చిన్నా జీవితానికి ఒక వెర్రి వెంగళప్ప ఉచిత సలహా వల్ల పెద్ద ట్విస్ట్ ఎ వచ్చింది.ఎడమ చెయ్యి ఎక్కువ వాడే పిల్లల మేధస్సు దెబ్బతింటుందని ఆయన చెప్పటం,ఆ మాట నమ్మిన మా జనం నన్ను బతిమాలి,బామాలి,ఎడమ నుండి కుడికి మర్పించాలని ప్రయత్నించటం జరిగిపోయాయి.

పుట్టుకతో వచ్చిన బుద్ధి కదా,మారాను అని భీష్మించుకుని కూర్చున్నాను.ఇరు వర్గాల వాదోపవాదాల అనంతరం,రాయటం,తినత వరకు కుడి చెయ్యి.మిగతా పనులు ఎడమ చెయ్యి అయినా పర్లేదు అనే సామరస్యమైన ఒప్పందం కుదిరింది.కుడి చేత్తో కూడా ఎడమచేత్తో రాసినంత అసహ్యంగా రాయగలను అని గమనించి,తప్పకుండా డాక్టర్ని అయిపోతా అని ముందే ఊహించారు లెండి.కుడి చేత్తో అన్నం కలుపుకోవటం రాక,అసలుకే తిండి తినటం మానేసా కొద్ది రోజులు.అందుకని అమ్మ వండిన అన్ని రకాలు కలిపి నా చిన్నా ప్లేట్ లో పేర్చి ఇస్తే,ప్లేట్ ని రౌండ్ గా తిప్పుకుంటూ,స్పూన్ తో గతికేదాన్ని.నచ్చని అన్నం,స్టాండ్ లాగా పేర్చి, దానిమీద ప్లేట్ పెట్టేస్తే,ఎవరు కనిపెట్టలేరు అని కూడా అనుకునేదాన్నిలే.

రెండు చేతులు సవ్యసాచి లాగా వాడేయ్యటానికి అలవాటుపడ్డ నాకు,ఫైనల్ ఇయర్ ప్రక్టికల్ పరీక్షల్లో అసలు కష్టం తెలిసొచ్చింది. మాములుగా పేషెంట్ ని కుడి చేతి వైపు నిలబడి పరీక్షిస్తారు.నేను నాకు వీలుగా ఉన్న వైపు నుండి ఒక పెద్దాయన కాలి కీలుని సుత్తి తో చితక్కోడుతుంటే,ఎగ్జామినర్ వచ్చి..ఎమమ్మాయి..ఏ చెయ్యి వాడుతున్నావ్ అని గుడ్లురిమారు.(అంటే knee joint ని knee hammer తో చితక్కోడ్తున్నా అని అర్ధం.)అదేదో ఘోరాపరాధం లాగా నా మార్కులు కోసేయ్యబోయి,అదృష్టం కొద్ది,ఎమ్ బంగారూ..లెఫ్ట్ హండర్ వా నువ్వు అని అడిగారు.మన ఘన జీవితచరిత్ర ఆయనకెందుకులే అని క్లుప్తంగా "యా"  అన్నాను.కానీ,ఆన్సర్ షీట్ లో మాత్రం బరబరా కుడిచేత్తో గీకేస్తుంటే,స్థంభం చాటున దాక్కుని చూస్తున్న ఆయనకి ఇక్కడేదో కుట్ర జరుగుతుందని అనుమానం వచ్చింది.

కాసేపు వైవా బదులు నా లెఫ్ట్ handedness మీద ఇంటరాగేషన్ సాగింది.నేను మళ్ళి విక్రమార్కుడికి భేతాలుడు చెప్పినట్టు నా కధ అంతా వివరించి,ఈ సారి క్లుప్తంగా కాకుండా,"I am a Right hander with preference to Left and Left hander with preference to Right.Rather,call me ambidexterous"అని అస్సలు అర్ధ కాకుండా చెప్తే కానీ ఆయనకి అర్ధ కాల.ఆయన నమ్మటం,పాస్ అయ్యే అన్ని మార్కులు వేసి నన్ను కాలేజీ నుండి సక్సెస్ఫుల్ గా తన్నేయ్యటం జరిగాయి. తేడా జరిగుంటే ఈ పాటికి నా హాస్యకదా చిత్రం మంచి ట్రాజెడీ సినిమా అయ్యేది.

చిన్నా పిల్లలు చేతకాకుండా ఎడమ చేత్తిలో స్పూన్ పట్టుకుని తినటానికి తంటాలు పడుతుంటే,నాకు భలే నవ్వొస్తుంది.వేళ్ళల్లో ఎందరు నాతో పాటు కుడి ఎడమైతే పొరపాటు లెదొఇ అని పాడుకుంటారో అని.ఇంతకి మీరు ఏ పాట పాడుతున్నారు? :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి