9, డిసెంబర్ 2009, బుధవారం

కలయా..నిజమా..మైమరపా

చుట్టూ అందమైన కొండలు,వాటిపై సిసిరానికి సిగ్గుపడి ఎర్రబడుతున్న చెట్లూ.చెట్ల పై ఆటలాడుతున్న ఉడుతలు,పాటలు పాడుతున్న పక్షులు.తనువులో ప్రతి అణువూ పులకించే చలి.మబ్బుల నీడలో వెచ్చని నీరెండ వేడిమి.మధ్యలో నిశ్చలమైన నీటి కొలను.ఆ నీలాకాశం తన ప్రతిబింబాన్ని చూసి మురిసిపోయే స్వచ్చమైన నీరు.అందులో ఒక ముచ్చట గొలిపే హంసల జంట.ఒకరిని వీడి ఒకరు ఉండలేనట్టు మెడలు పెనవేసుకుని.వాటిని చూసి ఈర్ష్యపడి అదోలా చూస్తున్న నీటి పక్షులు. గాలి వీచినప్పుడు ఆకుల సరిగమలు తప్ప నిశ్శబ్దం....

కల కాక మరేమిటి అంటారా?కాదు సుమా..నిజమే.

లేక్ ఒంటారియో(Lake Ontario)దాగ్గర ఒక పార్కుని అనుకోకుండా దర్శించే భాగ్యం కలిగింది మొన్న.నన్ను నేను మర్చిపోయి చాలా సార్లు ప్రక్రుతిలో లీనమయ్యాను కానీ,ఆ క్షణాన కలిగిన మైమరుపు..;ఒంటరితనం లో కూడా ఇంత హాయి ఉంటుందా!

ఇక్కడ చెట్లు ఆకులు రాల్చటం మొదలెట్టక ముందు రంగులు మారుస్తాయి.ప్రతి చెట్టూ ప్రక్రుతితో తనకున్న సంబందాన్ని నచ్చిన రంగుతో తెలుపుతుంది.పచ్చని వన్నె నచ్చి విప్పారిన ఆకులతో స్వాగతం చెప్పే చెట్లూ కొన్నైతే,కెంపులో పండుటాకులో అర్ధం కాకుండా ఆశ్చర్యపరచేవి కొన్ని.కొన్ని చెట్లూ మరీ మితిమీరి ఒక్కో ఆకునీ ఒక్కో రంగులోకి మార్చి,పురి విప్పి కదలని నెమళ్ళు అవుతాయి.ఆ చెట్ల అందాలని(fall colours)చూడాలే కానీ,వర్ణించ తరమా..ఋతువు మార్పులో ఇంతటి మధురిమ నేను ఎన్నడు చూడలేదు.

అలాంటి కాలంలో అనుకోకుండా ఆ నీటి కొలను దగ్గరికి వెళ్ళాం.వెచ్చని కోట్లు దాగ్గర లేక చలి చలి..కానీ ఆ కదలిక లేని నీటిని చూసి కదలలేకపోయాను.చెట్ల మద్యనుండి నడిచి వెళ్తే,నీటి మధ్యలో ఒక చెక్క బ్రిడ్జి(board walk).నా మనసుని ఆకర్షించిన అయస్కాంతం అదే....

రెండు హంసలు..పాల నురుగా,పత్తి పువ్వులా అన్నట్టు వాటి సుతిమెత్తని రెక్కలు.ఆ జంట కదలికకి పులకించి అంతటి నిస్చలమైన నీటిలో కూడా చిన్న అలజడి.మెడలు పెనవేసుకుంటూ,విడిపోయి ఓలలాడుతూ,అటూ ఇటూ తిరుగాడుతూ,వాటి లోకం లో అవి...ఏదో కలల లోకంలో నేను.చుట్టూ ఇంకెవరు లేనట్టు తెలియని ఒంటరితనం.కానీ ప్రక్రుతి లో నేనా..నేనే ఆ ప్రక్రుతా అని అర్ధంకాని సంశయ స్థితి.కాసేపు అసలు నేను ఉన్నానో లేనో,ఏదీ తెలియని లోకం.నిజంగా లీనమైపోయాను సమయంలో... ప్రకృతిలో...నాలో....

కెమెరా తీసుకెళ్లటం మర్చిపోయినా,ఆ దృశ్యాలని కాంచిన నా కన్నులదే కదా అదృష్టం.ఆ అనుభూతిని చేజిక్కిన్చుకున్న నా మనసుదే కదా తన్మయత్వం.ప్రక్రుతి అందం సాటిలేనిది.మళ్ళి అందాల లోకం లో నాకు నచ్చిన వర్నింపు తో వస్తా..అందాకా మీ చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించండి. :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి