4, డిసెంబర్ 2009, శుక్రవారం

మధురభావల సుమమాల

టీ.వీ అలా పెట్టానో లేదో,ఈ పాట..మధుర భావాల సుమమాల..మనసులో పూచే ఈ వేళ..
యెంత అందమైన భావం కదా.పాట తరువాత ఏముందో ఇంక ఎమీ వినపడలేదు..అలా వచ్చి ఈ రెండు ముక్కలు గుండెలో అతుక్కుపోయి మెల్లమెల్లగా కూనిరాగాలలా బయటకి వస్తున్నాయి.హాయిగా అనిపించింది ఎందుకో ఆ పాట వినగానే..పాట కాదు లే,ఆ రెండు లైన్లు వినగానే.

ఒక్కోసారి ఒక చిన్న పదం,ఒక చిన్న నవ్వు,ఒక చిన్న సువాసన,ఒక చిన్న రుచి,యెంత అద్భుతంగా మన మనసు స్థితిని మార్చేయ్యగలవో కదా..నాకు చాలా ఇష్టాలు వున్నాయి.కాని ఏ కారణం లేకుండా బాధగా వున్నప్పుడు ఆ ఇష్టాలు అక్కరకు రావు.ఒక జ్ఞాపకం,లేదా పసిపాప బుగ్గలు తలుచుకుంటే యెంత బాగుంటుందో.అసలు ఇప్పటిదాకా ఎందుకు బాధగా నీరసంగా ఉన్నామో కూడా అర్ధం కాదు..కదా? మనసుకు ఎడారిలో మృగతృష్ణ లాగా ఇలా హాయి గొలిపే ఇంకొన్ని నా ఇష్టాలు చెప్పనా..

బాగా భగభగ మండే ఎండలో నుండి ఇంట్లోకి రాగానే మూత పెట్టి లేని చల్లటి మంచినీళ్ళ సీసా.అదేంటో మూత తియ్యటానికి ఒక్క క్షణం కూడా పట్టదు.కాని మూత లేకుండా చల్ల చల్లని నీటి సీసా నోటికి తగలగానే అదో హాయి.
సర్వకాల సర్వావస్థల్లో పసిపిల్లల్ని తలచుకుంటే బాగుంటుంది.కాని నాకు వాళ్ళ చిట్టి చిట్టి పొట్టలు చూడటం ఇష్టం.ఎందుకో తెలీదు.వాళ్ళ పాలుగారే బుగ్గల నుండి ఒక రకమైన పసి వాసన వస్తుంది..అది కూడా ఇష్టమే.
ఏదో పద్యం వుంది కదా,చిన్ని కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగాక ఆ బూరె బుగ్గల మీద పాల చారికలు ఇంకా పోలేదట.ఆ వాసన ఇంకా అలాగే వుండిపోయిందట...అలాంటి స్థితిలో బాల కృష్ణుడే కాదు,పిల్లలు అందరు దేవుళ్ళే.మన కోసం పాలు తాగుకుంటూ ఒక్క నవ్వు విసిరినా జన్మ ధాన్యమే..అన్నీ కోరికలు తీరిపోతాయి.

ఇంకా..తొలకరి చినుకుకి పులకరించి తన మేను నుండి సువాసన వెదజల్లే నేలతల్లి ఒక అద్భుతం.ఆ సువాసన దేనితో పోల్చాలంటే..తల్లిని బిడ్డని కలిపే ప్రేమ బంధం తో పోల్చచ్చేమో కదా..యెంత ఆస్వాదించినా ఇంకా తృప్తి కలగదు.నా ముక్కులు ఇంకాస్త పెద్దవి ఐతే ఇంకొంచం వాసన పీల్చేసేదాన్నే అనిపిస్తుంది :)
నాకు కావలసినప్పుడు వాన పడకపోయినా నేను చేస్కున్న ఏర్పాటు ఇంకొకటి వుంది.గోడ మీద కాసిని నీళ్ళు జల్లినా అదే సువాసన.అందుకే అప్పుడప్పుడు చేతిలో ఒక మగ్గు పట్టుకుని నేను మన గోడ దగ్గర సంచరించేది;)

అమ్మ కలిపి పెట్టె కొత్త ఆవకాయ మొదటి ముద్ద.అంటే,అది అమృతం.రెండో ముద్దకే పాతబడిపోతుంది.ఆ మొదటి ముద్ద అలా నోట్లో కరుగుతూ వుంటే ..ummmm..స్వర్గం :) గొట్టాలు అని పసుపు పచ్చ రంగులో ఉంటాయి కదా..అవి వేయించుకుని నముల్తూ ఒక్కదాన్నే మంచి అర్ధం కాని సినిమా చూడటం కూడా చాలా ఇష్టం :ప.ఇప్పుడంటే పెరుగన్నం నిషేదిన్చా కాని, చిన్నప్పుడు అన్నం లో నెయ్యి వేసి కలపనిచ్చి,అప్పుడు కురన్నం వద్దు,పెరుగన్నం కావాలి అని అడిగేదాన్ని.తిండి గురించి మొదలెడితే ఈ వ్యాసం కాస్త గ్రంధం అవుతుంది..ఇక్కడితో ఆపుతాను.

ఘంటసాల పాటలు.అందులో కొన్ని నాకోసమే పాడారు అనుకుంటే ఇంకా ఆనందం.ఆ పాటలే లేకపోతె నాకు ఊపిరాడదు.
నిద్ర లేవగానే ఏదో ఒక పాట మదిలో మెదుల్తుంది..ఆ పాట వెంటనే వింటే అదో ఆనందం.చూసావా..నాకు చాలా ఇష్టం అనుకునేవి ఈ క్షణం లో గుర్తురావట్లేదు.ఇప్పుడు ఇక్కడ రాసినవి మాత్రమె ఇష్టం అనుకుంటే పొరపాటేమో.ఇంకా చెప్పలేనన్ని ఇష్టాలు ..ఒక్కోసారి ఇష్టం లేదు అనుకునేది కూడా ఇష్టమే..ఎంటో మరి..

మళ్ళి ఆలోచించి ఇంకాసిని ఇష్టాలతో వస్తా..టాటా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి