6, డిసెంబర్ 2009, ఆదివారం

చాక్లెట్ డిప్..వంటలో టిప్

మడిసన్నాక కుసింత కలాపొసన ఉండాలి కదా..మనం తిండి విషయం లో బాగా ప్రయోగిస్తాం లే ఆ పోషణ.

ఫారెన్ నుండి వచ్చిన వాళ్ళు అందరు ముందు తెచ్చేది ఛాక్లేట్లే కదా.మొన్న ఆ బాపతు చాక్లెట్లు బోలెడు ఉన్నాయి ఇంట్లో. చూడటానికి బాగున్నా కొన్ని మాత్రం తొందరగా అయిపోయాయి.ఇహ ఎక్కువగా తినేస్తే మేము కూడా ఆ చాక్లెట్ రంగులోకి మారిపోతాం అని తేలిపోయిన తర్వాత,అంత భీకరంగా చాక్లెట్లు తినే పరంపర కి కొద్ది రోజులు సెలవ ప్రకటించాం.ఏదో ఇటోస్తూ అటు పొతూ ఒకటో రెండో నోట్లో వేస్కోవటం తప్ప,ప్లేట్ నిండా పెట్టుకుని పలహారం చెయ్యటం మానేశాం.ఇహ అప్పుడే వచ్చంది తంటా.వాటిని ఎక్కడ దాచిపెట్టలా అని.ముందు ఒక ప్లాస్టిక్ కవర్ కి అన్నీ వేసి ఫ్రీజేర్ లో పెట్టేశాం కానీ అక్కడ ఆవకాయ జాడీ తో గట్టి పోటి ఎదురవ్వటం తో మళ్లీ ఆ కవర్ ని బయటికి తియ్యక తప్పలేదు.ఎలా మర్చిపోయామో కానీ పాపం ఆ కవర్ మొత్తం కొద్ది రోజులు బయటే ఉండిపోయింది.

ఇవాళ మధ్యానం బాగా తీపి తిందాం అనిపించి ఆ కవర్ గుర్తొచ్చింది.వెంటనే వెళ్లి ఒక పెద్ద..ద చాక్లెట్ ప్యాకెట్ తెరిచి ఒక ముక్క తుంచి నోట్లో వేసుకుందాం అనేది మన ఆలోచన.కవర్ ముట్టుకోగానే ఏదో తేడ గమనించాను కానీ తెరిచాక చాక్లెట్ ముక్క కాదు  కదా,చాక్లెట్ పానకం బయటికి వచ్చింది.పర్యావరణ సంరక్షణ చేయకపోతే వేడెక్కి భూమి బుగ్గైపోద్ది అనే విషయం ఇవాళ ఆ కవర్ తెరవగానే అర్ధం ఐపోయింది.యేమి ఎండలు రా బాబు.

ఇంతకి అలా ఐపోయినందుకు బాధ పడి చేతులు ఊపుకుంటూ వెనక్కి వచ్చేసా అనుకుంటున్నారా ఏంటి? అబ్బే..బుజ్జి గురించి తెలిసినవాళ్లు ఎవరూ అలా అనుకోరు లే.చక్కగా రెండు కటోరీలు తీస్కుని,ఒక పెద్ద స్పూన్ తో చాక్లెట్ పానకం వాటికి నింపి,ఓక ఆపిల్ ని సన్న ముక్కలుగా కోసి,ఈ డిప్ లో ఆపిల్ ముక్కలు నంచుకుని తినేశాం.బ్రమ్హాండంగా వుంది.పెద్ద పెద్ద ఆవిష్కరణాలు ఇలా నాలాంటి మేధావుల చేతుల మీదుగా జరిగిపోతుంటాయి ఏంటో మరి!

ఇలాంటి చిన్నా చితకా ప్రయోగాలు చేసి నాకు కూడా వంట చెయ్యటం ఒచ్చని ఒక గట్టి నమ్మకం ఉండేది నాకు.ఏ వంట చేసినా వైవిధ్యం ఉండాలనే తపనతో కొన్ని కొత్త వంటకాలు కనిపెడితే,నన్ను జంధ్యాల సినిమా లో బంగాళా బవ్వ్ బవ్వ్ చేసిన శ్రీలక్ష్మి లాగా ఆరాధనా భావం తో చూడటం మొదలెట్టారు జనం.మచ్చుకి కొన్ని చెప్తా..

ఒకసారి పొటాటో కాస్సేరోల్  అనే పదార్ధం ఫ్రీ గా నో అర్ధరూపాయి కో(అంటే డాల్రున్నర)కో వస్తుందని ఒక తట్టెడు తెచ్చి పెట్టారు ఇంట్లో.రుచి బాగుంటే రెండు తట్టలు ఐనా అయిపోతుంది కానీ మనకి తవుడు తినే అలవాటు అంతగా లేకపోవటం తో ఫ్రిజ్ లో మగ్గింది ఒక నాలుగు రోజులు.అటు పారేయ్యలేక,ఇటు తినలేక బుర్రకి బాగా పదును పెట్టి,పావు భాగం తో ఉల్లిపాయలు, మసాలాలు దట్టించి అసలు పదార్ధం వాసన కూడా మిగలకుండా దాని రూపు రేఖలు మార్చేసా.అది నేనే స్వయంగా చేసిన బంగాళదుంప కూర అని నమ్మించి జనానికి పెట్టేసా.రోజూ అదే పెడితే అనుమానం వస్తుందని,ఇంకో పావు భాగం లో మైదా పిండి కలిపి అప్పచ్చలు చేసి నూనెలో వేయించి పెడితే,అమోఘం,దివ్యం అని లాగించేసారు.మరో పావు భాగం తో గోధుమపిండి కలిపి పరాఠ చేశా. ఇంకో పావు భాగం పాస్తా లో పడేసా,ఇంటికొచ్చిన చుట్టాలు ఖాళి చేసేసారు దాన్ని.ఒక రోజూ వంట ఎం చెయ్యాలో తోచక తిరుగుతుంటే,అప్పుడెప్పుడో ఒరిజినల్ రెసిపీ తో చేసిన బంగాళదుంప కూర భలే వుంది,మళ్ళి వండి పెట్టావా బుజ్జి అని అర్జీ పెట్టుకున్నారు మా వాళ్ళు.అర్జెంటు గా పొటాటో కాస్సేరోల్ ఎక్కడ దొరుకుతుందో కనుక్కోవాలి.

ఒరిజినాలిటి పోకుండా సాంబార్ లో అల్లం,వెల్లుల్లి,గరం మసాలా,కోడిగుడ్డు పచ్చ సోన లాంటివన్నీ వేసినప్పుడు మాత్రం కొడతాం అని బెదిరించారు.అందుకే మీరు కూడా ఎప్పుడూ ప్రయత్నించకండి.నెయ్యి వడపోస్తే బాటిల్ లో అందంగా కనిపిస్తుందని,మరిగే నేతిని ప్లాస్టిక్ స్త్రైనర్ తో వాడకట్టేసే ప్రయత్నం చేసాను ఒకసారి.కళ్ళ ముందు భలే కరిగిపోయింది ఆ ప్లాస్టిక్.అందుకే ఈ మధ్య స్టీల్ స్త్రైనర్ వాడ్తున్నాలే. ఇంతకి నేను చేసిన కేకు గురించి చెప్పానా.ఒక సిద్ధాంతం ఉంది.అన్ని మంచి పదార్ధాలు వేసి వండిన పదార్ధం ఏదైనా రుచిగానే ఉంటుంది అని.అది ఫాలో అయ్యి,కేకు కి కావాల్సిన సరంజామా తో పాటు,జీడిపప్పు,ఎండు ద్రాక్ష,బాదం పప్పులు,పాలు కుంకుమ పువ్వు,నారిజ రసం,చక్క లవంగం,కప్పు నెయ్యి,వెన్న,బంగినపల్లి మామిడి పండు ముక్కలు,కోకో పౌడర్, చిటికెడు బ్రూ కాఫీ పొడి,ఒక రెండు స్పూన్లు వనిల్లా ఐస్క్రీం వేసి బాగా కలిపి అవెన్ ఆన్ చెయ్యగానే మెరుపు మెరిసింది. అదే ప్లగ్ పేలిపోయింది.నాకు శకునాల మీద పెద్ద నమ్మకం లేదూ..తుమ్ము,పిల్లి,బల్లి ల లొల్లి అత్యవసర సమయం లో మాత్రం పట్టించుకుంటా.అందుకే ఆ ఘనపదార్ధాన్ని మైక్రోవేఉవ లో పడేసి పావుగంట తిప్పితే...ఘుమఘుమలాడే...అబద్ధం ఎందుకులే,
సిద్ధాంతం తప్పని తేలింది.గన్నేరు పప్పు ఒక్కటే మిస్సింగ్ ఇందులో అని ఎక్కిరించినట్టు కూడా గుర్తు.

నేను వండటం,వంట లో ప్రయోగాలు చెయ్యటం ఇంకా మానలేదు.ఒక లైసెన్సు ఇచ్చారుగా జనాన్ని వైద్యం తో వైవిధ్యంగా చంపటానికి,మళ్ళి ఇంకో లైసెన్సు ఎందుకని కొందరు గొణిగినా,నాకు ఇలాంటి మాటలకి సేలేక్టివే హియరింగ్ లాసు ఉంటుంది.
అందుకే కొత్త ప్రయోగం పూర్తవగానే మళ్ళి వస్తా..టాటా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి