3, డిసెంబర్ 2009, గురువారం

Dr.బుజ్జి - O.P

ఇవాళ పొద్దున నాన్నారు టీ లో చక్కర తక్కువ అయ్యింది అంటే,నా అవుట్ పేషెంట్ డిపార్టుమెంటు లో మొదటి  రోజులు  గుర్తొచ్చాయి.

నేను నా భయం బిడియం దాచేసి ధైర్యంగా కూర్చున్నా పేషెంట్ లని చూద్దాం అని.అప్పటికే పేషెంట్లు అందరు కొత్త సినిమా కి ఫస్ట్ డే ఫస్ట్ షో లాగా మా రూము బయట గుమిగూడి ఉన్నారు.అంత మందిని ఒక్కసారే చూసేసరికి నా గుండె కాస్తా జారిపోయింది. అయినా నటన ఏమాత్రం తగ్గించలేదు.మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అలాగే కూర్చున్న.ఇంతలోకి ఆ గుంపు లో నుండి ఒక పెద్దాయన అందరిని తోసేస్కుంటూ లోపాలకి వచ్చాడు.

"అమ్మ డాక్టార్ అమ్మ,జల్ది నన్ను సూడు తల్లి.నీ కాల్ మొక్తా.ఆకుకూరల తట్ట కూడా బయటనే పెట్టచ్చినా.జల్ది సూడు తల్లి" అని మొదలెట్టాడు.మన ప్రతిభ ముందుగా ఈయన మీదే ప్రయోగిద్దాం అనుకుని,"ఎం తాతా, ఏమైయ్యింది..ఎందుకు కంగారు" అని అడిగా.
తాత  : "పోద్గాల్సంది ఒక్కటే నోస్తుంది "
బుజ్జి  : యెడ నోస్తుంది తాతా??
తాత  : ఇంటికాడ  నుండి  నోస్తుంది  బిడ్డా .
బుజ్జి  :  ?? ?? ?? ఇంటికాడ నుండి  సరే..నీకు యెడ నోస్తుంది ?
తాత  : కడ్పుల
బుజ్జి  : కడుపులో ఎక్కడ ??
తాత  : కడ్పులనే..మొత్తం
బుజ్జి  :(చేతితో సైగ చేసి) ఇక్కడా ? ఇక్కడా ??
తాత  :ఒక్క సోట అని ఎమ్ లేదు బిడ్డా ... మొత్తం నోస్తుంది .

అసలే నాకు కొత్త..పైగా నేను టెక్స్ట్ పుస్తకం లో చదువుకున్నట్టు కుడి ఎడమ అని చెప్పకుండా ఈ ముసలాయన మొత్తం అనే సరికి ఖంగు తిన్నాను.ఈయన జబ్బు ఏంటో నిర్ణయించుకోలేక మా చీఫ్ డాక్టర్ వచ్చేదాకా పెద్దాయన్ని మాటల్లో పెట్టేద్దాం అనుకున్నా.అందుకే ప్రశ్నల పరంపర కొనసాగిస్తూ..

బుజ్జి : తాతా, నీకేమన్నా షుగర్,బీ.పీ లాంటివి ఉన్నాయా ?
తాత : అంటే ఏంది?సక్కేర అనేనా నువ్వు  అడిగేటిదీ?
బుజ్జి : అవును
తాత : పెదోల్లం తల్లి.సక్కేర ఇప్పుడు ఐతే తేలే నేను.పొద్గాల చై లో ఐతే జరంత ఎస్కుని తాగ్తా.గా బీపి ఏందో తెల్వదు
బుజ్జి : అది కాదు ...చక్కెర రోగం ఎమన్నా ఉందా ?
తాత :ఏమో నాకెట్ల తెల్స్టది?రోగం ఉన్నదో లేదో నువ్వు జెప్పాలె తల్లి..
బుజ్జి :సరే లే...మరి రక్తపోటు ?
తాత : ఏందో నాకు ఒక్క కడుపు మాత్రమె నోస్తుంది... ఇంకేమేమో రోగాల్  అడ్గుతున్నవ్...దీనికి ఒక్క పచ్చ సూది ఇస్తే నే      పోత బిడ్డా...బయట ఆకుకూరల తట్ట పెట్టచ్చినా..గయి నల్లగయితయ్...ఇంక ఎవల్లు కొనరు... మా ముసల్ది  తిడ్తది.
బుజ్జి :పచ్చ సూది అంటున్నావ్? ఇంతక ముందు వచ్చావా ఇక్కడకి ?
తాత : నేను ప్రతి మంగ్లారం వస్తా తల్లి...నిన్నుకొత్తగ జూస్తున్న గాని...నేను ప్రత్తి మంగలారం అస్తా.
బుజ్జి : ??? నీకు పచ్చ సూది కాదు తాతా...మంచి మందులు రాసి ఇస్తాలే.కడుపు నొప్పికి మంచిగ పని చేస్తవి..
తాత  :అయ్యో వద్దు తల్లి..నాకు పచ్చ సూది రాసి ఇయ్యి.నేను జల్ది పోత..గీ నేప్పికి పచ్చ సూదే మందు.నువ్వు ఒక్క సంతకం చేసి పచ్చ సూది రాయి.నేన్ సేపించ్కుని ఇంటికి పోతా..

కాసేపు నిశ్శబ్దం..

అప్పటికే మా చీఫ్ డాక్టర్ వచ్చారు..నేను గాక ఒక గొప్ప అంతుపట్టని కేసు పట్టుకున్నాను అని ఆయన దగ్గరికి తీస్కుపోయాను ముసలాయన్ని.దూరం నుండి చూస్తూనే...కంటిన్యూ సేము ట్రీట్మెంట్ అని అరిసారు ఆయన.

అప్పుడు అడిగాను "ఎం తాతా..పాత చిట్టి ఏమన్నా వున్నదా"అని..జేబులో నుండి తీసాడు ఒక చినిగి సిదిలావస్థ లో ఉన్న కాగితం ముక్క.కొన్ని సంవత్సరాల క్రితం ఈయన నీరసం గా వుంది అని వస్తే బీ.కాంప్లెక్స్ ఇంజెక్షన్ రాసారు అట డాక్టర్లు.
అది వేయిన్చుకున్నాక ఈయనకి బోలెడు ఓపిక వచ్చేసిందట.ఇహ నక్షత్రకుడి లాగా ప్రతి వారం డాక్టర్ల వెంటపడి అదే సూది వెయ్యమని గోల.ఈయన బాధ పడలేక నెలకి ఒక సారి ఆ సూది వేసేయ్యమని నిరవధిక సూచన.కాని ఈ తాత మాత్రం ప్రతి వారం సూది కోసం ఆశగా వచ్చి పోతుంటాడు.

నాకు మాత్రం తప్పుతుందా..అసలే పాత రోగి వైద్యుడి కంటే బలవంతుడు అంటారు..అందుకే నేను కూడా మిగతా వాళ్ళ లాగా
CST రాసేసి పంపేసా..(continue same treatment).తాత ఆకుకూరల తట్ట తో ఇంటికి..బుజ్జి స్టేతోస్కోప్ తో వార్డ్ కి..
మిగతా సోది తర్వాత..తాతా..కాదు కాదు టాటా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి