5, డిసెంబర్ 2009, శనివారం

ఏవేవో..

అప్పుడప్పుడు కబుర్లు చెప్పుకుంటుంటే భలే సరదా సంభాషణలు బయటికి వస్తాయి కదా.
మొన్న ఒక సాయంత్రం హాయిగా మన అరుగు మీద కుర్చుని కబుర్లు వేస్కుంటుంటే,టపటపా కాసిని చినుకులు  పడ్డాయి. పక్కనే ఉన్న కార్డ్ లెస్స్ ఫోన్ తడిసిపోతుంది అని దాన్ని చున్నీ లో దాచిపెడ్తుంటే,అమ్మకి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం దాచిన ఫోన్ లోపల పిల్లలు పెడితే యేల ఉంటుంది అని.హీ..హీ.భలే నవ్వొచ్చింది.నిజమే,మనం అలా దాచేసిన తరువాత ఏదో కుయ్యి కుయ్యిమని శబ్దం వచ్చి,తీసి చూసేసరికి బోసి నవ్వులు నవ్వుతూ చెంగున ఒక రెండు ఫోన్ పిల్లలు బయటికి దూకితే యేల ఉంటుంది? భలే ఆలోచన కదూ:)

చిన్నప్పుడు అమ్మ,వాళ్ళ అక్కల కోసం,వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి,పుస్తకాలు,నవలలు తెచ్చేదట.అవి ఎలా తెచ్చేదనిన...
అప్పటికి అమ్మకి 5 సంవత్సరాలు వుంటాయేమో.అప్పటినుండి ఈ డ్యూటీ వేసారు మా పెద్దమ్మలు అమ్మకి.వాళ్ళ అమ్మమ్మగారి ఇల్లు ఏమో పక్కనే,పది అడుగుల దూరం కూడా ఉండదు కాని అప్పటికే మేనమామ గారి హయాము లో వుంది ఆ ఇల్లు.ఇష్టం వచ్చినట్టు ఆ ఇంట్లో తిరిగే స్వతంత్రం కూడా అలాగే పోయిందట.ఏడుగురు  సంతానం లో చివరాఖరు పిల్లాయే.అటు తనకన్నా వయసులో బాగా పెద్దవారైన అక్కల తో కూడా అంత  చనువు లేదూ.వాళ్ళకోసం తెచ్చే పుస్తకాలలో బొమ్మలు చూడచ్చు,పైగా అమ్మమ్మ గారింటికి వెళ్తే,చిన్న పిల్ల కదా అని పప్పులో,ఎండు ద్రాక్షో చేతిలో పెట్టేవారు కాబట్టి మొదట్లో త్వరగా వెళ్లి త్వరగా వచ్చేదట.మెల్లిగా అమ్మకి కూడా చదవటం వచ్చాక,ఆ ఇంటికి వెళ్ళటం ఏమో రెండడుగుల్లో అయిపోయేది.అక్కడ పుస్తకాల కట్ట తీస్కుని మండువాలోగిలి ఇంటి నుండి చీమ లాగా నడుచుకుంటూ,ఆ పుస్తకాలు దారిలో చదివేస్తూ రావటానికి మాత్రం అరగంట పట్టేదట.ఇప్పటికి మంచి పుస్తకాలు కొని చదవటం అమ్మకి బాగా అలవాటు.భారత భాగవతాలే కాక ఏదైనా వస్తువు పొట్లం కట్టిన కాగితాన్ని కూడా వదలకుడ చదువుతుంది అమ్మ.యథా మాతా తతా సుతా.మనకి అదే అలవాటు వచ్చిందనుకో:)

అమ్మ వాళ్ళ చిన్నన్నయ్య కి అమ్మ అంటే చాలా ఇష్టం.ఎంతైనా అబ్బాయి కదా అని చేసిన పరవాన్నం లో కాస్త ఎక్కువ నెయ్యి వేసి తనకి పెడితే..తీస్కొచ్చి అమ్మ నోట్లో పెట్టేవాడట.పొద్దున్నే నిద్ర లేపి,ఇందా ఈ పరవాన్నం తిను అని బ్రతిమాలి పెట్టబోతే, ఇంకా పళ్ళు తోముకోలేదు,వద్దు అనేదట అమ్మ.పిచ్చిదానా,నీకేం తెలుసు..పాచి మొహం తో పరవాన్నం తింటే పరవతం పోయోచ్చినంత పుణ్యం అని చెప్పి తినిపించేసేవాడట.తీరా తినేసాక రోజంతా ఎక్కిరించేవాడట.ప్రతి పండగ మరుసటి రొజూ ఇదే తంతు.ఒకసారి మోసపోతారు కానీ ప్రతిసారి ఎందుకు తిన్నావ్ అని నేను అమ్మని అడిగితె,పుణ్యం కోసం లే, పరవాన్నం కోసమేం కాదు అని నవ్వేస్తుంది:)

ఒకసారి బడికి సెలవులిచ్చినప్పుడు,పొలం దగ్గరికి వెళ్ళిందట అమ్మ.పదేళ్ళు వుంటాయేమో.పెద్దబావ అన్నం తినటానికి చేతులు కడుక్కోస్తా,ఇక్కడే కాపలా వుండు అని నిలబెట్టి వెళ్లారట.ఇంతలో ఒక పురుగు,పాక్కుంటూ వచ్చి అమ్మని పలకరించిందట. అసలే పురుగులంటే భయం.ధైర్యం చేసి,ఒక మట్టి బెడ తీస్కుని,గట్టిగా కళ్ళు మూసుకుని దాని నెత్తిన వేసిందట.కళ్ళు తెరిసి చూస్తే ఒకటికి రెండు పురుగులు కనిపించాయట.టార్గెట్ మిస్ అయ్యిందో,లేక నిజంగానే అది బతికొచ్చి సైన్యాన్ని వెంటతేచ్చుకుందో కానీ,అమ్మ 100 yards పరుగు పందెం పెడితే ఆ క్షణం లో వరల్డ్ రికార్డు ని బద్దలు కొట్టేసేదేమో.

ఇంట్లో పెద్ద పెద్ద గాబులు రెండు ఉండేవి.రొజూ వారి అవసరాలకి కావిడి తో నీళ్ళు తెచ్చి ఈ గాబులు నింపేవారట పెద్ద బావ.
ఆడవాళ్ళూ బిందెలతో తాగే నీరు తోడుకోచ్చేవారట.చిన్న పిల్ల కదా,నేను కూడా మోసుకోస్తా అని మారాం చేస్తుంటే,ఒక చెంబు ఇచ్చి,దీనితో తే లే చాలు అని చెప్పేవారట.ఒకసారి నీళ్ళు తోడుతుంటే ఒక తాబేలు పిల్ల చిక్కిందట.దానితో కాసేపు ఆడుకుని,తాబేలు అనే పదం నేర్చుకుంది అమ్మ.కప్పు అనటం మాత్రం వచ్చేది కాదట.అందుకని కప్పు కనిపించినప్పుడల్లా తాబేలు అంటాలే...తప్పెందుకు (కప్పు) తాబెలంటా లే అనేదట.

ఎన్నో రోజులు పగలు రేయి అనకుండా తీరిక దొరికినప్పుడల్లా..నిజం చెప్పాలంటే ఆ కబుర్ల కోసమే తీరిక చేసుకుని,మనసుకి మా మాటల పౌష్టికాహారం పెట్టి పోషించాము.ఎండాకాలం లో వడియాలు పెడ్తూ,చీరలకి గంజి పెట్టి ఆరేస్తూ,కనిపించిన ప్రతి కాయ ని జూసు చేస్కుని ఫ్రీజేర్ లో ఒక పుల్ల కూడా పెట్టి ఐస్ చేసి,మల్లెల వాసనలో,చల్లని వెన్నెలలో అరుగు కూడా మా కోసం ఎదురు చూసేట్టు మాట్లాడుకునేవాళ్ళం. చలికాలం లో రగ్గు కప్పుకుని ఆరు బయట అదే అరుగు మీద కుర్చుని,నిన్న చందమామ వలచి, మెచ్చి,జతకట్టిన తార ఎవరు అని తీవ్రంగా చర్చించేవాళ్ళం.చలికాలం లో కూడా ఐస్క్రీం తింటూ,ఇప్పుడు గడ్డకడితే నన్నారు వచ్చి మనిద్దరిని స్టవ్ మీద పెట్టి కరిగిస్తారు లే అని నవ్వుకునేవాళ్ళం.వానా కాలం లో చూరు కింద,గడప లో కుర్చుని హాట్ చాకోలేట్ తాగుతూ,చినుకుల్ని పలకరించేవాళ్ళం.ఆ వాన నీళ్ళు తిరిగొచ్చిన దారినంతా మేము నేమరేసుకునేవాళ్ళం.
ఈ కబుర్లు అన్ని నిర్విరామంగా దొర్లేది అలాంటప్పుడే.అదే అరుగు,అదే ప్రక్రుతి,ఋతువులు మారినా అవే కబుర్లు..మనసుకి నచ్చే కబుర్లు..ఏవేవో కబుర్లు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి