నిజంగా ఈ మాటకి అర్ధం ఇవాళే తెలిసింది.నా మొదటి మంచు రోజూ:)
అదే..ఇవాళ మొదటిసారి భారి ఎత్తున మంచు కురవటం చూసాను.నా దేశం నుండి,నా వాళ్ళ నుండి, ఇంతదూరంగా ఉన్న సరే,ఇవాళ ప్రక్రుతి తో చెలిమి చేసి చాలా సంతోషంగా ఉనాను.ఏదో ఊహించని మలుపుతిరిగి జీవితం అంతా తేటతెల్లం అయిపోయిందని కాదు ఈ సంతోషం.ఇంకా అవే సమాధానం లేని ప్రశ్నలు, అవే సమస్యలు,అవే నిరాశలు,నిట్టూర్పులు, మెల్లిగా మొలకెత్తుతున్న ఆశలు,ఆశయాలు,తప్పక తీరుతాయ్ అనే కోరికలు,అన్నీ అలాగే ఉనాయి.అసలు ఎవడన్నాడు సంతోషంగా ఉండటానికి కారణం కావాలని:)
మంచు పడ్తుంటే వెళ్లి కాసిని ఫ్రెంచ్ ఫ్రాయీస్ తిన్నాను.అగ్నికి ఆజ్యం లాగా నా సంతోషానికి ఇంకా బలం కోసం యాలుకలు దంచేసి పానకం లాగా టీ పెట్టుకుని తాగేశాను.దిల్ ఖుష్!:))
వర్షానికి మంచుకి కాస్త తేడా గమనించాను ఇవాళ.వర్షం పడ్తుంటే చూసారా..ముందు రాజుగారి రాకని సూచిస్తూ నల్లటి పెద్ద పెద్ద మేఘాలు.ధడేల్ మని ఉరుములు.ఆ తర్వాత వెయ్యి వాట్ల బుల్బు వేసినట్టు మెరుపులు.అప్పుడు చిన్నగా మొదలవుతుంది తొలకరి.పెరిగి పెరిగి పెద్ద వాన.మనసులో మకిలి కూడా కొట్టుకుపోయే వాన.స్వచ్చంగా ఉంటుంది వాన వెలిసాక.చెట్లన్నీ పండగకి తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకున్న పిల్లకాయల్లా సంతోషంగా ఉంటాయి..కదా.వర్షం పడేప్పుడు ఆ నెల నుండి వచ్చే సువాసన,అదో కొత్త లోకమే.నిజంగా ఒక్కోసారి వర్షం వెలిసాక గిఫ్ట్ వ్రాప్ తీసిన ప్రజంట్ లాగా అనిపిస్తుంది నాకు లోకమంతా.
ఇంక మంచు పడేప్పుడు ఈ డోలు బాజాలు ఎం లేవు.మెల్లిగా మొదలవుతుంది.తెల్లగా,దూదిపింజలాగా,నిశ్సబ్దంగా.తన రాక మనకి తెలిసేది తలెత్తి చూస్తే మాత్రమె.లేకపోతె అందరిని,అంతటిని తెల్లటి దుప్పటితో కప్పేస్తుంది.మంచు పడుతున్నప్పుడు చూడటానికి చాలా అందంగా ఉంటుంది.మనసు కూడా ఆ దూదిపింజలతో ఎటో తెలిపోతుంటుంది.తన దారిలో ఉన్న అన్నిటిమీదా తెల్లటి మేలిముసుగు చూడముచ్చటగా ఉంటుంది కూడా.అన్ని చెట్లూ కొత్తగా విరగాపూసిన పత్తి చెట్ల లాగా ఉంటాయి.
చలికాలానికి భయపడి కొన్ని చెట్లూ ముందుగానే ఆకులు రాల్చేస్తాయ్ కదా,కొన్ని చెట్లూ ఎదురు తిరిగి ఇంకా ఆకులు కప్పుకుని ఉన్నాయ్ అని వాటి పని పట్టటానికి వస్తదేమో మంచు.మెల్లిగా వచ్చినా పచ్చటి చెట్లని కూడా తెల్లటి మంచు తో కప్పేస్తుంది. మర్నాటి పొద్దునే పాపం అ చెట్లని చూడాలి.మంచు కరిగాక నల్లగా మాడిపోయి ఉంటాయి.ఇంతందం తనలో దాచుకున్న మంచు ఇంక వికారంగా దేన్నైనా ఎలా మర్చగలదా అనిపిస్తుంది నాకు.అబ్బా..ఏంటో ఇలా రాసుకుంటూ పోతుంటే నాకు నిజంగా మంచు అంటే ఇష్టమో కాదో అని నాకే అనుమానం వస్తుంది.ప్రస్తుతానికి మంచు మానసిక విశ్లేషణ కంటే దాన్ని ఆస్వాదించటం మంచిదేమో.చిన్నప్పటి నుండి కొన్ని కోరికలు ఉన్నాయి నాకు.వాటిల్లో ఒకటి హిమాలయపు అంచులకి వెళ్లి మంచుని చూడాలని.ఇన్నాళ్ళకి మంచుని చూసాను,నేను కోరుకున్న ప్రదేశం లో కాకపూయిన సరే.ఇంకా బుజ్జి కోరికలు ఏంటో తెలుసుకోవాలి అని కుతుహలమా.చెప్తా,చెప్తా.కానీ ఇప్పుడు కాదు.
ఈ పాటికి జనం పాపం మంచుని తెగ తిట్టుకుంటున్నారు.బయటికి వెళ్ళటానికి లేదూ,రేపు రోడ్లన్నీ బురదమయం గా ఉంటాయి అని,ఇంకా చాలా తిట్టుకుంటున్నారు లే.కానీ నాకు సంతోషంగానే ఉంది.ప్రక్రుతి ఏ బట్ట కట్టినా అందమే.ఇన్నాళ్ళు ఆకుపచ్చ చీరలో పెల్లికుతురి లా చూడటం అలవాటైన నాకు ఇవాళ తెల్ల పట్టుపంచె కట్టుకున్న పెళ్ళికొడుకు లా కనిపిస్తుంది/తున్నాడు? :P
మళ్ళి చల్ల చల్లని కబుర్లతో వస్తాలే..టాటా
7, డిసెంబర్ 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి