19, డిసెంబర్ 2009, శనివారం

బుజ్జి కోరికలు

చిన్నప్పటినుండి నాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయ్.కొన్ని పనులు చెయ్యాలని,కొన్ని ప్రదేశాలు చూడాలని,చిన్నా పెద్దా కోరికల లిస్టు ఉందిలే.పురావస్తు తవ్వకాల్లో బయట పడ్డట్టు,ఈ మధ్యనే నా చాంతాడు కోరికల చిట్టా బయటపడింది. Bucket List అనే సినిమా చూసి,సావకాశంగా అర్ధరాత్రి ఆలోచించి ఇక్కడ పొందుపర్చుకుంటున్నాను.

మరీ చిన్నప్పుడు లిల్లిపుట్లు దొరికితే బాగుండు అని మా పెరట్లో వెతకటం,మా తోటలో గులాబీల చేత ఎలాగైనా మాట్లాడించాలి అనుకోవటం,హిట్లర్ గురించి చదివి నేనూ కూడా ఒక నియంత గా మారి ఒక సామ్రాజ్యం స్థాపించాలి ఆకోవటంలాంటివన్నీ మామూలే.
ఫిజిక్స్ చదువుకునేప్పుడు,మేటర్,యనర్జి ఒకదానిలోకి ఒకటి మార్చచ్చు అని తెలుసుకుని,ఆ అంశం మీద ఒక నవల రాసేద్దాం అని బయల్దేరా.ఆ మాటే ఇంట్లో చెప్తే,ఫిజిక్స్ లో మర్కులు తగ్గుతున్నాయ్,బుద్ధిగా చదువుకొమ్మని నెత్తిన ఒక మొట్టికాయ పడింది.స్కూల్ లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద శాస్త్రవేత్తల పేర్లు అంత క్లిష్టంగా ఎందుకుంటాయో అర్ధమయ్యేది కాదు.నేనూ ఎప్పటికైనా ఏదైనా మంచి ఆవిష్కరణ చెయ్యాలి అనే కోరిక ఉన్నా,నా పేరు గుర్తుపెట్టుకోలేక పిల్లలు సతమతమవుతారని మానుకున్నాను.


కూని రాగాలు బాగా తీస్తున్నానని నాకు సంగీతం నేర్పబోతే,ఒక్క ఏడాదికల్లా,సాహిత్యాభిలాష ఎక్కువయ్యి,పాటలు వింటూ,నేనూ పాడటం మానేశా.అదే సమయంలో తాళం మీదకి మనసు మళ్ళి,సంగీతం వొద్దులే,నృత్యం నేర్చుకుంటాను అని ఎగిరాను. కుచపూడి నేర్చుకుందాం అనే మొదలెట్టాను.ఆరు నెలల తరువాత,కళలు కూడు పెట్టవురా,సదువుకో అని బలవంతం చేసి నన్ను హాస్టల్ లో పడేసి డాక్టర్ ని చేసేసారు.అందుకే మెడిసిన్ ఐపోయాక మళ్ళి ఒక డాన్స్ టీచర్ ని కలిసా.వైద్యం మానేసి,బుద్ధిగా రోజూ వచ్చి నేర్చుకుంటా అని మాట ఇవ్వమన్నది ఆవిడ.మళ్ళి ఇటూ వస్తే నీ మీద ఒట్టు అని మాట ఇచ్చేసి పారిపోయా.

ఘంటసాలగారిని,రాఫిగారిని,వారి పాటలు విన్నాక,ఒక్కసారైనా కలవలేకపోయానే అని చాలా బాధ పడ్డాను.నేనూ కాస్త ముందు పుట్టాల్సింది,లేదా వారు కాస్త ఆలస్యంగా గతించాల్సింది.మా టైమింగ్ మ్యాచ్ కాలేదులే.
చందమామ అంటే చాలా ఇష్టం నాకు.ఒక్కసారైనా ఆ చంద్రమండలం మీద కాలు మోపాలని ఒక కోరిక.నేనూ ఊహించిన కలల ప్రపంచంలా ఉండదని తెలుసు.ఐనా అవకాసం వస్తే నీలాల నింగి మెరిసిపడే నిండు చంద్రుడిని తాకాలనే కోరిక ఇంకా ఉంది.

ఒకప్పుడు భూమికి అవతలివైపు ఏముందో తెలుసుకోవాలనే కోరికతో,మా కారు గారేజీ లో తవ్వటం మొదలెట్టా.అది కూడా ఒక చిన్న పుల్లతో.అసలు అలా ఒక్క మూడు నెలలు తవ్వేసుకుంటూ పొతే నా కల సాకారం అవుతుందనే గట్టి నమ్మకం నాకు. కానీ ఈ లోపు వర్షాలు పడి,తవ్విన మూడు సెంటిమీటర్లు పూడుకుపోయింది.మళ్ళి అటూ వెళ్ళలేదు నేనూ.
సప్తర్షి మండలం లో ఒక నక్షత్రం రాలిపోతే చూడాలని ఒక కోరిక.ఇదేం వెర్రి కోరిక అని అడగద్దు.నాకెందుకో నక్షత్రాలు కూడా అశాశ్వతం అని తెలుసుకున్నప్పటి నుండి ఈ ఆలోచన ఎక్కువైయ్యింది.మరి నేనుండగా అది చూస్తానో లేక ఇంకో జన్మ ఎత్తాలో.

మంచు కొండలంటే నాకు చాలా ఇష్టం.అందులోను హిమాలయాలు అంటే చెప్పలేని మమకారం.గుంపుతో కాదు..ఒక్కదాన్నే వెళ్లి ఆ హిమరాజంతో ఊసులాడాలి.అక్కడ నిశ్శబ్దం వినాలి.త్వరలో సాకారం చేస్కోవాలి.అలాగే మానస సరోవరం కూడా చూసి రావాలి.అండమాను లో ప్రక్రుతి సౌందర్యం గురించి విన్నాను.షిప్పు లో వెళ్తే ఆ అందం ద్విగుణీకృతం అవుతుందట.కాబట్టి నా చిట్టాలో చేర్చేసాను.సముద్రగర్భం చూడాలని కూడా ఒక కోరిక.Into the deep.ఆ మంచు కొండైన ఈ సాగరగర్భమైనా యెంత ప్రశాంతంగా ఉంటాయో చుడాలిమరి.

నిండు పున్నమి వెన్నెల్లో,కాలికింద ఇసుకతెన్నెలు,అలా అలా పలకరించే అలలున్న సముద్రతీరం,మబ్బుల ముసుగు,పిల్లగాలి వీచే వేళ ఒక రేయి అంతా నిసితారలతో ముచ్చటించాలి అని కూడా కోరిక.నా మనసుకి నచ్చిన అలాంటి ప్రదేశం దొరకగానే ఆ కోరిక కూడా తీరుతుంది.ఆలోపు ఎత్తైన బాల్కానీలో నవ్వారు మంచం వేస్కుని,లైట్లు వేసాక సిటీ సొగసు,పౌర్ణమి నాటి చందమామ ముద్దుమోమును చుస్తూ,నచ్చిన పాత పాటలు వింటూ,హాట్ చాక్లెట్ తాగుతూ...
నవ్వకండి మరి! ఈ పని భారతదేశంలో మా స్వగ్రుహమునందు చేసితిమి.మరీ ఈ దేశం చలికి గడ్డ కడితే పట్టికెళ్ళి పొయ్యిమీద పెట్టేవాళ్ళు కూడా లేరు.అందుకే వేసవి వచ్చేదాకా ఆగుదాం అనుకుంటున్నాను.ఎప్పుడన్నా మీరు కూడా ప్రయత్నించండి.చాలా హాయిగా ఉంటుంది.

నేనూ ఏదేదో అనుకున్నా కానీ,మరీ పెద్ద చిట్టా ఎం లేదేంటి!ఇవాల్టికి  ఇవాళ ఆలోచించినా సంతృప్తిగానే ఉంది.అందుకే నా అసలు కోరిక,జీవితాంతం నిండుగా,తృప్తిగా,సంపూర్ణమైన సంతోషంతో బ్రతకటమే.

9, డిసెంబర్ 2009, బుధవారం

కలయా..నిజమా..మైమరపా

చుట్టూ అందమైన కొండలు,వాటిపై సిసిరానికి సిగ్గుపడి ఎర్రబడుతున్న చెట్లూ.చెట్ల పై ఆటలాడుతున్న ఉడుతలు,పాటలు పాడుతున్న పక్షులు.తనువులో ప్రతి అణువూ పులకించే చలి.మబ్బుల నీడలో వెచ్చని నీరెండ వేడిమి.మధ్యలో నిశ్చలమైన నీటి కొలను.ఆ నీలాకాశం తన ప్రతిబింబాన్ని చూసి మురిసిపోయే స్వచ్చమైన నీరు.అందులో ఒక ముచ్చట గొలిపే హంసల జంట.ఒకరిని వీడి ఒకరు ఉండలేనట్టు మెడలు పెనవేసుకుని.వాటిని చూసి ఈర్ష్యపడి అదోలా చూస్తున్న నీటి పక్షులు. గాలి వీచినప్పుడు ఆకుల సరిగమలు తప్ప నిశ్శబ్దం....

కల కాక మరేమిటి అంటారా?కాదు సుమా..నిజమే.

లేక్ ఒంటారియో(Lake Ontario)దాగ్గర ఒక పార్కుని అనుకోకుండా దర్శించే భాగ్యం కలిగింది మొన్న.నన్ను నేను మర్చిపోయి చాలా సార్లు ప్రక్రుతిలో లీనమయ్యాను కానీ,ఆ క్షణాన కలిగిన మైమరుపు..;ఒంటరితనం లో కూడా ఇంత హాయి ఉంటుందా!

ఇక్కడ చెట్లు ఆకులు రాల్చటం మొదలెట్టక ముందు రంగులు మారుస్తాయి.ప్రతి చెట్టూ ప్రక్రుతితో తనకున్న సంబందాన్ని నచ్చిన రంగుతో తెలుపుతుంది.పచ్చని వన్నె నచ్చి విప్పారిన ఆకులతో స్వాగతం చెప్పే చెట్లూ కొన్నైతే,కెంపులో పండుటాకులో అర్ధం కాకుండా ఆశ్చర్యపరచేవి కొన్ని.కొన్ని చెట్లూ మరీ మితిమీరి ఒక్కో ఆకునీ ఒక్కో రంగులోకి మార్చి,పురి విప్పి కదలని నెమళ్ళు అవుతాయి.ఆ చెట్ల అందాలని(fall colours)చూడాలే కానీ,వర్ణించ తరమా..ఋతువు మార్పులో ఇంతటి మధురిమ నేను ఎన్నడు చూడలేదు.

అలాంటి కాలంలో అనుకోకుండా ఆ నీటి కొలను దగ్గరికి వెళ్ళాం.వెచ్చని కోట్లు దాగ్గర లేక చలి చలి..కానీ ఆ కదలిక లేని నీటిని చూసి కదలలేకపోయాను.చెట్ల మద్యనుండి నడిచి వెళ్తే,నీటి మధ్యలో ఒక చెక్క బ్రిడ్జి(board walk).నా మనసుని ఆకర్షించిన అయస్కాంతం అదే....

రెండు హంసలు..పాల నురుగా,పత్తి పువ్వులా అన్నట్టు వాటి సుతిమెత్తని రెక్కలు.ఆ జంట కదలికకి పులకించి అంతటి నిస్చలమైన నీటిలో కూడా చిన్న అలజడి.మెడలు పెనవేసుకుంటూ,విడిపోయి ఓలలాడుతూ,అటూ ఇటూ తిరుగాడుతూ,వాటి లోకం లో అవి...ఏదో కలల లోకంలో నేను.చుట్టూ ఇంకెవరు లేనట్టు తెలియని ఒంటరితనం.కానీ ప్రక్రుతి లో నేనా..నేనే ఆ ప్రక్రుతా అని అర్ధంకాని సంశయ స్థితి.కాసేపు అసలు నేను ఉన్నానో లేనో,ఏదీ తెలియని లోకం.నిజంగా లీనమైపోయాను సమయంలో... ప్రకృతిలో...నాలో....

కెమెరా తీసుకెళ్లటం మర్చిపోయినా,ఆ దృశ్యాలని కాంచిన నా కన్నులదే కదా అదృష్టం.ఆ అనుభూతిని చేజిక్కిన్చుకున్న నా మనసుదే కదా తన్మయత్వం.ప్రక్రుతి అందం సాటిలేనిది.మళ్ళి అందాల లోకం లో నాకు నచ్చిన వర్నింపు తో వస్తా..అందాకా మీ చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించండి. :)

కుడి ఎడమైతే పొరపాటు లేదోయి..

కాదుకాదు...పాట గురించి ఇక్కడ చెప్పటం లేదూ.బుజ్జి ఎడమ చేతి వాటం గురించి ప్రస్తావన వచ్చింది నిన్న.ఆగష్టు పదమూడు (13th) ప్రపంచ ఎడమచేతి వాడుక ప్రజల దినోత్సవం అని వినీ,నన్ను ఈ లెఫ్ట్ హండర్ర్స్ వాళ్ళ జట్టులో కలుపుకుంటారో లేదో అనే అనుమానంతో పాటు,నా పాత జ్ఞాపకాలు పంచుకుందాం అనే ఆవేశంతో అర్ధరాత్రి సీరియస్గా టైపు కొట్టేస్తున్నను.

చిన్నప్పుడు,అంటే నేను పుట్టిన కొత్తల్లో,ఎడమ చేతి బోటని వేలు,ఇంకాస్త పెద్దయ్యాక ఎడమ కాలి బోటని వేలు నోట్లో వేసి జుబుకూ జుబుకూ చీకేస్తుంటే,అదేదో పసిపిల్ల చెష్ఠ అని మురిసి ముద్దు చేసారట మా వాళ్ళు.ఇంకొన్ని నెలలు గడిచి ఉయ్యాల్లో ఆడుకునేప్పుడు,దగ్గరకొచ్చి పలకరించే అందరి జుట్టు ఎడమ చేతితో గట్టిగా పీకేస్తుంటే,పసిది భలే చిలిపిది అనుకున్నారు కానీ,అక్కడ మన ఎడమ చేతి వాటం గుర్తించలేదు.

ఒకసారి ఆమ్మ వేరుసెనగ పచ్చడి రోట్లో రుబ్బి,ఒక గిన్నెకి సర్ది,రోలు కడుగుదాం అని అలా పక్కకి వెళ్ళే సరికి,అప్పుడప్పుడే బండాడటం నేర్చుకున్న నేను ఆ పచ్చడి గిన్నె దగ్గరికి చేరానాట.అమ్మ వెనక్కొచ్చి చూసేసరికి గిన్నె ఖాళీ.నా ఎడమ చేతి చిటికిన వేలుకి అంటుకున్న కాస్త పచ్చడి చూస్తే తప్ప క్రైమ్ సీన్ లో నా పాత్ర ఏంటో తెలియలా.సరే,పచ్చడి సంగతి పక్కన పెడితే నేను ఆరగించింది ఎడమచేత్తో అని అమ్మకి చూచాయిగా అర్ధం అయిందట.చేతిలో పప్పులు పెట్టమని అడగాలంటే ఎడమ చెయ్యి,అక్క మీద కోపం వస్తే,ఎడమ చేతిలో ఉన్న వస్తువులు విసిరేయ్యతమే.పుస్తకం లో వ్రాయమంటే ఎడమ చేత్తో కోడిగేలికినట్టు అక్షరాలూ.పెన్సిల్ చెక్కటం దగ్గరనుండి,బొట్టూ పెట్టుకోవటం,తల దువ్వటం,గరిట తిప్పటం దాకా,అన్ని ఎడమ చెయ్యే.

పాత సినిమాల్లో సూర్యకాంతం లాగా పుర్ర చేత్తో అడ్డం వచ్చిన వారిని చరుస్తూ,ప్రసాదం కోసం కూడా పుర్రచెయ్యేన్టిరా సన్నాసి అని తిట్లు తింటూ,ఆడుకుంటూ పాడుకుంటూ ఉండె నా చిన్నా జీవితానికి ఒక వెర్రి వెంగళప్ప ఉచిత సలహా వల్ల పెద్ద ట్విస్ట్ ఎ వచ్చింది.ఎడమ చెయ్యి ఎక్కువ వాడే పిల్లల మేధస్సు దెబ్బతింటుందని ఆయన చెప్పటం,ఆ మాట నమ్మిన మా జనం నన్ను బతిమాలి,బామాలి,ఎడమ నుండి కుడికి మర్పించాలని ప్రయత్నించటం జరిగిపోయాయి.

పుట్టుకతో వచ్చిన బుద్ధి కదా,మారాను అని భీష్మించుకుని కూర్చున్నాను.ఇరు వర్గాల వాదోపవాదాల అనంతరం,రాయటం,తినత వరకు కుడి చెయ్యి.మిగతా పనులు ఎడమ చెయ్యి అయినా పర్లేదు అనే సామరస్యమైన ఒప్పందం కుదిరింది.కుడి చేత్తో కూడా ఎడమచేత్తో రాసినంత అసహ్యంగా రాయగలను అని గమనించి,తప్పకుండా డాక్టర్ని అయిపోతా అని ముందే ఊహించారు లెండి.కుడి చేత్తో అన్నం కలుపుకోవటం రాక,అసలుకే తిండి తినటం మానేసా కొద్ది రోజులు.అందుకని అమ్మ వండిన అన్ని రకాలు కలిపి నా చిన్నా ప్లేట్ లో పేర్చి ఇస్తే,ప్లేట్ ని రౌండ్ గా తిప్పుకుంటూ,స్పూన్ తో గతికేదాన్ని.నచ్చని అన్నం,స్టాండ్ లాగా పేర్చి, దానిమీద ప్లేట్ పెట్టేస్తే,ఎవరు కనిపెట్టలేరు అని కూడా అనుకునేదాన్నిలే.

రెండు చేతులు సవ్యసాచి లాగా వాడేయ్యటానికి అలవాటుపడ్డ నాకు,ఫైనల్ ఇయర్ ప్రక్టికల్ పరీక్షల్లో అసలు కష్టం తెలిసొచ్చింది. మాములుగా పేషెంట్ ని కుడి చేతి వైపు నిలబడి పరీక్షిస్తారు.నేను నాకు వీలుగా ఉన్న వైపు నుండి ఒక పెద్దాయన కాలి కీలుని సుత్తి తో చితక్కోడుతుంటే,ఎగ్జామినర్ వచ్చి..ఎమమ్మాయి..ఏ చెయ్యి వాడుతున్నావ్ అని గుడ్లురిమారు.(అంటే knee joint ని knee hammer తో చితక్కోడ్తున్నా అని అర్ధం.)అదేదో ఘోరాపరాధం లాగా నా మార్కులు కోసేయ్యబోయి,అదృష్టం కొద్ది,ఎమ్ బంగారూ..లెఫ్ట్ హండర్ వా నువ్వు అని అడిగారు.మన ఘన జీవితచరిత్ర ఆయనకెందుకులే అని క్లుప్తంగా "యా"  అన్నాను.కానీ,ఆన్సర్ షీట్ లో మాత్రం బరబరా కుడిచేత్తో గీకేస్తుంటే,స్థంభం చాటున దాక్కుని చూస్తున్న ఆయనకి ఇక్కడేదో కుట్ర జరుగుతుందని అనుమానం వచ్చింది.

కాసేపు వైవా బదులు నా లెఫ్ట్ handedness మీద ఇంటరాగేషన్ సాగింది.నేను మళ్ళి విక్రమార్కుడికి భేతాలుడు చెప్పినట్టు నా కధ అంతా వివరించి,ఈ సారి క్లుప్తంగా కాకుండా,"I am a Right hander with preference to Left and Left hander with preference to Right.Rather,call me ambidexterous"అని అస్సలు అర్ధ కాకుండా చెప్తే కానీ ఆయనకి అర్ధ కాల.ఆయన నమ్మటం,పాస్ అయ్యే అన్ని మార్కులు వేసి నన్ను కాలేజీ నుండి సక్సెస్ఫుల్ గా తన్నేయ్యటం జరిగాయి. తేడా జరిగుంటే ఈ పాటికి నా హాస్యకదా చిత్రం మంచి ట్రాజెడీ సినిమా అయ్యేది.

చిన్నా పిల్లలు చేతకాకుండా ఎడమ చేత్తిలో స్పూన్ పట్టుకుని తినటానికి తంటాలు పడుతుంటే,నాకు భలే నవ్వొస్తుంది.వేళ్ళల్లో ఎందరు నాతో పాటు కుడి ఎడమైతే పొరపాటు లెదొఇ అని పాడుకుంటారో అని.ఇంతకి మీరు ఏ పాట పాడుతున్నారు? :)

8, డిసెంబర్ 2009, మంగళవారం

చిన్ననాటి కబుర్లు

ఇవాళ పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటే,కోడి గుడ్డు ఖరీదు యెంత అనే ప్రశ్న తలెత్తింది.అలా అలా మాటల ప్రవాహం లో కొట్టుకుపోయి,నా చిన్నప్పుడు ఐతే కొన్ని పైసలకే వచ్చేది గుడ్డు,ఆ కాలమే వేరు అని డైలాగు కొట్టాను కానీ,నా కళ్ళ ముందు పాత సినిమా ఫ్లాష్ బ్యాక్ లాగా కొన్ని చక్రాలు తిరిగాయి.

చిన్నప్పుడు మా ఇంట్లో ఒక బ్లూ కలర్ ఎగ్ కేసు ఉండేది.అంటే ఆ ప్లాస్టిక్ డబ్బాకి ఇంకేమన్నా పేరు ఉన్దేమో కానీ,నేను దాన్ని ఎగ్గుపెట్టే అనే పిలిచేదాన్ని.గుడ్డు ఆకారంలో ఆరు ఖాళీలు ఉంటాయ్ దానికి.షాప్ కి వెళ్లి గుడ్లు తెచ్చే ప్రతిసారి నాకు దాని హన్డెల్ పట్టుకుని గట్టిగా ఊపుకుంటూ ఇంటికి రావాలని బలమైన కోరిక ఉండేది.చిన్నపిల్లనని నా చేతికి అస్సలు ఇచ్చేవారు కాదు ఆ పెట్టెని.నేను మరీ ఏడ్చి గీపెడితే,ఆరు నూరైనా సరే,నేను దాన్ని గాల్లో ఝండా లాగా ఊపను అని సవాలక్ష ప్రోమిస్లు తీస్కుని, ఒక్కసారి అపురూపంగా నా చిట్టి చేతుల్లో పెట్టేవారు.ఇప్పటికి నాకు తీరని కోరికగా మిగిలిపోయిన విషయాల్లో ఇది ఫస్ట్ ఆన్ ది లిస్టు.

ఇహ రోజూ సాయంత్రం పాల ప్రహసనం.అమ్మ మాకు హార్లిక్స్ కలిపిన పాలు ఇచ్చేది.నాకు హార్లిక్స్ తినటం మాత్రమె ఇష్టం. అందుకని ఒక కటోరి నిండా హార్లిక్స్ వేస్కుని తినేసి,వుట్టి పాలు ఒక స్టీల్ గ్లాస్ లో పోయించుకుని బయట తిరుగుతూ ఉండేదాన్ని.యెవరూ చూడకుండా నేను ఒక గుక్క తాగి,ఒక గుక్క మా సన్నజాజి మొక్కకి ఇచ్చేదాన్ని.మొత్తం ఒకేసారి ఒలకబోస్తే చెట్టు మొదట్లో పాలు కనిపిస్తాయి కదా,అదీ మన తెలివి.ఇహ చూస్కోండి..పాల వల్ల నాకు బలమేమో కానీ,మా సన్నజాజి మొక్క మాత్రం బాగా ఏపుగా పెరగటం మొదలెట్టింది.బోలెడు పువ్వులు కూడా.దాని పక్కన ఉన్న మొక్కలు ఈసురోమని వేలాడుతూవుంటే,ఇది మాత్రం నవనవలాడుతూ భలే ఉండేది.కానీ ఎక్కువ రోజులు ఈ అగ్రీమెంట్ సాగలేదు.
ఏదో చిలిపి పని చేసా అని నాకు కటోరి హార్లిక్స్ అల్లోవన్సు కట్ చేసి,పాలల్లో ఒక రెండు స్పూన్లు కలిపి ఇవ్వటం మొదలెట్టింది అమ్మ.అదే చెట్టుకి నేను పాలాభిషేకం చేస్తుంటే,మంచి ఫుడ్ సోర్సు దొరికిందని చీమలు పుట్టలు పెట్టటం మొదలెట్టాయి.మన కధ బయట పడిపోయింది.నాకు దెబ్బలు పడ్డ చాలా కొన్ని సందర్భాలలో ఇది ఒకటి.

దెబ్బల సంగతి ఎలాగో చెప్తున్నా కాబట్టి,ఆ మిగతా సందర్భాలు కూడా చెప్పేస్తే పోయే.ఒక సారి కొత్త బోంబే డయ్యింగ్ బెడ్ షీట్ మా మంచం మీద వేసింది అమ్మ.అది తెల్లగా మల్లెపువ్వు లాగా,తళతళా మెరిసిపోతుంది.ఎం పూనిందో ఏమో,మా అక్కా నేను వాడేసిన బ్లేడు ముక్క చెరో సగం అందుకుని,దాన్ని అడ్డంగా నిలువుగా కోసి పారేసాం.ఆ పని ఎందుకు చేసామో ఇప్పటికీ మాతో సహా ఎవరికీ అంతుపట్టని చిక్కు ప్రశ్న.కానీ చేసిన పని ఒప్పుకుని ఇద్దరం చెరి రెండు దెబ్బలు తినేశాం.

ఇంకో సందర్భ ఏంటంటే,మా ఊరికి వెళ్ళినప్పుడు ఒకసారి నన్ను "తెల్లసుబ్బి"అని అందరు ఏడిపించారు.అందరూ అంటే బాధ లేదూ కానీ,మా అక్కకుడా వంత పాడేసరికి బాగా కోపం వచ్చేసింది.పట్టుకుని కొడదాం అంటే నాకు చిక్కకుండా పరిగేడ్తుంది.
ఇంక ఉక్రోషం ఆపుకోలేక నా ఎడమ కాలి హవాయి స్లిప్పేర్ తీసి విసిరేసా.అసలే నా స్లిప్పేర్ సైజు చిన్నది.పైగా నా టైమింగ్ ఏంటో కానీ,అది టార్గెట్ మిస్ అయ్యి,ఎదురుగ్గా మజ్జిగన్నం తింటున్న మా కజిన్ ప్లేట్లో కరెక్ట్ గా ఫిక్స్ అయ్యింది.యేమి జరిగిందో తెలుసుకునే లోపు ఈ సీన్ మొత్తం అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవుతున్న నాన్నారు చూసేసారు.నేను జరిగిన విషయ కంటే జరగబోయే పరిణామం ఊహించుకుని బిక్కచచ్చిపోయి నిల్చున్న.ఇంక చెప్పేదేముంది...కాకపొతే నా ఆవేశానికి కూడా కారణం ఉందని సహృదయ తో అర్ధ చేస్కుని,నాకు రెండు తగిలించి,మా అక్కకి కూడా ఒక రెండు తగిలించారు.లెక్ఖ సరిపోయింది. :)

ఇహ ఒకసారి మా ఇంటికి బీరకాయ పీసు చుట్టాలు వచ్చారు.వాళ్ళు మాకు ఏమవుతారో నాకు తెలియదు.అసలే ఆదివారం.నేను నా ఆటల్లో మునిగిపోయి ఉంటె,ఈ చుట్టాలకి టిఫిన్ వడ్డించాలి అని నన్ను పిలిచారు.అమ్మ వేడిగా పూరీలు వేస్తూ,వాళ్లకి పెట్టిరమ్మని పంపింది.రెండు సార్లు టేబుల్ చుట్టూ తిరిగి,ఇంకొన్ని తినండి అంకుల్ అని నేను అనటం,వాళ్ళు తెగ మోహమాట పడుతూనే,నేను అన్నా తత్క్షణమే,ఇంకో నాలుగు పూరీలు తినటం.ఏమో..చిరాకు అనిపించిందో ఏమో మరి,మూడో సారి టేబుల్ దగ్గరికి వెళ్లి...ఇదిగోండి,ఆ తినేదేదో మొహమాట పడకుండా తినేసేయ్యండి.మాటిమాటికీ వచ్చి మిమ్మల్ని బ్రతిమాల్లెను బాబూ అనేసా!పాపం తెరిసిన నోరు అలాగే ఉంచి నా వైపు చూసి,ఇంకో రెండు పూరీలతో క్లుప్తంగా ముగించేసారు.ఆ తర్వాత ఇంకెప్పుడు వాళ్ళని చుసిన గుర్తు లేదూ మరి.

అమ్మ నా మోహానికి దోసగింజ ఆకారంలో బొట్టు పెట్టి,ఇంత పెద్ద బొట్టు ఎందుకు పెట్టావమ్మా అని అడిగితె,అప్పుడు మోహం పద్మం లాగా ఉంటుందిరా నాన్నా అనేది.అందుకని అమ్మని మాటిమాటికి పద్మం బొట్టు పెట్టావా అని గోల చేసి,సొంతంగా పెట్టుకోవటం ప్రాక్టీసు చేసేదాన్ని.మా ఇంట్లో ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది.నేను పుట్టినప్పుడు కొన్నరేమో మరి,అదంటే నాకు ఎక్కడ లేని ఫాసినేషను.ఎక్కడ ఏ పని చేస్తున్నా ప్రతి గంటకీ నేను ఆ అద్దం ముందు ప్రత్యక్షం అయ్యి,దువ్విన తలే మళ్ళి దువ్వి, రకరకాల అంకాళమ్మ బొట్లు పెట్టి,వాటిని తుడిచేసి ఈ అద్దం రెండువైపులకి పుసేసేదాన్ని.ఇప్పటికీ ఆ బొట్టూ కాటుక అవశేషాలు ఆ అద్దానికి అలంకారాలుగా మిగిలి కనిపిస్తుంటాయి.

అద్దానికి ఈ రకంగా అతుక్కుపోతున్నాను,భయంకరంగా పౌడర్ రాసేసుకుంటున్నాను అని,నాకు తెల్లసుబ్బి అని నామకరణం చేసారు.నాకు అది సరిగ్గా పలకటం రాక,నేనేం తెల్లజుబ్బి కాదు,నువ్వే నల్ల జుబ్బి,దొంగమున్న అని తిట్టిపోసేదాన్ని.అసలు ఎక్కడ ఉంటె అక్కడి మాండలికాల్లో మాట్లాడేస్తున్నాను అని,విశేషంగా కొత్త పదాలు ప్రయోగిస్తున్నాను(బూతులు)అని,రెండో తరగతి లో ఆంగ్లం మాత్రమే మాట్లాడే మంచి స్కూల్లో పడేసారు నన్ను.అయినా పెద్దగా మారినట్టు లేను నేను :)

స్కూల్ నుండి ఇంటికోచ్చేప్పుడు,పాపం మా అక్క నా టిఫిన్ బుట్ట,తన టిఫిన్ బ్యాగు,తన స్కూల్ బ్యాగు,నా స్కూల్ బ్యాగు,ఇంకా తన వాటర్ బాటిల్ మోసుకొచ్చేది.నేను నా ఒక్క వాటర్ బాటిల్ ఊపుకుంటూ,పాటలు పాడుకుంటూ తెచ్చుకునేదాన్ని.నా దృష్టిలో చేతిలో ఒక పుస్తకం ఉంటె వాళ్ళు స్టైల్ గా ఉండె కాలేజీ పిల్లలు.ఏదో దిక్కుమాలిన సినిమా లో చూసాను మరి. అందుకే సామాను మొత్తం అక్క చేత మోయించి,నేను తన టెక్స్ట్ బుక్ ఏదన్నా అలా అలవోకగా పట్టుకునేదాన్ని.పెద్ద క్లాసు టెక్స్ట్ బుక్ ఐతే నేను పెద్ద క్లాసు లో చదువుతున్నాను అనుకుంటారని వెర్రి ఆశ.చిన్నవయసులో మనకి పెద్దరిక ఆపాదిస్తే బాగుండు అని అందరికి అనిపిస్తుంది ఏమో మరి.ఇంతకి అప్పుడు నేను రెండో తరగతి,మా వాడు మూడు.:))

మా ఇద్దరికీ ఒక్క క్లాసు మాత్రమె తేడా కాబట్టి లాజికల్ గా తన పుస్తకాలు నాకు వారసత్వం గా వచ్చేవి.అసలే నా చేతికి వచ్చేప్పటికి అవి సిదిలావస్త లో ఉండేవి.మనకేమో అసలే ఎక్కాలు,లేక్ఖలు రావు.అందుకని మిగతా టెక్స్ట్ బుక్స్ అన్ని బాగా అతికించుకుని,ఒక్క లేక్ఖల పుస్తకంలో మాత్రం నాకు రాని లెక్కలు ఉన్న పేజిలు చింపేసేదాన్ని.ఆ చాప్టర్ లో హోంవర్క ఇచ్చినా,నన్ను చదవమన్నా,దానికి పేజిలు లేవు,అక్క చిమ్పెసింది అని చెప్పి తప్పించుకోవాలని చూసేదాన్ని.పాపం మా వాడు నన్ను యేమి అనేవాడు కాదు..కానీ నాకు ఒక్క లెక్కల కి మాత్రం కొత్త పుస్తకం కొనివ్వటం మొదలెట్టారు మా వాళ్ళు.

ఒకసారి ఆ ఇంట్లో బాగా బంతి పువ్వులు పూసాయి.చాలా బాగున్నాయ్.పువ్వులు వేస్ట్ అయిపోతున్నాయ్ అని వాటిని కోసుకొచ్చి,వాటితో నాకూ,అక్కకి పూలజడ వెయ్యమని ఒకటే గోల.మరీ బంతిపువ్వులతో పూలజడ ఏంట్రా అన్నాసరే వినకుండా, పట్టుపట్టి వేయించుకున్నా.పైగా ఆ జడకి కింద వెండి జడగంటలు.మా కాలనీలో ఉండె కొందరికి చూపిద్దాం అని రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే చూడాలి ఆ సొగసూ..నిజంగా మా పూలజడ చాలా బాగుంది అని మనసులో గట్టి నమ్మకం మరి!వాళ్ళు అప్పుడు మొదలెట్టిన నవ్వు ఇప్పటికీ ఆపలేదు.నన్ను చూసినా,నా పేరు తలుచుకున్న వారందరూ పగలబడి నవ్వాల్సిందే.

ఇలాంటి కధలు నన్ను కదిలిస్తే నిర్విరామంగా శతసహస్రాలు బయటపడతాయి.కానీ ఇంకెప్పుడన్నా తీరికగా మళ్ళి చెప్తాలే.టాటా టిల్ తేన.

బుజ్జి తంటాలు

అవును మరి,బుజ్జి అనే పేరు పెట్టుకుని ఈ ప్రపంచం లో నెగ్గుకురావటం యెంత కష్టమో మీకేం తెలుసు.ఆ..తెలిసే  ఉంటుంది లెండి.మన ఆంద్ర రాష్ట్రం లో నూటికి డెబ్భై మంది ముద్దు పేరు బుజ్జే గా మరి.ఇది చదువుతున్న మీలో ఎందరు బుజ్జి నామ భాదితులో కదా(బా కి వొత్తు భా).ఇంక మిగిలిన వారికి బుల్లి,చిట్టి,లలలి,బల్లి అని ఏ పేరు పెట్టినా,బుజ్జి ప్రత్యేకత బుజ్జిదే

నిజం.ఎక్కడైనా సెంటర్ లో కుర్చుని బుజ్జీ అని గతిగా పిలిచి చుడండి.వెనువెంటనే మీ పక్కనుండి ఓ..య్ అని కేక వినిపిస్తుంది. అసలు బుజ్జి అని పిలిపించుకోవటానికి ఆకారం తో పనేముంది.మనం మొహం చూసి వీడు హిట్లేర్ బామ్మర్దేమో అని అపోహ పడె వాడి దగ్గరనుండి,ఆజానుబాహువు,బుర్ర మీసాలు,గళ్ళ చొక్కా,పులిపిరి కాయ తో సహా అన్ని హంగులు ఉన్న వస్తాదు దాక ఎవరైనా "బుజ్జీ"" అయుండొచ్చు.అప్పుడే పుట్టిన పసి పాప ని చూసి బుజ్జిది భలే ఉందే అంటారు..పక్కనే ఉన్న చెట్టంత నన్ను చూసి కూడా ఎం బుజ్జి బాగున్నావా అంటారు.అసలు బుజ్జి అమ్మమ్మ,బుజ్జి పిన్ని,బుజ్జి మామయ్యా,బుజ్జి బాబాయి..ఇలా ప్రతి ఇంట్లో ఒకటి రెండు బుజ్జులు ఉంటాయ్ అంటే అతిశయోక్తి కాదేమో.

ఇంతకి ఇవాళ ఈ బుజ్జి గోల ఏంటి అనేనా సందేహం?అప్పుడప్పుడు పాత జ్ఞాపకాలు ఇలా తన్నుకొచ్చి బ్లాగెక్కి అరుస్తాయి... అందుకని.

మొన్నీమధ్య ఒక పెళ్ళికి వెళ్ళనా.అక్కడ మా దూరపు బంధువు ఒకావిడ ఒక అరకిలోమీటర్ దూరం లో కుర్చుని కనిపించింది.లేచి దగ్గరకి వెళ్ళటం బద్ధకం వేసి,మరీ పలకరించకపోతే బాగోదేమో అని,అలా అలవోకగా తల తిప్పి సైగ చేసి,ఒక చిరునవ్వు కానుకగా పడేసా.అది యెంత పెద్ద తప్పో వెనువెంటనే సమాధానం లో వచ్చిన "బుజ్జి.....జీ" అనే కేక తో నాకు అర్ధం అయిపొయింది.ఆ పిలుపుకి నా ఆకారానికి సరిపోవటం లేదని నేను మొత్తుకున్నా వినరు కదా.చుట్టూ ఉన్న జనం కళ్ళు గప్పి ఆ బుజ్జి నేను కాదని తప్పించుకునే ప్రయత్నం చేసాను.గాలి తో సంభాషిస్తూ ఎటో చూసాను.

ఆవిడ పట్టు వదలకుండా మా మధ్య ఉన్న జన వారధికి పని అప్పచెప్పింది.తన పక్కన ఉన్నవారికి మా బుజ్జిని పిలవండి అని గుసగుస,వాళ్ళు తమ పక్కనున్న వారితో అదే గుసగుస.నా పక్కన పది నెలల బుజ్జి వాళ్ళ అమ్మ వడిలో ఆడుకుంటుంటే, ఈవిడగారి పిలుపు విని ఎవరో ఆ పిలుపు ఆ పసిదానికోసం అనుకున్నారు కాబోలు,ఏకంగా నా భుజం తట్టి,ఏవండి ఆ బుజ్జి పాప ని అక్కడ ఉన్నావిడ పిలుస్తుందని చెప్పండి అన్నారు.నేను వినపడనట్టు ఇంకేటో చూస్తున్నా పదేపదే అదే మాట.ఇంక ఎక్కువ సేపు తప్పించుకోవటం కుదరదు అని తెలిసిపోయాక ఆ బుజ్జిని నేనే అని ప్రకటించుకుని ఆవిడ ప్రేమావేశం తట్టుకొవటానికి దగ్గరికి వెళ్ళక తప్పలేదు.

ఈ ఒక్క సందర్భమే కాదు.మా చుట్టాల్లో చాలా మందికి నా పేరు బుజ్జి మాత్రమె.ఇంటర్మీడియేట్ కి హాస్టల్ లో ఉన్నప్పుడు మనకి ఒక చిన్నా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.కాకపొతే మా చుట్టాలు ఎవరికన్నా చెప్పేటప్పుడు మా బుజ్జి మీకూ తెలుసా అని అడగటం.అసలు గంభీరంగా ఉందే ఈ శ్యాల్తి పేరు బుజ్జి అని జనానికి తెలిస్తే..హవ్వా..యెంత అప్రతిష్ట!!

చాలా సార్లు అమ్మ ని వేదిస్తుంటాను.నాకు బుజ్జి అని పేరు యేల పెట్టవలె?పెట్టితివి పో,అదే పేరు తో నన్ను యేల పిలువవలె?పిలిచితివి పో,బంధువర్గ మధ్యమున నన్ను యేల గేలి సేయవలె.యేల బుజ్జి బజ్జి అని పిలువవలె?ఈ పిలుపు విని సమాజము ఊరకుండునా,నవ్వక మిన్నకుండున.ఈ అవమానభారమును భరించి ఊరకుండుటయా?మనుటయా,మార్చుటయా.ఇప్పుడేది
కర్తవ్యము..యెదీ కర్తవ్యము!!!

ఇంకా చదివే ఓపిక ఉంటె మరి కాస్త కధ కూడా ఉంది.చిన్నప్పుడు దూరదర్శన్ లో ఏదో హిందీ సీరియల్ వచ్చేది.అందులో ఒక బుడ్డోడి పేరు చిటుకు.ఈ బుజ్జి కంటే అదేదో బాగుందని ఒక రోజూ పొద్దున్నే ఇహ నుండి నన్ను చిటుకు అని పిలవండి అని శాసనం చేసేసా.పాపం మా వాళ్ళు కూడా ఒక రోజంతా అలాగే పిలిచారు కూడా.నేను కూడా కొత్త పలకరింతకీ పులకరించిపోయా.రెండు ఎపిసోడ్లు అవ్వగానే ఆ చిటుకు కారక్టర్ ఠా!సెంటిమెంటల్ గా ఆ పేరు నచ్చక మా వాళ్ళు ఆ పిలుపు మానుకున్నారు.డామిట్..కధ అడ్డం తిరిగింది.తిరిగి తిరిగి మళ్ళి మొదటికే వచ్చింది.

ఆ తరువాత చిన్నోడా,బుజ్జమ్మ,చిత్తూ ఇత్యాది కూడా నా ప్రమేయం లేకుండా ప్రయోగించారు మా ఇంట్లో.మంచి పేరు వెతుక్కునే విఫల ప్రయత్నం నేను కూడా చేసాను కానీ,చివరకి నాకు అర్ధం అయ్యింది ఏంటంటే ,బుజ్జి అనే పేరు నాకు బంక లాగా బాగా అతికింది.ఇహ ఈ సార్ధక నామధేయముతో నే మనవలె.వేరే ఆప్షన్ లేదూ భాయి:)

P.S. ఏదో ఇంట్లో వాళ్ళని ఉడికించటానికి నాకు బుజ్జి అనే పేరు ఇష్టం లేదని చెప్తుంటా కానీ,ఇంక వేరే ఏ పేరు తో పిలిచినా నన్ను పిలిచినట్టు అనిపించదు.బుజ్జి అంటే బుజ్జే మరి.:)

7, డిసెంబర్ 2009, సోమవారం

మంచు కురిసే వేళలో

నిజంగా ఈ మాటకి అర్ధం ఇవాళే తెలిసింది.నా మొదటి మంచు రోజూ:)
అదే..ఇవాళ మొదటిసారి భారి ఎత్తున మంచు కురవటం చూసాను.నా దేశం నుండి,నా వాళ్ళ నుండి, ఇంతదూరంగా ఉన్న సరే,ఇవాళ ప్రక్రుతి తో చెలిమి చేసి చాలా సంతోషంగా ఉనాను.ఏదో  ఊహించని మలుపుతిరిగి జీవితం అంతా తేటతెల్లం అయిపోయిందని కాదు ఈ సంతోషం.ఇంకా అవే సమాధానం లేని ప్రశ్నలు, అవే సమస్యలు,అవే నిరాశలు,నిట్టూర్పులు, మెల్లిగా మొలకెత్తుతున్న ఆశలు,ఆశయాలు,తప్పక తీరుతాయ్ అనే కోరికలు,అన్నీ అలాగే ఉనాయి.అసలు ఎవడన్నాడు సంతోషంగా ఉండటానికి కారణం కావాలని:)

మంచు పడ్తుంటే వెళ్లి కాసిని ఫ్రెంచ్ ఫ్రాయీస్ తిన్నాను.అగ్నికి ఆజ్యం లాగా నా సంతోషానికి ఇంకా బలం కోసం యాలుకలు దంచేసి పానకం లాగా టీ పెట్టుకుని తాగేశాను.దిల్ ఖుష్!:))
వర్షానికి మంచుకి కాస్త తేడా గమనించాను ఇవాళ.వర్షం పడ్తుంటే చూసారా..ముందు రాజుగారి రాకని సూచిస్తూ నల్లటి పెద్ద పెద్ద మేఘాలు.ధడేల్ మని ఉరుములు.ఆ తర్వాత వెయ్యి వాట్ల బుల్బు వేసినట్టు మెరుపులు.అప్పుడు చిన్నగా మొదలవుతుంది తొలకరి.పెరిగి పెరిగి పెద్ద వాన.మనసులో మకిలి కూడా కొట్టుకుపోయే వాన.స్వచ్చంగా ఉంటుంది వాన వెలిసాక.చెట్లన్నీ పండగకి తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకున్న పిల్లకాయల్లా సంతోషంగా ఉంటాయి..కదా.వర్షం పడేప్పుడు ఆ నెల నుండి వచ్చే సువాసన,అదో కొత్త లోకమే.నిజంగా ఒక్కోసారి వర్షం వెలిసాక గిఫ్ట్ వ్రాప్ తీసిన ప్రజంట్ లాగా అనిపిస్తుంది నాకు లోకమంతా.

ఇంక మంచు పడేప్పుడు ఈ డోలు బాజాలు ఎం లేవు.మెల్లిగా మొదలవుతుంది.తెల్లగా,దూదిపింజలాగా,నిశ్సబ్దంగా.తన రాక మనకి తెలిసేది తలెత్తి చూస్తే మాత్రమె.లేకపోతె అందరిని,అంతటిని తెల్లటి దుప్పటితో కప్పేస్తుంది.మంచు పడుతున్నప్పుడు  చూడటానికి చాలా అందంగా ఉంటుంది.మనసు కూడా ఆ దూదిపింజలతో ఎటో తెలిపోతుంటుంది.తన దారిలో ఉన్న అన్నిటిమీదా తెల్లటి మేలిముసుగు చూడముచ్చటగా ఉంటుంది కూడా.అన్ని చెట్లూ కొత్తగా విరగాపూసిన పత్తి చెట్ల లాగా ఉంటాయి.

చలికాలానికి భయపడి కొన్ని చెట్లూ ముందుగానే ఆకులు రాల్చేస్తాయ్ కదా,కొన్ని చెట్లూ ఎదురు తిరిగి ఇంకా ఆకులు కప్పుకుని ఉన్నాయ్ అని వాటి పని పట్టటానికి వస్తదేమో మంచు.మెల్లిగా వచ్చినా పచ్చటి చెట్లని కూడా తెల్లటి మంచు తో కప్పేస్తుంది. మర్నాటి పొద్దునే పాపం అ చెట్లని చూడాలి.మంచు కరిగాక నల్లగా మాడిపోయి ఉంటాయి.ఇంతందం తనలో దాచుకున్న మంచు ఇంక వికారంగా దేన్నైనా ఎలా మర్చగలదా అనిపిస్తుంది నాకు.అబ్బా..ఏంటో ఇలా రాసుకుంటూ పోతుంటే నాకు నిజంగా మంచు అంటే ఇష్టమో కాదో అని నాకే అనుమానం వస్తుంది.ప్రస్తుతానికి మంచు మానసిక విశ్లేషణ కంటే దాన్ని ఆస్వాదించటం మంచిదేమో.చిన్నప్పటి నుండి కొన్ని కోరికలు ఉన్నాయి నాకు.వాటిల్లో ఒకటి హిమాలయపు అంచులకి వెళ్లి మంచుని చూడాలని.ఇన్నాళ్ళకి మంచుని చూసాను,నేను కోరుకున్న ప్రదేశం లో కాకపూయిన సరే.ఇంకా బుజ్జి కోరికలు ఏంటో తెలుసుకోవాలి అని కుతుహలమా.చెప్తా,చెప్తా.కానీ ఇప్పుడు కాదు.

ఈ పాటికి జనం పాపం మంచుని తెగ తిట్టుకుంటున్నారు.బయటికి వెళ్ళటానికి లేదూ,రేపు రోడ్లన్నీ బురదమయం గా ఉంటాయి అని,ఇంకా చాలా తిట్టుకుంటున్నారు లే.కానీ నాకు సంతోషంగానే ఉంది.ప్రక్రుతి ఏ బట్ట కట్టినా అందమే.ఇన్నాళ్ళు ఆకుపచ్చ చీరలో పెల్లికుతురి లా చూడటం అలవాటైన నాకు ఇవాళ తెల్ల పట్టుపంచె కట్టుకున్న పెళ్ళికొడుకు లా కనిపిస్తుంది/తున్నాడు? :P

మళ్ళి చల్ల చల్లని కబుర్లతో వస్తాలే..టాటా