10, డిసెంబర్ 2020, గురువారం

భాషా బాధలు బాలముడతలు

 ఈ మధ్య మనం పరభాష లో కాస్త ప్రావీణ్యం సంపాయించాం లే. అలా అని నాకు నేనె ఒక బిరుదు కూడా తగిలించేస్కున్నాను.. స్పానిషారాధ అని! 

క్లినిక్ కి మొన్న ఒక పెద్దాయన వచ్చాడు, కళ్ళ కింద క్యారి బ్యాగ్ లతో అచ్చు మన M.S.నారాయణ లా ఉన్నాడు. మనిషిని ఎలా ఉన్నావ్ అని పలకరించక ముందే మనం అడిగే ప్రశ్న.. నీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని. నాకేమో రెండు ముక్కలు స్పానిష్ వచ్చు.. ఆయనకి కరెక్ట్ గా రెండే రెండు ముక్కలు ఇంగ్లీష్ వచ్చు.. పైగా నాకంటే మోహమాటస్తుడు.

ఎందుకొచ్చావ్ అని అడిగాను. కళ్ళ కింద బాగ్ లు చూపించాడు. సైగ భాష అర్ధం కాలేదు..నోటితో చెప్పమని సైగ చేశా. ఆయనకి ఎం అర్ధం అయ్యిందో కానీ, మళ్ళీ కళ్ళ కింద ఉబ్బులు చూపించి, ఎదో అప్పచెప్పినట్టు తన భాష లో చెప్పాడు. కళ్ళు చీకిరించి, చెవులు రెట్టించి విన్నా సరే, మనకి భాష నిజంగా వస్తే కదా ఆయన ఏం చెప్పాడో అర్ధం అయ్యేది!

ఎదో, వయసైపోతుంది..ఈ కళ్ళ కింద ఉబ్బులు అసహ్యంగా ఉన్నాయ్ అని ఆయన అన్నట్టు లిప్ రీడింగ్ చేశా. ఎక్కడో ఈ వయసు పెద్దాయన డబ్బులు కట్టి మరీ ఈ అయిస్ వాపు కోసం వచ్చి ఉంటాడా అనే అనుమానం తో బుర్ర గోక్కున్నా, ఇలాంటి చిన్న చితకా విషయాలు మనం ఇట్టే తేల్చేయ్యచ్చు అని.. ఇంకొక్కసారి " నిజంగానే  ఈ కళ్ళ కింద వాపులకే వచ్చవా" అని నేను ఇంగ్లీష్ లో అడిగాను. ఆయన అవును అని స్పానిష్ లో చెప్పాడు. 

ఇహ నేను మొదలుపెట్టాను.. చూడు పెద్దాయన, నీకున్న శతకోటి రోగాల్లో ఇది లీస్ట్ ఆఫ్ దా ప్రాబ్లంసూ. మనిషికి యవ్వనం లో ఉన్న కళ వయసైపోయాక రమ్మంటే ఎలా వస్తది చెప్పు? అర్ధం చేసుకో.. పొద్దున లేవగానే కాస్త వాకింగ్ చెయ్యి, ఎక్కువ ఉప్పు తినకు, నీకు మొన్న నేను రాసిచ్చిన నూట పదహారు బిళ్ళలు రోజు వేస్కో, అని నోటికొచ్చిన సలహాలు పేలి, ఇంక వెళ్ళిరా..విజయోస్తు అని చిట్టి రాసిచ్చి బయటికి పంపబోతుంటే, మా పెద్దావిడ వచ్చింది.(క్లినిక్ లో సూపర్ వైజ్ చేసే పెద్ద డాక్టర్ లే, ఆవిడ ప్యూర్ స్పానిష్ మాట్లాడుతుంది). 

ఒకసారి పెద్దాయన వైపు, ఒకసారి నా వైపు చూసి, పాపం రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు ఇచ్చిన పప్పులు, అప్పచ్చెలు తిన్నాడట, కళ్ళ కింద ఇలా వాచిపోయిందట. నాలిక కూడా కాస్త తిమ్మిరిగా ఉందట. బెనడ్రిల్ ఇచ్ఛవా అని అడిగింది! 

అంటే, అది..మరి..నేను..ఇప్పుడే అదే అనుకుంటున్నాను అని నేను నాలిక కరుచుకున్నాను. మామూలుగా ఇద్దరం ఒకే భాష మాట్లాడితే మన వైద్యం ఇంత భయంకరంగా ఉండదు. పాపం పెద్దాయణకి ఈ వయసులో బాలముడతాలు వచ్చాయి అని నేను వేసుకున్న కుళ్లు జోకులకి నేనె రెండు మొట్టికాయలు వేసుకుని.. ఆయనకి మందులు రాసి ఇచ్చా. వెళ్లే ముందు నాకే మనసు ఒప్పుకోక, ట్రాన్సిలేటర్ కి ఫోన్ చేసి, ఇంకేమైనా డౌట్ లు ఉన్నాయా అని అడిగాను. ఏమి లేవు..నువ్వు మంచి డాక్టర్ వి ఆన్నాడు. ఇహిహీ, నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పి, టాటా చెప్ప.

అందుకే అప్పటినుండి సొంత భాషా ప్రావీణ్యత వాడకుండా, ట్రాన్సిలేటర్ ఫెసిలిటీ వాడుతున్న.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి