10, డిసెంబర్ 2020, గురువారం

భాషా బాధలు బాలముడతలు

 ఈ మధ్య మనం పరభాష లో కాస్త ప్రావీణ్యం సంపాయించాం లే. అలా అని నాకు నేనె ఒక బిరుదు కూడా తగిలించేస్కున్నాను.. స్పానిషారాధ అని! 

క్లినిక్ కి మొన్న ఒక పెద్దాయన వచ్చాడు, కళ్ళ కింద క్యారి బ్యాగ్ లతో అచ్చు మన M.S.నారాయణ లా ఉన్నాడు. మనిషిని ఎలా ఉన్నావ్ అని పలకరించక ముందే మనం అడిగే ప్రశ్న.. నీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని. నాకేమో రెండు ముక్కలు స్పానిష్ వచ్చు.. ఆయనకి కరెక్ట్ గా రెండే రెండు ముక్కలు ఇంగ్లీష్ వచ్చు.. పైగా నాకంటే మోహమాటస్తుడు.

ఎందుకొచ్చావ్ అని అడిగాను. కళ్ళ కింద బాగ్ లు చూపించాడు. సైగ భాష అర్ధం కాలేదు..నోటితో చెప్పమని సైగ చేశా. ఆయనకి ఎం అర్ధం అయ్యిందో కానీ, మళ్ళీ కళ్ళ కింద ఉబ్బులు చూపించి, ఎదో అప్పచెప్పినట్టు తన భాష లో చెప్పాడు. కళ్ళు చీకిరించి, చెవులు రెట్టించి విన్నా సరే, మనకి భాష నిజంగా వస్తే కదా ఆయన ఏం చెప్పాడో అర్ధం అయ్యేది!

ఎదో, వయసైపోతుంది..ఈ కళ్ళ కింద ఉబ్బులు అసహ్యంగా ఉన్నాయ్ అని ఆయన అన్నట్టు లిప్ రీడింగ్ చేశా. ఎక్కడో ఈ వయసు పెద్దాయన డబ్బులు కట్టి మరీ ఈ అయిస్ వాపు కోసం వచ్చి ఉంటాడా అనే అనుమానం తో బుర్ర గోక్కున్నా, ఇలాంటి చిన్న చితకా విషయాలు మనం ఇట్టే తేల్చేయ్యచ్చు అని.. ఇంకొక్కసారి " నిజంగానే  ఈ కళ్ళ కింద వాపులకే వచ్చవా" అని నేను ఇంగ్లీష్ లో అడిగాను. ఆయన అవును అని స్పానిష్ లో చెప్పాడు. 

ఇహ నేను మొదలుపెట్టాను.. చూడు పెద్దాయన, నీకున్న శతకోటి రోగాల్లో ఇది లీస్ట్ ఆఫ్ దా ప్రాబ్లంసూ. మనిషికి యవ్వనం లో ఉన్న కళ వయసైపోయాక రమ్మంటే ఎలా వస్తది చెప్పు? అర్ధం చేసుకో.. పొద్దున లేవగానే కాస్త వాకింగ్ చెయ్యి, ఎక్కువ ఉప్పు తినకు, నీకు మొన్న నేను రాసిచ్చిన నూట పదహారు బిళ్ళలు రోజు వేస్కో, అని నోటికొచ్చిన సలహాలు పేలి, ఇంక వెళ్ళిరా..విజయోస్తు అని చిట్టి రాసిచ్చి బయటికి పంపబోతుంటే, మా పెద్దావిడ వచ్చింది.(క్లినిక్ లో సూపర్ వైజ్ చేసే పెద్ద డాక్టర్ లే, ఆవిడ ప్యూర్ స్పానిష్ మాట్లాడుతుంది). 

ఒకసారి పెద్దాయన వైపు, ఒకసారి నా వైపు చూసి, పాపం రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు ఇచ్చిన పప్పులు, అప్పచ్చెలు తిన్నాడట, కళ్ళ కింద ఇలా వాచిపోయిందట. నాలిక కూడా కాస్త తిమ్మిరిగా ఉందట. బెనడ్రిల్ ఇచ్ఛవా అని అడిగింది! 

అంటే, అది..మరి..నేను..ఇప్పుడే అదే అనుకుంటున్నాను అని నేను నాలిక కరుచుకున్నాను. మామూలుగా ఇద్దరం ఒకే భాష మాట్లాడితే మన వైద్యం ఇంత భయంకరంగా ఉండదు. పాపం పెద్దాయణకి ఈ వయసులో బాలముడతాలు వచ్చాయి అని నేను వేసుకున్న కుళ్లు జోకులకి నేనె రెండు మొట్టికాయలు వేసుకుని.. ఆయనకి మందులు రాసి ఇచ్చా. వెళ్లే ముందు నాకే మనసు ఒప్పుకోక, ట్రాన్సిలేటర్ కి ఫోన్ చేసి, ఇంకేమైనా డౌట్ లు ఉన్నాయా అని అడిగాను. ఏమి లేవు..నువ్వు మంచి డాక్టర్ వి ఆన్నాడు. ఇహిహీ, నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పి, టాటా చెప్ప.

అందుకే అప్పటినుండి సొంత భాషా ప్రావీణ్యత వాడకుండా, ట్రాన్సిలేటర్ ఫెసిలిటీ వాడుతున్న.


25, సెప్టెంబర్ 2012, మంగళవారం

కారు కధ



మా ఫ్రెండ్ కి ఒక కార్ వుండేది. అంటే ఇప్పటికి కుడా ఆ కార్ వుంది, కాని మా ఫ్రెండ్ దగ్గర కాదు. చదువు కోసం అమెరికా వచ్చిన కొత్తల్లో ఎవరో పళ్ళ డాక్టర్ పెళ్ళాం కొద్ది రోజులు డ్రైవింగ్ నేర్చుకుని, ఫ్రీగానో అర్ధ డాలర్ కో వీడికి ఆ కార్ అమ్మేసింది అట. సగటు స్టూడెంట్ గా, అప్పటి అవసరాలకి పనికొస్తున్న నాలుగు చక్రాల వాహనం కాబట్టి, దాని సుందర విశేష గుణగణాలని పెద్దగా పట్టించుకునేవాడు కాదు.
అదేంటో కారు దిద్దిన కాపురం లో లాగా వీడికి ఆ కార్ బాగా కలిసోచ్చేసరికి, రంగు వెలిసినా, వెనక సీట్ చిరిగిపోయినా, లోపల ఎయిర్ కండిషన్ పాడైపోయినా సరే, కార్ ని మాత్రం మార్చలేదు.

కాలం గడిచిపోయింది, కారు టయరులు అరిగిపోయాయి, ఇనప ముక్క కాబట్టి అక్కడక్కడ  తుప్పు కుడా పట్టింది.
పనిలో పని మనోడికి మంచి వుద్యోగం వచ్చి, పెళ్లి కుడా కుదిరింది. కొత్తగా పెళ్లి చేసుకుని కాపురం పెట్టటానికి వస్తున్నాడని , వీడి కారు చుస్తే అమ్మాయి అటునుంచటే  ఫ్లైట్ ఎక్కేసి పుట్టింటికి వెళ్ళిపోతుందని, జాలి తలచి, స్నేహితులందరూ ఒక బెంజ్ కారు లో ఎయిర్ పోర్ట్ నుండి పీపీపీ డుండుం ల తో ఇంటికి తీస్కోచ్చారు.

కొత్తగా పెళ్ళయ్యింది కాబట్టి ఆ అమ్మాయికి భార్తగారిని ఆరాధించటమే సరిపోయింది. పైగా వాళ్ళ ఇంటి బాల్కనీ నుండి, దూరంగా చెట్టు నీడన పార్క్ చేసిన ఆకుపచ్చ రంగు కారు కంటికి బాగానే కనిపించేది. అందుకే  కారు ప్రస్తావన అప్పటికి రాలేదు. మొదటిసారిగా ఇంట్లో సామాను తీసుకురావటానికి ఈ కొత్త జంట వాల్ మార్ట్ కి బయల్దేరారు. వెనకాల స్నేహితుల బ్యాచీ కూడా. తీరా  అక్కడ ఒక పెద్ద A .C కొని, కారు లో పెట్టె ప్రయత్నం చేసేప్పుడు ఆ అమ్మాయి అమాయకంగా వెనక డోర్ తియ్యండి, ఈజీ గ వెనక పెట్టేయ్యచ్చు అని సలహా ఇచ్చింది. మనోడు చిరాక్గా, వెనకెలా పెడతాం, కనపడట్లేదా అని ఉరిమాడు.

 మేమందరం ఒక్కసారిగా షాక్ తిన్నాం. ఈ పిల్ల ఏనాడూ చిరిగిపోయిన ఆ వెనక సీట్ట్ ని చూసినట్టు లేదు. అమ్మాయికి సైగ చేసి చెప్పాను, ఆ కారు కి రెండే తలుపులు. 2 డోర్ కార్ అని.
వెనక సీట్ కి చేరుకోవాలి అంటే ముందు సీట్ మీద నుండి హై జంప్ చెయ్యాలి! అందరిముందు కళ్ళతో యుద్ధం చేస్కుని, కొత్త జంట ఇంటికి చేరుకున్నారు. మర్నాడు మావాడు అనుకున్నట్టే నెత్తి  మీద బొప్పి తో కనపడ్డాడు. కలిసొచ్చింది, మార్చే ప్రసక్తే లేదని గట్టిగా చెప్పి ఒప్పించేసా రా అన్నాడు. మరే ..నిజమే మరి అన్నం మేమంతా.

ఆరు నెలల తర్వాత, ఒకరోజు గుడి నుండి వస్తు, చాల బిజీ రోడ్ మీద, మా వాడు పోటా పోటి గా కారు తోలేస్తుంటే, వెనక నుండి ఎవరో చేజ్ చేస్తున్నట్టు అనిపించి, కొత్త పెళ్ళాం భయపడిందట. చీర కట్టు విచిత్రంగా అనిపించి ఎవరన్నా మనని తరుముతున్నారా  అని అనుమానం కుడా వ్యక్తపరిచిందట . వెనక బండి లో ఫ్యాక్షన్ సినిమా విలన్లని పోలినవాళ్ళు కార్ ని గుద్దినంత పని చేసి, అద్దం దించమని సైగ చేసి, వెంటనే ఒక విజిటింగ్ కార్డు లోపలకి గిరాటేసి, కార్ తుప్పు తీస్తాం, we'll help you bro, మేము పని లేని మెకానిక్కులం, చాలా చీపు గా పని చేసి పెడతాం అని చెప్పి పోయారట. ఇంత అవమాన భారం భరించలేక వాడి భార్య, గుడిలో కొట్టేసిన అర కొబ్బరిచిప్ప వాడింది. మర్నాడు మళ్ళి నెత్తి మీద బొప్పి తో కనపడ్డాడు.

ఈ సారి మాత్రం "ఒప్పించేసా" లాంటి డైలాగులు కొట్టలేదు. హోండా CRV బుక్ చేశాన్ రా, ఏదో మంచి డీల్ వుందని మీరేగా చెప్పారు, అందుకనీ ...అని సాగదీస్తూ, నెత్తి  రుద్దుకుంటూ పోయాడు.


19, ఫిబ్రవరి 2011, శనివారం

స్టార్ట్ సౌండ్? యాక్షన్ !

ఇదేదో సినిమాకి సంబందించిన టైటిలు లాగ ఉంది కదూ..నాక్కూడా అలాగే అనిపించింది..కాని కాదు.బుర్రకి ఈ  టైంలో అదే తట్టింది మరి..విషయం ఏంటంటే..ఈ మధ్య కొన్ని రోజులు నేను అనుభవించిన విపరీతమైన శబ్ద కాలుష్యము,ఆ సౌండ్  మొదలవగానే నేను తీసుకున్న యాక్షను వెరసి ఈ టైటిలు. 

ఆ మధ్య బాగా మబ్బు పట్టి  తుఫాను వస్తుంది అనుకుంటున్నా ఒకానొక రోజున,నా పాటికి నేను ముంతెడు కాఫీని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటె...చిటపట చినుకుల చక్కటి శబ్దం కాకుండా,ఇనప రేకుని  సిమెంట్ నెల మీద బరబరా ఈడుస్తున్న శబ్దం వచ్చి ఉలిక్కి పడ్డాను. కిటికీ లో నుండి తొంగి చుస్తే, మా కింద వాటా లోకి కొత్తగా ఎవరో వచ్చి చేరుతున్న సంకేతాలు వచ్చాయి.ఇల్లు మారేప్పుడు ఆ మాత్రం శబ్దాలు సహజమేలే అని సరిపెట్టుకున్నాను. కాకపొతే,ఈ దేశం లో కనీసం వారం ముందే  వాతావరణం ఎలా ఉండబోతుందో చెప్పినా,ఈ మందబుద్ధి  ఎవరో ఈరోజే గృహప్రవేశ  మహోత్సవం పెట్టుకు ఎడ్చాడెంటొ అని నవ్వుకుని ఊరుకున్నాను.

ఒక రెండు మూడు గంటలపాటు మొగుడు పెళ్ళాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమతో స్వచ్చమైన స్టీలు డేగిసాలు విసేరేసుకునే శబ్దాలు,ఇల్లు సర్దుతున్న? శబ్దాలు కాబోలు,వచ్చాయి కాని  ఆ పైన అంతా నిశ్శబ్దమే. హబ్బా..వాన వెలిసి వర్షం వచ్చినట్టుగా ఉంది..వర్షం నిజంగానే వచ్చింది.

మరుసటి రోజు గోడలకి  మేకులు కొడుతున్న శబ్దాలు, కొన్ని ఢమ ఢమలతో పాటు లీలగా వినిపించే అర్ధంకాని అదేదో సంగీతం. నేను పనిలో ఉండి పెద్దగా పట్టించుకోలేదు. ఆ మర్నాటికి మర్నాడు ఢమ ఢమలు తగ్గి అర్ధంకాని సంగీతం శృతి కాస్త హెచ్చింది.రోజులు గడిచే కొద్ది ఆ పిచ్చి మ్యూజిక్ పిచ్ మరికాస్త పెరుగుతూ పోయింది. ఆ శబ్ద తరంగాలకి ముందు చక్క నెల అదరటం, దాని మీద ఉన్న సోఫా కాస్త జరగటం, దానిపై  ఉన్న నేను ఇంకాస్త ఊగటం...ఇదంతా ఒక అనైచ్చిక క్రియ లాగా జరిగిపోతుంది..ఆ వచ్చే శబ్దం పాత తెలుగు పాటలంత బాగాలేకపోయినా,కంసేకం కొత్త హిందీ పాటలాగ ఉన్నా నేను ఏమి అనుకునేదాన్ని కానేమో.బట్..బిట్టర్ నిజం ఏంటంటే..ఆ మ్యు"సిక్" చాలా సిక్ గా ఉంది.

నిజం చెప్పొద్దూ..ఒక గులకరాళ్ళ డబ్బాని నెత్తిమీద పెట్టి సుత్తితో కొట్టినట్టు..కాసేపు టంగు టంగు మని, ఇంకాసేపు ఢభెల్ ఢభెల్ మనీ...సంగీతాన్ని అపహాస్యం చెయ్యటం కాదు కాని..ఆ కిందవాడి ఛాయస్ కి మాత్రం ముర్చపోకుండా ఉండలేం.రోజు సాయంత్రం నాలుగింటి నుండి ఏడింటి దాకా ఈ విచిత్ర కలాపోసనతో వేధించేసాడు వెధవాయ్. సాయంత్రం అయ్యేసరికి వెన్నులో నుండి వణుకు మొదలయ్యేది.అందుకే మిక్సీ మోతలలో,పోపు చిటపటలలో కుడా నాకు ఎంతో శ్రావ్యమైన సంగీతం వినపడినట్టు ఉండేది.వీడిని ఇలాగే వదిలేస్తే కష్టం అనిపించి,వాడు ఆ పాటలు పెట్టగానే నేను సిరివెన్నెలలోని  "ఆది భిక్షువు వాడినేది కోరేది" పాట పెద్ద సౌండ్తో మొదలెట్టేదాన్ని.ఉహు..లాభం లేదు..అటు వైపు దున్నపోతు మీద వాన పడ్డట్టు..ఏ చలనము లేదు..నిరంతర శబ్దశ్రవంతి తప్ప.

ఆ వారం,వీడి సౌండ్ దేబ్బకేనేమో,ఆకాశం బద్దలై మంచు తుఫాను కురిసింది.అటువంటి విపత్కర వాతావరణంలో ఆపీసుకి వెళ్ళలేక ఇంటినుండి పని చేసుకుందాం అంటే,ఆ రోజు అసలు సుప్రభాత సేవే మొదలెట్టేసాడు వాడు. పొద్దున్న ఏడింటికి మొదలెట్టిన సౌండు ఆపకుండా తారస్థాయి లో మధ్యానం దాక పేల్చాడు.సహనం నశించింది. ఏం చెయ్యాలో పాలు పోలేదు.అపార్ట్మెంట్ మెయిన్టేనేన్సకి ఫోన్ చేసి నా బాధ వెళ్ళగక్కి, మము బ్రోవమని చెప్పవే సిండి తల్లి..మము బ్రోవ మనీ చెప్పవే అని ప్రాధేయపడితే,ఆ సిండి పిల్ల "మీరే పోయి వాడికి చెప్పిరండి, వినకపోతే మాకు లిఖితపూర్వక విన్నపము సమర్పించుకుంటే, మేము తగు చర్య తీస్కున్నట్టు నటించి ఏమి చెయ్యము అని చెప్పింది.

ఆవేశ పూరితమైన నేను వెంటనే కిందకెళ్ళి దభిదభిమనీ వాడి తలుపులు బాదేసా..లోపలనుండి వచ్చే సౌండులో ఈ సౌండు కొట్టుకుపోయి వాడికి ఏమి వినపడినట్టు లేదు..తలుపు తెరుచుకోలేదు. 
చేసేది ఏమి లేక ఆ చలిలో,మోకాలెత్తు మంచులో ఈదుకుంటూ సరాసరి మెయిన్టేనేన్స ఆఫీసుకెళ్ళి మా ఇబ్బందిని తెలుపుతూ ఒక ఉత్తరం,మరియు వారి నిబంధనల ప్రకారం ఒక నాలుగు తెల్ల,నల్ల,యెర్ర,బులుగు ఫారంసు నింపేసి, ఇక కాస్కోరా నీ పని ఠా అని ఒక చిన్న సైజు వికటాట్టహాసం చేసి ఇంటికి చేరాను. 

ఈ లోపు సంవత్సరాది వచ్చింది...రోజు సాయంత్రానికి అలవాటుగా వచ్చేస్తున్నా తలనొప్పి రాకపోయేసరికి ఏమయ్యింది చెప్మా అని ఆలోచిస్తే..ఆహా..ఊహో..శబ్దం లేదప్పా...ఓయబ్బో మనమిచ్చిన కంప్లైంట్ మీద అప్పుడే యాక్షను తీసుకున్నట్టున్నారు ...ఏం చెప్పి ఉంటారో..ఫోన్ చేసి చెప్పుంటారా,లేకా ఇంటికి ఉత్తరం పంపి ఉంటారా అనుకుంటూ ఉత్సాహపు చర్చలు..మన పేరు చెప్పేసి ఉంటారా,లేక గోప్యంగానే ఉంచారా అని మీమాంసలు..భలే ఆనందంగా అనిపించింది.పనిమీద బయటికి వెళ్తూ కింద వాటా వైపు చుస్తే ఏ సబ్దము లేదు.. కొంపదీసి ఖాళి చేసి పోయాడా అని కుడా ఆశ పడిపోయేసాను. పది రోజులు అవగానే మళ్ళి మొదలయ్యింది..సేమ్ టు సేమ్ అదే సౌండు..ఈ సారి ఏడుపొచ్చింది. సెలవలకి దేశసేవ చెయ్యటానికి పోయినోడు మళ్లీ వచ్చినట్టున్నాడు. ఏం చేస్తాం..ఆఘమేఘాల మీద మళ్లీ  మెయిన్టేనేన్స ఆఫీసు కి ఫోను..

వాళ్ళు చెప్పిన సమాధానానికి చిర్రెత్తుకొచ్చింది.మా హెడ్ ఆఫీసుకి మీ ఉత్తరం పంపుతాము. వారు తగు చర్య తీసుకున్నట్టు త్వరలోనే, అంటే ఒక నెలా రెండు నెలలలో మాకు చెప్తారు..అప్పుడు మేము మీకు ఫోన్ చేసి చెప్తాము అని చిలకలా కూసిన కుతకి వీలయితే దాని పీక కోసెయ్యాలి అనిపించింది. అప్పటికే చాలా ఓర్పుతో నెల పైనే ఈ గోల భరించాము..అందుకే ఆ హెడ్ ఆఫీసుకే ఒక ఫోన్ కొట్టేసాము. వారు సెలవుల వలన ఈ మధ్య ఉత్తరాలు చూడలేదు, మీ ఉత్తరం అసలు అందిందో లేదో కుడా తెలిదు. అది దొరకగానే..అన్నిటికంటే తక్కువ విలువ ఉన్నా కంప్లైంట్ కాబట్టి...అవసరం అనుకుంటే పట్టించుకుని...తీరిక చేసుకుని మీకు మెల్లిగా ఫోన్ చేస్తాము అని వివరించారు.

వారాంతం వచ్చింది...వీడి పాటలతో పాటు పక్కింటిలో వాళ్ళు కుడా పెద్ద పార్టీ చేసుకుంటూ చిందులు తొక్కుతుంటే, దిండ్ల కింద తలకాయ పెట్టి, ముక్కు రంధ్రాలు మాత్రం బయటికి పెట్టి గాలి పీల్చి బతికేసాం.వీకెండ్ ఉత్సాహంలో వాళ్ళు ఉంటె,అప్పుడు మనమేమన్నా తప్పే అవుతుందిలే అని సరిపెట్టుకున్నాం.

ఇహ మర్సటి రోజు,సాయంత్రం నుండి పెట్టిన సౌండు చాలలేదు అన్నట్టు రాత్రికి  మంచి శుభ ముహూర్తం చూస్కుని వేర్రేత్తిపోయే స్థాయికి సౌండు పెట్టి ఆనందిస్తున్నాడు  ఆ శబ్దాసురుడు. మెల్లిగా లేచాను. ఒక అర ఠావు తీసుకున్నాను. తెల్లటి ఆ కాయితం మీద నల్లటి పెద్ద పెద్ద అక్షరాలతో "దయచేసి శబ్దం తగ్గించు" అని ఆంగ్లంలో బరికేసాను. మెల్లగా మెట్లు దిగి, తలుపు కింద నుండి ఆ కాయితం లోపలికి జరిపి, పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేసాను..
చెవులు రెక్కించి వింటున్నాను...రెండు నిమషాల తర్వాత జలపాతం నుండి ఒక్కో మైలు దూరం జరుగుతుంటే తగ్గుతూ వినిపించే శబ్దం లాగా...మెల్లిగా ఆ శబ్దాసురుడి సంగీత శబ్దం తగ్గింది. బిగపట్టిన ఊపిరి వదిలి చూసా..వినపడింది..ఊపిరి సౌండు. గడియారం వంక చూసా..టైం అర్ధరాత్రి .ఉవ్..వా..ఉవ్..వా...అంటే వీడు నిద్దరోతూ సౌండు తీసేసాడే కాని నా గొప్పతనం ఏమి లేదా అని కన్నీరు మున్నీరై నిశ్శబ్ద నిశి లోకి నిష్ క్రమించా..

ఇంకా పెద్దగా కధ లేదులే...మరుసటి రోజు నుండి సౌండు లేదు..ఉన్నా చాలా చిన్న సౌండు..నేను కావాలని నెలకి చెవులు ఆనించి వింటే తప్ప వినపడని సౌండు...అంటే నా చిత్తూ కాయితం చిట్కా పని చేసినట్టేనా..
ఏమో..గత నెలనాళ్లగా అయితే ఆ విచిత్ర సంగీత విన్యాసాలు లేవు...ప్రాణానికి హాయిగా ఉంది. గోటితో పోయేదానికి గొడ్డలెందుకు అని..నా బుర్ర ముందే పని చేసుంటే అటు ఇటు మొరపెట్టుకునేకంటే ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది అని నిట్టూర్చి...హైఇ..నా నిట్టుర్పు శబ్దం కుడా వినపడే నిశ్శబ్దం ఉందిప్పుడు..
అద్దన్నమాట సంగతి ..!

28, జులై 2010, బుధవారం

కవిత? కవితే! కవితా..

నాకు కవిత్వం రాయటం రాదు..అంతెందుకు..చాలా కాలం కవిత చదవటం కూడా రాదు..కానీ ప్రతి విషయం మీద అడిగినా అడగకపోయినా ఒక అభిప్రాయం చెప్పటం మాత్రం బాగా అలవాటు అయ్యింది..ఇప్పుడు కవితల మీద విశ్లేషణ చెయ్యబోవటం లెదు..భయం వలదు...(ఏకంగా కవితే వినిపిస్తా అని తేలిక ఇంకా ఇక్కడే ఉన్నారా పాపం :P)

ఇప్పుడు...అయ్యో అలా పారిపోతున్నారు ఏంటి...హుహ్.!!.మీ ఇష్టం...ఐనా నా తవికల సంకలనాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దాం అని నిర్ణయించుకునే ఈ సాహసం చేస్తున్నా..(ఎయి ..వినిపిస్తుంది..సాహసం మాది కదా..తనది అంటుంది ఏంటి బుజ్జి అనుకుంటూ ఏంటి ఆ గొణుగుడు!!..)

ధైర్యే సాహసే లక్ష్మి (ఇక్కడ చదివినందుకు లాటరి ఎం లెదు..మీకు మీరే ఓ వీర తాడు వేస్కోండి..)
----------------------------------------------------------------------------------------------------------
1.....

ఎంతటి ఆశ సరిపోతుంది ఈ అగాధాన్ని పుడ్చటానికి?
నైరాశ్యానికి చోటు లేకుండా మదిని కమ్మేయ్యటానికి..
దుఖ్కాన్ని దిగామింగినా తీరని దాహానికి..
భాష్ప జలపాతాలు ఆవిరవటానికి?

చిన్ని చినుకు చాలదా పుడమి పులకించటానికి..
బంధమే కావాలా నీకై నేను వుండటానికి?
భాష లేని భావం చాలదా మదికి..
సంతోషం చిరునామా తెలియటానికి?
ఒకరికి ఒకరు ఏమీ కాక
అన్నీ అవటానికి..


------------------------------------

2....పున్నమి  వెన్నెల
అలవాటైన వాడవే కాని
ఏమిటి ఈ నాటి వింత మామా..
నీ నెచ్చెలి వెన్నెలనే కదా..
మరి నా సిగ్గుకి నువ్వు ఎర్రబడటం ఏమిటి చందమామ..

పున్నమి రేయి హాయి
మనకి తెలియని వింతల నెలవని
నా జాబిలి బుగ్గనున్న చుక్క
చెప్పేదాకా..మనకి తెలియకపోవటం వింతేగా మామా..

-------------------------------------

3.... ఏమిటిది?

బీట వారిన నా మది భూమిని
బాధ చినుకా..నువ్వైనా పలకరించి పోవా..
అశ్రుసముద్ర గర్భాన దాగిన
నా అమూల్య జ్ఞాపకాల మణులని
తిరిగి తెచ్చివ్వవా..
పెను ఉప్పేనవై వచ్చి
ఈ నిర్లిప్తతని పారద్రోలవా..
నిన్నైనా సంతోషపెట్టే అదృష్టాన్ని నాకివ్వవా..

-------------------------------

4....నేనేనా..

నాలో వున్నా..నాకే తెలియని నేను..
మది అద్దం లో ఆ అపరిచిత నీడ ..
నాదేనా?
నేను ఏకీభవించని భావాలతో
నేను సమ్మతించని ఆలోచనలతో
నేను వలదన్నా వీడని పట్టుదలతో
నేనే కాదేమో అనిపించే అనుమానాలతో...
నా నుండి నన్ను దూరం చేసే నీవు నేనేనా..
నిజంగా నేనేనా..?

--------------------------------

5....

నా గుండె సవ్వడిని ఆగిపోమ్మన్నాను
అవును..నిన్ను నాతో మాటాడొద్దు అన్నాను
ఎప్పుడూ నీ పలుకుల అలకలేనా..
నేడు నీ మౌనం విన్దామనుకున్నను..

----------------------------------------------
6.....

నేలకోరిక...పక్షినై నింగికెగరాలని
నింగి కోరిక...చినుకై చిగురును తడపాలని
చిగురు కోరిక...భ్రమరమై పువ్వును ముద్దాడాలని
పువ్వు కోరిక...వాలు జడ నీలాలలో వోదిగిపోవాలని
ఆ ముంగురుల కోరిక...వెచ్చని మబ్బు తునక కావాలని
మబ్బు కోరిక...నది పాదాలు స్ప్రుశించాలని
నది కోరిక...సాగర కౌగిలిలో బంధీ అవ్వాలని
సాగరం కోరిక...కెరటమై తీరం చేరాలని
ఆ తీరాన...నిండు చందమామ నీడన
నీ అడుగులలో నేనై..నేనే నీవై వుండాలనే
నా చిన్న కోరిక వింటావా..
నాతోనే వుంటావా.. :)

-------------------------------

25, జులై 2010, ఆదివారం

మునుసుబోళ్ళ పిల్ల రోయి!

పిల్ల అని వినపడగానే గబగబా మీటలు నోక్కేయ్యటం కాదర్రా, విషయం తెలుసుకోవాలి ముందు :D నిన్న బాగా గుర్తొచ్చి అద్దాల గుండె గదిలోకి తొంగి చూస్తే ఓ చిరునవ్వు వెలిసి కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి..చిన్నప్పటి నుండి మేము నలుగురము కలిసి కూర్చుంటే కబుర్ల దొంతరలు..పాత జ్ఞాపకాలు..నవ్వుల చినుకులే..ఆ నలుగురు ఎవరు అనేనా...అమ్మ నాన్నారు అక్క నేను.. ఇంతకముందు మా పులజాడ ప్రహసనం గురించి చెప్పా కదా..అలాగే ఒకసారి నాన్నారు తన చిన్నప్పటి జ్ఞాపకాలు పంచుకున్నారు లె..

పసి వయసులో పిల్లల మనసులు నిష్కల్మషంగా ఉంటాయ్..ఒకసారి ఏదన్నా కావాలి అనిపిస్తే అది అవసరమా,దాని వల్ల ఉపయోగం ఏంటి, దాని పర్యవసానం ఏంటి అనే ఆలోచన లేకుండా...నాకు అది కావాలి...కావాలంతే అని మాత్రమె అనిపిస్తుంది.

ఒంగోలు కి దగ్గరలోని పల్లెటూరు లో..పెద్ద వ్యవసాయమే తప్ప పెద్ద చదువులు లేని ఊరు అది..ఉన్న నలుగురు అన్నదమ్ములలో చిన్నోడు అని బాఘా ఆలోచించి ఆదినారాయణ అనో లేక నోరు తిరగక ఆదయ్య అనో ఓ పేరు పెట్టేసారట. కొన్ని నెలలకి పోయినేడాది పోయిన తాత గుర్తొచ్చి ఆయన పేరు తగిలించేసారట.. సరే ఇప్పుడు పేరు గోల కాదు కానీ...మొత్తానికి నాన్నారి పేరు మార్చారు....

అసలే ఆ ఇంట్లో ఆడపిల్ల లేదాయే...అందుకని ఉన్న చిన్న కొడుకుని అల్లారు ముద్దుగా, అపుడప్పుడు ముద్దుగుమ్మ లాగా చూసుకుంటున్నారు...  పుట్టిన అయిదు సంవత్సరాలకి తిరపతి లో పుట్టెంటుకలు ఇచ్చి..పిల్లాడికి బాగా చదువు రావాలని ఎంకన్నకి మొక్కి, ఊరి మునిసిపల్ బడి లో వేసారట. ఇంటి నుండి బడి ఓ ఫర్లంగ్ దూరం ఉంటదేమో..అసలే ఊళ్ళో ఆడాళ్ళు అందరూ తలలో మల్లెపూలు తురుముకుని ముచ్చట్లు ఆడుకునే కాలం అది..ఈ బుడ్డోడు బోడి గుండెసుకుని బడికి బయల్దేరి..
తిన్నగా తలకాయ వంచుకుని వెళ్ళకుండా (నా స్టైల్ లో చేతి సంచి ఊపుకుంటూ వెళ్లి ఉంటావ్ కదా నాన్నారు అని మన సటైర్!) ఈ ఆడాల్లందరినీ చూస్తూ నాలుగు అడుగులు ముందుకి వెయ్యగానే చిట్టి బుర్రలో చిన్న ఆశ...నాకు కూడా పూలు పెడితే బాగుండేది అమ్మ అనిపించిందట. అంతే..బడి కి మారో గోలి అని పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి.."అమ్మోయి! నాకు కూడా పూలు పెట్టావా అని అడిగారట. పోరా పిచ్చి సన్నాసి, అని ముద్దుగా విసుక్కుంటే రోషం వచ్చి..పూలు పెడతావా లేదా అని గట్టిగా గోల మొదలెట్టారట..

ఒరేయ్ ..అసలే మగపిల్లాడివి, పైగా నీ నెత్తి మీద ఒక్క ఎంటిక కూడా లేదాయే..ఇప్పుడెట్ట రా పూలు పెట్టేది అంటే ..ఉహు..పెట్టాల్సిందే అని గోల! ఇహ చేసేది ఏమి లేక, ఓ పూల దండ తెచ్చి.. ఆ చెవు నుండి ఈ చేవుకి.. గుండు మీదగా కట్టారట. అవి చూస్కుని మురిసిపోయి.. మళ్ళి బడికి బయల్దేరితే.. రచ్చ బండ దాగ్గర కూర్చున్న ఊరి పెద్ద మనుషులు నవ్వు ఆపుకోలేక ఎక్కిరించారట..

ఇంతలో వెనకనుండి " అద్గద్గో...మునుసుబోళ్ళ పిల్లోత్తుంది రోయి!" అబ్బో..!!మునుసుబోళ్ళ పిల్ల భలేగుంది రా..
యాడ దాచారబ్బా ఇన్నాళు కానరాకుండా " అని పోకిరి పిల్లగాళ్ళు వెంటబడ్డారట .. కళ్లెమ్మట కారే కన్నీళ్ళు తుడుచుకుంటూ..
అసలే పెద్దదైన ముక్కు ఎగబీల్చుకుంటూ..ఇంటికి పరుగో పరుగు...అయ్యో ఇంత ఘోరం జరిగిందా నాన్న..పోనీ పూలు తీసేద్దాం లె అని వాళ్ళ అమ్మ ఒదారుస్తుంటే...ఇంకా గట్టిగా శోకండాలు పెట్టటం అట..నా పూలు ముట్టుకుంటే ఊరుకోను అని..
బోడిగుండు మీద పూలు అలానే ఉండాలి..కానీ అది చూసి ఎవరు నవ్వకూడదు...ఇట్టాగైతే ఎట్టా రా అంటే..ఏమో! నాకేం తెల్సు.. అదంతే..ఎవరు నవ్వకూడదు అని పేచి...

ఇదంతా నాన్నారు చెప్పిన ప్రతిసారి కొత్తగా విన్నట్టు వినీ..ఇంతకి నవ్వినోళ్ళు ఎవరు నాన్నారు..ఆ కుర్ర బ్యాచి లో ఎవరెవరు ఉన్నారు..ఇంకా యేమని ఎక్కిరించారు అని ఆరాలు తీసేదాన్ని..చిన్నప్పుడు ఈ "మునుసుబు గారి పిల్ల" కి గర్వభంగం జరిగినా, తర్వాత ఆ ఊరి నుండి బాగా చదువుకుని వృద్ధి లోకి వచ్చి, ఎందరికో ఉపాది కల్పించిన దేవుడు' అనిపించుకున్నారు నాన్నారు..
మళ్ళి ఎప్పుడన్నా తీరికగా ఇంకొన్ని కబుర్లతో వస్తా ..అందాకా తెలుసుగా..టాటా :)

25, జనవరి 2010, సోమవారం

కొంచం imagination ఉండాలమ్మ..

ఇవాళ నాకు నేనే పెద్దరికం ఆపాదించుకుని,కొన్ని పెద్ద విషయాలు చెప్పేద్దాం అనుకుంటున్నా.అంటే చిన్నపిల్లల  కళ్ళు మూసి పెద్దవాళ్ళు చెవులు ముసేస్కునే అంత విషయాలు కాదులే.టీవీలో వచ్చే ఇంగ్లీష్ సినిమా ముందు viewer discretion is required అన్నట్టు,ఏదో...ఆచి తూచి ఆలోచించి చదవండి.ఇలా ఛిన్నమెదడు చితికినట్టు పెద్ద ఉపోద్ఘాతం ఎందుకిచ్చానో  అర్ధం కావట్లేదా?ఎం చెయ్యను చెప్పండి..Frankfurt విమానాశ్రయంలో ఉన్నా.మరో ఆరు గంటలు ఐపుండదు మన ఇమానం. అందుకే,ఈలోపు సమయాన్ని సద్వినియోగ పరుద్దాం అని ఈ ప్రక్రియ మొదలెట్టా.


విషయం  ఏంటంటే..నాకు ఊహాశక్తి ఎక్కువ.ఏదన్న జోక్ చెప్పినా,విన్నా,నేను ఆ సందర్భాన్ని ఊహించుకుని భీబత్సంగా  దృశ్యరూపంలో చూసేసి మరీ నవ్వుకుంటా.ఈ మధ్య మరీ పైత్యం ప్రకోపించి,నాకు హస్యాద్రుస్టం కూడా ఎక్కువయ్యి,ఇట్టాంటి  సందర్భాలు చాలా ఎక్కువగానే తగుల్తున్నాయ్.డాక్టర్లని జోకులు చెప్పమని అడగకూడదు.అడిగితె,వాళ్ళు ఆపమనేదాక నవ్వటం ఆపకూడదు.లేకపోతె paracetamol లో ఏ పసరు మందో కలిపేసి ఇస్తే...అదంతే...ఇస్తే గిస్తే ఎం లెదు... నవ్వు ఆపకూడదు అంతే.

నేను మొన్నామధ్య ఒక ల్యాబ్ లో చేరా.ఎందుకు ఏమిటి ఎలా,దానివల్ల నీకు లాభం ఏంటి,నువ్వసలు డాక్టర్వేనా లాంటి ప్రశ్నలు మీరు అడక్కూడదు,నేను చెప్పకూడదు.సరే అడగచ్చులే.ఐనా నేన్ చెప్పానుగా..సరే చెప్తాలే..ఐనా మీకు అర్ధం కాదుగా.. సరే,సోది ఎందుకుకానీ,ఎలకల మీద ప్రయోగాలు చేస్తారక్కడ.ఇక్కడ కొంత హింస,హత్యలు,పంచ మహాపాతకాలు,పెద్దవారికి మాత్రమె లాంటి టైటిల్స్ పడతాయి..జాగ్రత్త.ఆ ఎలకలు మాములువి కాదు కాబట్టి,కడుపుతో ఉన్న అమాయక ప్రాణులు కాబట్టి, రెండు నిమషాలు ప్రాణికోటి కోసం ఆహుతి ఐన వాటి అమర జీవితాలకి సంతాపం తెలిపి మరీ నా కధ మొదలుపేడ్తున్న...


మా ల్యాబ్ లో ఎలకల బాగోగులు చూస్కోటానికి ఒక మనిషి ఉంటాడు..పాపం చదివింది మంచి చదువేలే.. కాకపొతే తనపని తో  పాటు ఈ పని కూడా చేస్తాడు...మనకా ల్యాబ్ లతో పెద్ద touch లేదాయే..రేపు మనం చెయ్యాల్సిన కార్యక్రమాలు ఎంటండి... ఏమన్నా ఎలకలు ఉంటయ్యా కొయ్యటానికి అని అడిగేసా.పైకెళ్ళి చూసొచ్చాను,ఎలకలు యెవీ నాకు గర్భిణులుగా  కనపడలేదు అన్నాడు! (none of them LOOKED ______ to me అన్నాడు )
ఏంటీ!!! చూసి చెప్పేస్తావా !! ఛా..నిజమా!! అని కాసేపు ఆ మానవుడి వైపు అదో expressionతో చూసా.అతను  చేప్పదల్చుకున్నదే నేను విన్నానా,లేక అసలే తింగర బుచ్చిని,నాకు ఇంకేదో అర్ధమయ్యిందా అని కాసేపు సంసయించా... అక్కినేనివారి సినిమాలో మాత్రమె..నాడి పట్టుకు చూసి...congratulations..మీరు  dash dash కాబోతున్నారు అని చెప్తారు అనుకుంటే,వీడేంటిరా బాబు..ఇలా...అసలు ఎలకేంటి,దానికి కడుపేంటి,వీడు చూసి చెప్పటం ఏంటి,అని ఇంకో expression.   మరీ ఎక్కువగా అడిగితె అసలే ఫ్రీ కంట్రీ.సృష్టి రహస్యాలు చెప్తాడని భయమేసి..నోర్ముస్కున్న...


రెండ్రోజులు ఇది జోక్ ఆ లేక నాకు అంతుపట్టని ప్రస్నో కూడా అర్ధం కాల.ఉండబట్టలేక,ఒకపెద్దావిడని చూస్కుని,మెల్లిగా  గోటితో నేలకేసి రాస్తూ,కాస్తంత  సిగ్గుపడుతూ,ఆ మానవుడు ఎలా  కనిపెడతాడు చెప్పవా అని బతిమాలా.నేను అరగంట బ్రతిమాల్తే,ఒక్క క్షణం లో చెప్పేసింది..చూసి  అని!
నిజమే ...తర్వాత నేను కూడా చుసెసాగా ఎలా చూసి చెప్తాడో! మీకు వివరాలు అనవసరం.నాకు అర్ధం అయి చస్తే కదా మీకు చెప్పేది! :P


ఆ మానవుడికే భారత దేశం లో పిడకలతో వంట చేస్తారు అని చెప్తే,ఏంటి..అది తింటారా అని అడిగాడు..misunderstandingu ఎంత ఘోరంగా ఉంటుందో అర్ధం అయ్యిందిగా.అతని imagination అలా తగలడింది మరి.గంటసేపు నిల్చోపెట్టి,ఆవు విసిస్టత,పిడక అంటే ఏంటి,గోడ మీదకి ఎలా వెళ్తుంది,ఆవు ఎందుకు మాత,ఎద్దు ఎందుకు పిత కాదు..ఇత్యాది చెప్పి..పిడక బెస్ట్ bio fuel అని ఒప్పించా.


కొత్తగా ల్యాబ్ లో చేరిన రెండ్రోజులకి న్యూఇయర్ అని,పెద్దావిడకి గిఫ్టు కొన్నాము...నీ పేరు కూడా చేరుస్తాము లే బుజ్జి అన్నారు మా వాళ్ళు. ఉత్తినే ఎందుకులే,నా వాటా కూడా ఇస్తా కానీ,ఇంతకి ఎం తెచ్చారు అని అడిగా.సెంటు సీసా కొన్నాము ఎనభై డాల్లర్లు పెట్టి అన్నారు.సరే అందరం ఛిన్న సీసా పెద్దావిడ డెస్క్ మీద అపురూపంగా పెట్టాం. ఈవిడ ఆత్రం తగలెయ్య.అసలే తడిసిన పిల్లి కంపు కొడ్తున్ననేమో(ఊహించు ఊహించు..)ఇప్పుడే పుసేస్కుంట అని బాటిల్ సగం ఓంపెస్కుంది.వాసన బాగున్నట్టు ఉంది.వెంటనే నలభై తుమ్మింది...తుమ్ములు...మరీ డాల్లర్ కి ఒకటైన గిట్టుబాటు కావాలి కదా.


సరేగాని ఇంకో imagination...ఫ్లైట్ లో ఆకలి వేస్తె నమలటానికి మొన్న కొన్నbrownies తీస్కెళ్ళేదా అని అడిగా ఇంట్లో.
విమానాశ్రయంలో..ఒక చేతిలో మిఠాయి పొట్లం, మరో చేత్తో నోటినిండా అప్పచ్చేలు కుక్కుకుంటూ..ఆఫీసర్ ఎమన్నా food items ఉన్నాయా అని అడిగితె, ఎం లేవ్ అని విసురుగా సమాధానం చెప్పెయ్యమని మా cousin సలహా పడేసింది.ఆ సీన్ లో నన్ను నేను ఊహించుకుని...ఇంకా చెప్పాలా..పొట్ట చెక్కలయ్యేలా చాలా సేపు నవ్వుకున్న.ఇంతకి తొందరలో అప్పచ్చలు తెచ్చుకోల.ఉడకేసిన పాలకూర,ఉడకని అన్నం,సగం ఉడికిన సెనగలు పడేసారు నా మొహాన ఫ్లైట్ లో.హిందూ భోజనం ఆర్డర్ చేసారు కాబట్టి, మేము ఇవాళ వండిన చికెన్ తినే అదృష్టం మీకు లెదు అని చెప్పి...నాకాపట్టింపు లేదమ్మాయి అని నేను మొత్తుకున్నా వినకుండా చేతిలో డబ్బా లాగేస్కుని మరీ ఆ గడ్డి పెట్టింది నాకు గాలి పిల్ల(ఎయిర్ హోస్తేస్స్).
ఏ కుక్కనో ఎద్దునో కోసి పెడతారేమో అని అతి జాగ్రత్తగా మన భోజనం అడిగితె,పచ్చి పాలకురే గతి.


మొన్న ఒక రోజూ మాటల సందర్భం లో..నువ్వు ఇండియా వచ్చేయి అక్కా..ఇక్కడ ఆస్పత్రి పెట్టిద్దాం అని ఒక తమ్ముడు తెగ ఆవేసపడ్డాడు.(ఆ ఆ నువ్వే..నీ సంగతే చెప్తున్నా...క్షమించరా....ఇది చెప్పకుంటే నీ మేధాశక్తి మరుగున పడిపోతుంది..నీ పేరు మాత్రం చెప్పాను అని మాటిస్తున్నాను రా సుబ్బారావు).సరే అంతగా ఆవేసపడకురా.నేను వచ్చి మాత్రం చేసేది ఏముంది.. జనాభా తగ్గించటమే కదా అన్నాను.ప్రాస కోసం అన్నాడో లేక బుర్ర ఇంటిదగ్గర పెట్టి వచ్చాడో కానీ..నువ్వు తగ్గిస్తే నేను జనాభా పెంచుతాగా అన్నాడు.
ding!! !!! మీకేమన్నా అర్ధం అయ్యిందా? i think whatoooooo whatuuuu...మీ ఆవిడకి చెప్పవా లేదా నీకు ఇలా జనాభా పెంచే ఉద్దేశం ఉన్నట్టు అని కూడా అడిగా.పాపం బాగా ఆలోచించాక కానీ తను అన్నమాటకి పూర్తీ అర్ధం వెలిగినట్టు లెదు మా వాడికి. ఇంక ఆరు నెలలుగా నేను అదే నవ్వు కంటిన్యూ చేస్తున్నా.థాంక్స్ రా సుబ్బి..ప్రపంచానికి ఒక కొత్త వాక్యం పరిచయం చేసావ్ :P


మా వాడొకడు మోనాలిసాలా ఆ నవ్వేంటి అంటుంటాడు.సరేగాని,మోనాలిసా expression లో యేమి రహస్యం ఉందని జనం వెర్రెత్తి పోతుంటారు అని నన్నే అడిగాడు డౌటు.హహ అడగాలే కానీ,మన దాగ్గర ప్రతిదానికి ఒక సమాధానం ఉంటుంది.ఒరేయ్ పిచ్చి నాగన్న...ఆవిడ అలాంటి expression ఇచ్చింది అంటే..ఎదురుగ్గా బొమ్మేస్తున్నాయన ఫేసు ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి  ఊహించు అన్నాను..పైగా..కదలకుండా అన్నేసి గంటలు అలాంటి ముసలాడి ఎదురుగ్గా కూర్చుంటే మొనానే కాదురా..నువ్వూ అదే expression ఇస్తావ్  అన్నా..వాడి expression లో ఏదో మార్పొచ్చింది ఈ మధ్య.నా వైపు ఆరాధనా భావం తో చూస్తున్నాడు, నా తెలివితేటలకి అబ్బురపడి!:P


మొత్తానికి గంట గడిపేసా ఈ పిచ్చి రాతలతో.ఎదురుగ్గా కూర్చున్న తెల్లాయన నేను ఇంత సీరియస్ గా కామెడీ చేస్తున్నా అంటే నమ్మలెడులే.అర్జెంటు పని ఏదో చేసుకుంటున్న అమాయక ప్రాణిని అనుకుంటున్నాడు.ల్యపు టాపులో ఛార్జ్ అయిపోతుంది.ఆ లోపు మరో టపా మొదలు పెడ్తాగా.టాటా టిల్ దెన్.