19, ఫిబ్రవరి 2011, శనివారం

స్టార్ట్ సౌండ్? యాక్షన్ !

ఇదేదో సినిమాకి సంబందించిన టైటిలు లాగ ఉంది కదూ..నాక్కూడా అలాగే అనిపించింది..కాని కాదు.బుర్రకి ఈ  టైంలో అదే తట్టింది మరి..విషయం ఏంటంటే..ఈ మధ్య కొన్ని రోజులు నేను అనుభవించిన విపరీతమైన శబ్ద కాలుష్యము,ఆ సౌండ్  మొదలవగానే నేను తీసుకున్న యాక్షను వెరసి ఈ టైటిలు. 

ఆ మధ్య బాగా మబ్బు పట్టి  తుఫాను వస్తుంది అనుకుంటున్నా ఒకానొక రోజున,నా పాటికి నేను ముంతెడు కాఫీని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటె...చిటపట చినుకుల చక్కటి శబ్దం కాకుండా,ఇనప రేకుని  సిమెంట్ నెల మీద బరబరా ఈడుస్తున్న శబ్దం వచ్చి ఉలిక్కి పడ్డాను. కిటికీ లో నుండి తొంగి చుస్తే, మా కింద వాటా లోకి కొత్తగా ఎవరో వచ్చి చేరుతున్న సంకేతాలు వచ్చాయి.ఇల్లు మారేప్పుడు ఆ మాత్రం శబ్దాలు సహజమేలే అని సరిపెట్టుకున్నాను. కాకపొతే,ఈ దేశం లో కనీసం వారం ముందే  వాతావరణం ఎలా ఉండబోతుందో చెప్పినా,ఈ మందబుద్ధి  ఎవరో ఈరోజే గృహప్రవేశ  మహోత్సవం పెట్టుకు ఎడ్చాడెంటొ అని నవ్వుకుని ఊరుకున్నాను.

ఒక రెండు మూడు గంటలపాటు మొగుడు పెళ్ళాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమతో స్వచ్చమైన స్టీలు డేగిసాలు విసేరేసుకునే శబ్దాలు,ఇల్లు సర్దుతున్న? శబ్దాలు కాబోలు,వచ్చాయి కాని  ఆ పైన అంతా నిశ్శబ్దమే. హబ్బా..వాన వెలిసి వర్షం వచ్చినట్టుగా ఉంది..వర్షం నిజంగానే వచ్చింది.

మరుసటి రోజు గోడలకి  మేకులు కొడుతున్న శబ్దాలు, కొన్ని ఢమ ఢమలతో పాటు లీలగా వినిపించే అర్ధంకాని అదేదో సంగీతం. నేను పనిలో ఉండి పెద్దగా పట్టించుకోలేదు. ఆ మర్నాటికి మర్నాడు ఢమ ఢమలు తగ్గి అర్ధంకాని సంగీతం శృతి కాస్త హెచ్చింది.రోజులు గడిచే కొద్ది ఆ పిచ్చి మ్యూజిక్ పిచ్ మరికాస్త పెరుగుతూ పోయింది. ఆ శబ్ద తరంగాలకి ముందు చక్క నెల అదరటం, దాని మీద ఉన్న సోఫా కాస్త జరగటం, దానిపై  ఉన్న నేను ఇంకాస్త ఊగటం...ఇదంతా ఒక అనైచ్చిక క్రియ లాగా జరిగిపోతుంది..ఆ వచ్చే శబ్దం పాత తెలుగు పాటలంత బాగాలేకపోయినా,కంసేకం కొత్త హిందీ పాటలాగ ఉన్నా నేను ఏమి అనుకునేదాన్ని కానేమో.బట్..బిట్టర్ నిజం ఏంటంటే..ఆ మ్యు"సిక్" చాలా సిక్ గా ఉంది.

నిజం చెప్పొద్దూ..ఒక గులకరాళ్ళ డబ్బాని నెత్తిమీద పెట్టి సుత్తితో కొట్టినట్టు..కాసేపు టంగు టంగు మని, ఇంకాసేపు ఢభెల్ ఢభెల్ మనీ...సంగీతాన్ని అపహాస్యం చెయ్యటం కాదు కాని..ఆ కిందవాడి ఛాయస్ కి మాత్రం ముర్చపోకుండా ఉండలేం.రోజు సాయంత్రం నాలుగింటి నుండి ఏడింటి దాకా ఈ విచిత్ర కలాపోసనతో వేధించేసాడు వెధవాయ్. సాయంత్రం అయ్యేసరికి వెన్నులో నుండి వణుకు మొదలయ్యేది.అందుకే మిక్సీ మోతలలో,పోపు చిటపటలలో కుడా నాకు ఎంతో శ్రావ్యమైన సంగీతం వినపడినట్టు ఉండేది.వీడిని ఇలాగే వదిలేస్తే కష్టం అనిపించి,వాడు ఆ పాటలు పెట్టగానే నేను సిరివెన్నెలలోని  "ఆది భిక్షువు వాడినేది కోరేది" పాట పెద్ద సౌండ్తో మొదలెట్టేదాన్ని.ఉహు..లాభం లేదు..అటు వైపు దున్నపోతు మీద వాన పడ్డట్టు..ఏ చలనము లేదు..నిరంతర శబ్దశ్రవంతి తప్ప.

ఆ వారం,వీడి సౌండ్ దేబ్బకేనేమో,ఆకాశం బద్దలై మంచు తుఫాను కురిసింది.అటువంటి విపత్కర వాతావరణంలో ఆపీసుకి వెళ్ళలేక ఇంటినుండి పని చేసుకుందాం అంటే,ఆ రోజు అసలు సుప్రభాత సేవే మొదలెట్టేసాడు వాడు. పొద్దున్న ఏడింటికి మొదలెట్టిన సౌండు ఆపకుండా తారస్థాయి లో మధ్యానం దాక పేల్చాడు.సహనం నశించింది. ఏం చెయ్యాలో పాలు పోలేదు.అపార్ట్మెంట్ మెయిన్టేనేన్సకి ఫోన్ చేసి నా బాధ వెళ్ళగక్కి, మము బ్రోవమని చెప్పవే సిండి తల్లి..మము బ్రోవ మనీ చెప్పవే అని ప్రాధేయపడితే,ఆ సిండి పిల్ల "మీరే పోయి వాడికి చెప్పిరండి, వినకపోతే మాకు లిఖితపూర్వక విన్నపము సమర్పించుకుంటే, మేము తగు చర్య తీస్కున్నట్టు నటించి ఏమి చెయ్యము అని చెప్పింది.

ఆవేశ పూరితమైన నేను వెంటనే కిందకెళ్ళి దభిదభిమనీ వాడి తలుపులు బాదేసా..లోపలనుండి వచ్చే సౌండులో ఈ సౌండు కొట్టుకుపోయి వాడికి ఏమి వినపడినట్టు లేదు..తలుపు తెరుచుకోలేదు. 
చేసేది ఏమి లేక ఆ చలిలో,మోకాలెత్తు మంచులో ఈదుకుంటూ సరాసరి మెయిన్టేనేన్స ఆఫీసుకెళ్ళి మా ఇబ్బందిని తెలుపుతూ ఒక ఉత్తరం,మరియు వారి నిబంధనల ప్రకారం ఒక నాలుగు తెల్ల,నల్ల,యెర్ర,బులుగు ఫారంసు నింపేసి, ఇక కాస్కోరా నీ పని ఠా అని ఒక చిన్న సైజు వికటాట్టహాసం చేసి ఇంటికి చేరాను. 

ఈ లోపు సంవత్సరాది వచ్చింది...రోజు సాయంత్రానికి అలవాటుగా వచ్చేస్తున్నా తలనొప్పి రాకపోయేసరికి ఏమయ్యింది చెప్మా అని ఆలోచిస్తే..ఆహా..ఊహో..శబ్దం లేదప్పా...ఓయబ్బో మనమిచ్చిన కంప్లైంట్ మీద అప్పుడే యాక్షను తీసుకున్నట్టున్నారు ...ఏం చెప్పి ఉంటారో..ఫోన్ చేసి చెప్పుంటారా,లేకా ఇంటికి ఉత్తరం పంపి ఉంటారా అనుకుంటూ ఉత్సాహపు చర్చలు..మన పేరు చెప్పేసి ఉంటారా,లేక గోప్యంగానే ఉంచారా అని మీమాంసలు..భలే ఆనందంగా అనిపించింది.పనిమీద బయటికి వెళ్తూ కింద వాటా వైపు చుస్తే ఏ సబ్దము లేదు.. కొంపదీసి ఖాళి చేసి పోయాడా అని కుడా ఆశ పడిపోయేసాను. పది రోజులు అవగానే మళ్ళి మొదలయ్యింది..సేమ్ టు సేమ్ అదే సౌండు..ఈ సారి ఏడుపొచ్చింది. సెలవలకి దేశసేవ చెయ్యటానికి పోయినోడు మళ్లీ వచ్చినట్టున్నాడు. ఏం చేస్తాం..ఆఘమేఘాల మీద మళ్లీ  మెయిన్టేనేన్స ఆఫీసు కి ఫోను..

వాళ్ళు చెప్పిన సమాధానానికి చిర్రెత్తుకొచ్చింది.మా హెడ్ ఆఫీసుకి మీ ఉత్తరం పంపుతాము. వారు తగు చర్య తీసుకున్నట్టు త్వరలోనే, అంటే ఒక నెలా రెండు నెలలలో మాకు చెప్తారు..అప్పుడు మేము మీకు ఫోన్ చేసి చెప్తాము అని చిలకలా కూసిన కుతకి వీలయితే దాని పీక కోసెయ్యాలి అనిపించింది. అప్పటికే చాలా ఓర్పుతో నెల పైనే ఈ గోల భరించాము..అందుకే ఆ హెడ్ ఆఫీసుకే ఒక ఫోన్ కొట్టేసాము. వారు సెలవుల వలన ఈ మధ్య ఉత్తరాలు చూడలేదు, మీ ఉత్తరం అసలు అందిందో లేదో కుడా తెలిదు. అది దొరకగానే..అన్నిటికంటే తక్కువ విలువ ఉన్నా కంప్లైంట్ కాబట్టి...అవసరం అనుకుంటే పట్టించుకుని...తీరిక చేసుకుని మీకు మెల్లిగా ఫోన్ చేస్తాము అని వివరించారు.

వారాంతం వచ్చింది...వీడి పాటలతో పాటు పక్కింటిలో వాళ్ళు కుడా పెద్ద పార్టీ చేసుకుంటూ చిందులు తొక్కుతుంటే, దిండ్ల కింద తలకాయ పెట్టి, ముక్కు రంధ్రాలు మాత్రం బయటికి పెట్టి గాలి పీల్చి బతికేసాం.వీకెండ్ ఉత్సాహంలో వాళ్ళు ఉంటె,అప్పుడు మనమేమన్నా తప్పే అవుతుందిలే అని సరిపెట్టుకున్నాం.

ఇహ మర్సటి రోజు,సాయంత్రం నుండి పెట్టిన సౌండు చాలలేదు అన్నట్టు రాత్రికి  మంచి శుభ ముహూర్తం చూస్కుని వేర్రేత్తిపోయే స్థాయికి సౌండు పెట్టి ఆనందిస్తున్నాడు  ఆ శబ్దాసురుడు. మెల్లిగా లేచాను. ఒక అర ఠావు తీసుకున్నాను. తెల్లటి ఆ కాయితం మీద నల్లటి పెద్ద పెద్ద అక్షరాలతో "దయచేసి శబ్దం తగ్గించు" అని ఆంగ్లంలో బరికేసాను. మెల్లగా మెట్లు దిగి, తలుపు కింద నుండి ఆ కాయితం లోపలికి జరిపి, పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేసాను..
చెవులు రెక్కించి వింటున్నాను...రెండు నిమషాల తర్వాత జలపాతం నుండి ఒక్కో మైలు దూరం జరుగుతుంటే తగ్గుతూ వినిపించే శబ్దం లాగా...మెల్లిగా ఆ శబ్దాసురుడి సంగీత శబ్దం తగ్గింది. బిగపట్టిన ఊపిరి వదిలి చూసా..వినపడింది..ఊపిరి సౌండు. గడియారం వంక చూసా..టైం అర్ధరాత్రి .ఉవ్..వా..ఉవ్..వా...అంటే వీడు నిద్దరోతూ సౌండు తీసేసాడే కాని నా గొప్పతనం ఏమి లేదా అని కన్నీరు మున్నీరై నిశ్శబ్ద నిశి లోకి నిష్ క్రమించా..

ఇంకా పెద్దగా కధ లేదులే...మరుసటి రోజు నుండి సౌండు లేదు..ఉన్నా చాలా చిన్న సౌండు..నేను కావాలని నెలకి చెవులు ఆనించి వింటే తప్ప వినపడని సౌండు...అంటే నా చిత్తూ కాయితం చిట్కా పని చేసినట్టేనా..
ఏమో..గత నెలనాళ్లగా అయితే ఆ విచిత్ర సంగీత విన్యాసాలు లేవు...ప్రాణానికి హాయిగా ఉంది. గోటితో పోయేదానికి గొడ్డలెందుకు అని..నా బుర్ర ముందే పని చేసుంటే అటు ఇటు మొరపెట్టుకునేకంటే ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది అని నిట్టూర్చి...హైఇ..నా నిట్టుర్పు శబ్దం కుడా వినపడే నిశ్శబ్దం ఉందిప్పుడు..
అద్దన్నమాట సంగతి ..!

1 కామెంట్‌: