25, సెప్టెంబర్ 2012, మంగళవారం

కారు కధ



మా ఫ్రెండ్ కి ఒక కార్ వుండేది. అంటే ఇప్పటికి కుడా ఆ కార్ వుంది, కాని మా ఫ్రెండ్ దగ్గర కాదు. చదువు కోసం అమెరికా వచ్చిన కొత్తల్లో ఎవరో పళ్ళ డాక్టర్ పెళ్ళాం కొద్ది రోజులు డ్రైవింగ్ నేర్చుకుని, ఫ్రీగానో అర్ధ డాలర్ కో వీడికి ఆ కార్ అమ్మేసింది అట. సగటు స్టూడెంట్ గా, అప్పటి అవసరాలకి పనికొస్తున్న నాలుగు చక్రాల వాహనం కాబట్టి, దాని సుందర విశేష గుణగణాలని పెద్దగా పట్టించుకునేవాడు కాదు.
అదేంటో కారు దిద్దిన కాపురం లో లాగా వీడికి ఆ కార్ బాగా కలిసోచ్చేసరికి, రంగు వెలిసినా, వెనక సీట్ చిరిగిపోయినా, లోపల ఎయిర్ కండిషన్ పాడైపోయినా సరే, కార్ ని మాత్రం మార్చలేదు.

కాలం గడిచిపోయింది, కారు టయరులు అరిగిపోయాయి, ఇనప ముక్క కాబట్టి అక్కడక్కడ  తుప్పు కుడా పట్టింది.
పనిలో పని మనోడికి మంచి వుద్యోగం వచ్చి, పెళ్లి కుడా కుదిరింది. కొత్తగా పెళ్లి చేసుకుని కాపురం పెట్టటానికి వస్తున్నాడని , వీడి కారు చుస్తే అమ్మాయి అటునుంచటే  ఫ్లైట్ ఎక్కేసి పుట్టింటికి వెళ్ళిపోతుందని, జాలి తలచి, స్నేహితులందరూ ఒక బెంజ్ కారు లో ఎయిర్ పోర్ట్ నుండి పీపీపీ డుండుం ల తో ఇంటికి తీస్కోచ్చారు.

కొత్తగా పెళ్ళయ్యింది కాబట్టి ఆ అమ్మాయికి భార్తగారిని ఆరాధించటమే సరిపోయింది. పైగా వాళ్ళ ఇంటి బాల్కనీ నుండి, దూరంగా చెట్టు నీడన పార్క్ చేసిన ఆకుపచ్చ రంగు కారు కంటికి బాగానే కనిపించేది. అందుకే  కారు ప్రస్తావన అప్పటికి రాలేదు. మొదటిసారిగా ఇంట్లో సామాను తీసుకురావటానికి ఈ కొత్త జంట వాల్ మార్ట్ కి బయల్దేరారు. వెనకాల స్నేహితుల బ్యాచీ కూడా. తీరా  అక్కడ ఒక పెద్ద A .C కొని, కారు లో పెట్టె ప్రయత్నం చేసేప్పుడు ఆ అమ్మాయి అమాయకంగా వెనక డోర్ తియ్యండి, ఈజీ గ వెనక పెట్టేయ్యచ్చు అని సలహా ఇచ్చింది. మనోడు చిరాక్గా, వెనకెలా పెడతాం, కనపడట్లేదా అని ఉరిమాడు.

 మేమందరం ఒక్కసారిగా షాక్ తిన్నాం. ఈ పిల్ల ఏనాడూ చిరిగిపోయిన ఆ వెనక సీట్ట్ ని చూసినట్టు లేదు. అమ్మాయికి సైగ చేసి చెప్పాను, ఆ కారు కి రెండే తలుపులు. 2 డోర్ కార్ అని.
వెనక సీట్ కి చేరుకోవాలి అంటే ముందు సీట్ మీద నుండి హై జంప్ చెయ్యాలి! అందరిముందు కళ్ళతో యుద్ధం చేస్కుని, కొత్త జంట ఇంటికి చేరుకున్నారు. మర్నాడు మావాడు అనుకున్నట్టే నెత్తి  మీద బొప్పి తో కనపడ్డాడు. కలిసొచ్చింది, మార్చే ప్రసక్తే లేదని గట్టిగా చెప్పి ఒప్పించేసా రా అన్నాడు. మరే ..నిజమే మరి అన్నం మేమంతా.

ఆరు నెలల తర్వాత, ఒకరోజు గుడి నుండి వస్తు, చాల బిజీ రోడ్ మీద, మా వాడు పోటా పోటి గా కారు తోలేస్తుంటే, వెనక నుండి ఎవరో చేజ్ చేస్తున్నట్టు అనిపించి, కొత్త పెళ్ళాం భయపడిందట. చీర కట్టు విచిత్రంగా అనిపించి ఎవరన్నా మనని తరుముతున్నారా  అని అనుమానం కుడా వ్యక్తపరిచిందట . వెనక బండి లో ఫ్యాక్షన్ సినిమా విలన్లని పోలినవాళ్ళు కార్ ని గుద్దినంత పని చేసి, అద్దం దించమని సైగ చేసి, వెంటనే ఒక విజిటింగ్ కార్డు లోపలకి గిరాటేసి, కార్ తుప్పు తీస్తాం, we'll help you bro, మేము పని లేని మెకానిక్కులం, చాలా చీపు గా పని చేసి పెడతాం అని చెప్పి పోయారట. ఇంత అవమాన భారం భరించలేక వాడి భార్య, గుడిలో కొట్టేసిన అర కొబ్బరిచిప్ప వాడింది. మర్నాడు మళ్ళి నెత్తి మీద బొప్పి తో కనపడ్డాడు.

ఈ సారి మాత్రం "ఒప్పించేసా" లాంటి డైలాగులు కొట్టలేదు. హోండా CRV బుక్ చేశాన్ రా, ఏదో మంచి డీల్ వుందని మీరేగా చెప్పారు, అందుకనీ ...అని సాగదీస్తూ, నెత్తి  రుద్దుకుంటూ పోయాడు.